న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.1975 జూన్ 25న అప్పట్లో దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రజాస్వామ్యవా దుల్ని అత్యంత క్రూరంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాల వల్ల దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రమాదంలో పడతాయని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు.
‘మన దేశంలో రాజ్యాంగమే అత్యుత్తమం. ప్రజాస్వామ్య విలువలున్న ఈ దేశంలో జూన్ 25ని ఎప్పటికీ మర్చిపోలేము. అది దేశ చరిత్రలో ఒక చీకటి యుగం’’ అని ప్రధాని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమర్జెన్సీపై రాసిన టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం గురించి తెలుసుకున్నానని తెలిపారు. అందులో ఎన్నో కేస్ స్టడీల్లో ఇందిర ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించిందో తెలుస్తుందన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరగాల్సిన మన్‌కీ బాత్ ప్రధాని అమెరికా పర్యటనతో ముందే ప్రసారమైంది.
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రతీ ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ రోజూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం రోజు యూఎన్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చిందని ప్రధాని చెప్పారు. తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి మనం చేరుకున్నామని ప్రధాని చెప్పారు. గుజరాత్‌లో బిపర్‌జోయ్ తుపాన్ బీభత్సం నుంచి కచ్ ప్రజలు వేగంగా కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment