అల్లదిగో ఎమర్జెన్సీ | indira gandhi create internal emergency in India | Sakshi
Sakshi News home page

అల్లదిగో ఎమర్జెన్సీ

Published Sun, Jun 26 2016 1:01 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

అల్లదిగో ఎమర్జెన్సీ - Sakshi

అల్లదిగో ఎమర్జెన్సీ

త్రికాలమ్
ఇప్పుడు ఇంత వివరంగా ఆత్యయిక పరిస్థితికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేయడం ఎందుకంటే ఎమర్జెన్సీ ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉంది. ఇందిర స్వభావానికీ, నరేంద్ర మోదీ స్వభావానికీ పెద్ద తేడా లేదు. ఇందిరకు సంజయ్ గాంధీ ఎట్లాగో నరేంద్ర మోదీకి అమిత్ షా అట్లాగేనని అంటున్నారు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ. ఇద్దరిదీ ఆధిపత్య ధోరణే. నాడు ఇందిరపైన ఉన్నటువంటి ఒత్తిళ్ళు నేడు నరేంద్ర మోదీ పైన లేవు.
 
‘వాజపేయి దగ్గరికి పోతున్నా. వస్తావా?’. బెంగుళూరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చీఫ్ రిపోర్టర్ సుబ్బారావు కారులో జైలుకు వెళ్ళాం. అక్కడి అధికారులతో సుబ్బారావు కన్నడంలో మాట్లాడి వాజపేయి ఉన్న గదివైపు నడిచారు. అత్యంత ఉత్సాహంగా ఆయన వెనకే నేను. వాజపేయితో మహత్తరమైన విషయాలు ఏమీ చర్చించలేదు. ఆయనతో సుబ్బారావు రెండు నిమిషాలు మాట్లాడారు. నేను నోరువిప్పలేదు. ఒక ధీరోదాత్తుడిని దర్శించడమే మహాభాగ్యంగా భావించి నేను వెళ్ళాను. వాజపేయి ఆరోగ్యం గురించి తెలుసుకొని కొల్‌కతా ఆస్పత్రిలో ఉన్న సేఠ్‌జీ (రామ్‌నాథ్ గోయెంకా)కి చెప్పడం కోసం సుబ్బారావు జైలుకు వెళ్ళారు. వాజపేయి నడుం నొప్పితో బాధపడుతున్నారు. ఆ జైలులోనే అడ్వానీ కూడా ఉన్నారు. ‘మీరు ఎప్పుడైనా వాజపేయిని కానీ అడ్వానీని కానీ కలుసుకునేందుకు వెడితే మీ వెంట నేను వస్తా, మీకు అభ్యంతరం లేకపోతే’  అని రెండు వారాల  కిందట చేసుకున్న విన్నపాన్ని మన్నించి ఆ రోజు సుబ్బా రావు తన వెంట నన్ను తీసుకువెళ్ళారు.

నలభై ఒక్క సంవత్సరాల కిందట సరిగ్గా 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి అవుతోందనగా నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ దేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి)ని విధించారు. 1977 మార్చి 1 వ తేదీ వరకూ ఆత్యయిక పరిస్థితి అమలులో ఉంది. ఆ సమయంలో నేను ఆంధ్రప్రభ బెంగ ళూరు ఎడిషన్‌లో సబ్‌ఎడిటర్. ఆత్యయిక పరిస్థితి కింద పౌర హక్కులనూ, పత్రికా స్వేచ్ఛనూ హరించడం పట్ల నిరసనగా మర్నాడు (జూన్ 26) సంచికలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకీయం ఉండవలసిన చోట అక్షరం లేకుండా ఖాళీగా వదిలేసింది. అదే సంస్థకు చెందిన ‘ఫినాన్సియల్ ఎక్స్‌ప్రెస్’ సంపాదకీయం స్థానంలో రవీంద్రనాథ్ టాగోర్ రచించిన ‘ వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్ ఫియర్...’ గేయాన్ని పెద్ద అక్షరాలతో ముద్రించింది.

తెలుగులో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి కూడా సంపాదకీయం స్థలాన్ని ఖాళీగా వదిలాయి. కొన్ని పత్రికలు బుద్ధిగా వ్యవహరించాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అధినేత రామ్‌నాథ్ గోయెంకా ఆత్యయిక పరిస్థితిని శక్తివంచన లేకుండా ప్రతిఘటించిన ఉత్తమశ్రేణి పత్రికాధిపతి. ఆ రోజుల్లో అరుణ్‌శౌరి తరచు బెంగళూరు వస్తూ ఉండేవారు. దేశం నలుమూలల  నుంచి వివరాలు తెప్పించుకొని అక్కడే  పరిశోధనాత్మక వార్తాకథనాలు వండివార్చేవారు. సేఠ్ జీతో ఎప్పుడూ సంపర్కంలో ఉండే సీనియర్ జర్నలిస్టు ఆయనే. ప్రభుత్వం ఒత్తిడి భరించలేక ప్రధాన సంపాదకుడిగా మూల్గాంకర్‌ను తొలగించి వీకే నరసింహన్‌ను నియమించిన తర్వాత నిరంకుశ ప్రభుత్వంపైన గోయెంకా ప్రయోగించిన అద్భుతమైన ఆయుధం అరుణ్‌శౌరీ. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లో పని చేయడమే సాహసంగా, అదృష్టంగా పరిగణించిన చారిత్రక సందర్భం అది. ప్రతిఘటనలో పాలుపంచుకోవడం ఎన్నటికీ మరచిపోలేని అనుభవం.

చిత్తుచిత్తు...
ఇరవై ఒక్క మాసాల తర్వాత ఇందిరాగాంధీ స్వయంగా ఆత్యయిక పరిస్థితిని రద్దు చేసి ఎన్నికల కార్యక్రమం ప్రకటించారు. విధేయత ప్రదర్శిస్తున్న పత్రికలు ప్రచురించిన సానుకూల వార్తలు చదువుకొని అంతా సవ్యంగానే ఉన్నదనీ, ప్రజలు పరమసంతోషంగా ఉన్నారనీ, ఎన్నికలు నిర్వహిస్తే మెజారిటీ సాధిం చడం ఖాయమనీ ఆమె భావించి ఉండవచ్చు. 1971లో మూడింట రెండు వంతుల మెజారిటీ కంటే అధికంగా ఉన్న కాంగ్రెస్ బలం 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 153 స్థానాలకు పడిపోయింది. వాటిలో 92 స్థానాలు దక్షిణాది నుంచే. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 42 స్థానాలలోనూ నీలం సంజీవరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల మినహా తక్కిన 41 స్థానాలూ  కాంగ్రెస్‌కే దక్కాయి. ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఇందిర, సంజయ్ ఇద్దరూ ఓటమి పాలైనారు.

ఆత్యయిక పరిస్థితి ప్రకటించాలన్న తీవ్రమైన నిర్ణయం ఇందిరాగాంధీ ఎందుకు తీసుకున్నారు? 1971 ఎన్నికలలో రాయ్‌బరేలీ నియోజకవర్గంలో రాజ్‌నారాయణ్‌ను ఇందిరాగాంధీ పెద్ద మెజారిటీతో ఓడించారు. అధికార దుర్వినియోగానికి తెగబడ్డారని ఆరోపిస్తూ రాజ్‌నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్‌నారాయణ్ తరఫున శాంతి భూషణ్ (ఆమ్‌ఆద్మీ పార్టీ సంస్థాపకులలో ఒకరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ తండ్రి, ఇందిర న్యాయవాది నానీ పాల్కీవాలా) వాదించారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా యశ్పాల్ కపూర్ అనే అధికారి ఇందిర ఎన్నికల ప్రచారంలో పనిచేశారన్న ఆరోపణ నిర్ధారణ అయినట్టు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగ్‌మోహన్‌లాల్ సిన్హా నిర్ణయించి ఇందిర ఎన్నిక చెల్లనేరదంటూ చరిత్రాత్మకమైన తీర్పు చెప్పారు. మరో ఆరేళ్ళ పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి సైతం ఆమె అనర్హురాలంటూ ప్రకటించారు. అప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలతో, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థతో, జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సాగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం హోరుతో అభద్రతాభావం ఇందిరను ఆవహించింది.

అలహాబాద్ హైకోర్టులో క్రాస్ పరీక్షకు ఇందిరాగాంధీ హాజరైనారు. కోర్టులో బోనెక్కిన మొదటి ప్రధాని ఆమె. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అప్పుడు వేసవి సెలవుల్లో వెకేషన్ జడ్జిగా ఉన్న జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై జూన్ 24న షరతులతో కూడిన స్టే ఇచ్చారు. ప్రధానమంత్రిగా ఆమె విధులు నిర్వర్తించవచ్చుగానీ పార్లమెంటులో జరిగే ఓటింగ్‌లో పాల్గొనకూడదని షరతు విధించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై బేషరతు స్టే వస్తుందనుకున్న ఇందిరాగాంధీకి ఇది ఊహించని షాక్. నాటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థశంకర్ రే సలహా మేరకు ఇందిర ఆత్యయిక పరిస్థితి వైపు మొగ్గు చూపారు. 352 (1)వ అధికరణం వినియోగించుకొని అసాధారణమైన అధికారాలు హస్తగతం చేసు కున్నారు. సంజయ్‌గాంధీ చక్రం తిప్పేవారు.

బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లూ, టర్క్‌మన్‌గేటు ఉదంతం, పాత ఢిల్లీలో విధ్వంసం సంజయ్ ఖాతాలో చేరిన అడ్డగోలు, దుందుడుకు చర్యలు. పేరుకు దేశీయాంగ మంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పటికీ సహాయ మంత్రి ఓం మెహతాదే (హోమ్ మెహతా అనేవారు)పెత్తనం. ఆత్యయిక పరిస్థితి ప్రకటించిన సంగతి బ్రహ్మా నందరెడ్డితో పాటు తక్కిన కేంద్ర మంత్రిమండలి సభ్యులందరికీ రేడియో ద్వారానో, మర్నాడు పత్రికల ద్వారానో తెలిసింది. రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత కేంద్ర మంత్రిమండలి ఆత్యయిక పరిస్థితి ప్రతిపాదనను ఆమోదిం చింది. ఎమర్జెన్సీ ప్రకటించిన కొద్ది గంటలకే అన్ని పత్రికా కార్యాలయాలకీ విద్యుచ్ఛక్తి సరఫరా నిలిపివేశారు. అక్షరంపైన అక్రమయుద్ధం అప్పుడే ఆరంభం. సోషలిస్టు శక్తులూ, ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్, సీపీఎం, ఇతర వామపక్ష శ్రేణులూ ఆత్యయిక పరిస్థితిని ఎదిరించి పోరాడి దేశ ప్రజలలో ప్రజా స్వామ్య స్పృహను పెంపొందించాయి. జార్జి ఫెర్నాండెస్ (బరోడా డైనమైట్ కేసులో ముద్దాయి) వంటి నాయకులు పోరాడి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు.

ఇప్పుడెందుకు ఇదంతా?
ఇప్పుడు ఇంత వివరంగా ఆత్యయిక పరిస్థితికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేయడం ఎందుకంటే ఎమర్జెన్సీ ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉంది. ఇందిర స్వభావానికీ, నరేంద్రమోదీ స్వభావానికీ పెద్ద తేడా లేదు. ఇందిరకు సంజయ్ గాంధీ ఎట్లాగో నరేంద్రమోదీకి అమిత్‌షా అట్లాగేనని అంటున్నారు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ. ఇద్దరిదీ ఆధిపత్య ధోరణే. నాడు ఇందిరపైన ఉన్నటువంటి ఒత్తిళ్ళు నేడు నరేంద్రమోదీపైన లేవు. అయినా నిరంకుశత్వపు ఛాయలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు కానీ,  తమిళ నాడులో జయలలిత కానీ, ఇతర రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు కానీ అందరినీ సంప్రదించి, ప్రతిపక్షం, పత్రికలూ ఇచ్చిన సలహాలను స్వీకరించి నిర్ణయాలు తీసుకుంటున్నారా? తాము అనుకున్న మార్గానికి భిన్నంగా ఎవరు ఎంత మొత్తుకున్నా ఆలకించడానికి మన ముఖ్యమంత్రులు సిద్ధంగా ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణంపైన కేంద్ర ప్రభుత్వం నియమించిన కె. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చదవకుండానే బుట్టదాఖలు చేసి సింగపూరు పాట లంకించుకున్న చంద్రబాబునాయుడు ఎవరిని సంప్రదించి స్విస్ చాలెంజ్ విధానం అమలు చేస్తున్నారు? ఏటా మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుంచి నయానోభయానో సేకరించి సింగపూరు కంపెనీలకు ధారాదత్తం చేస్తానని ఎన్నికల ప్రణాళికలో ప్రకటిం చారా? ఎమర్జెన్సీ పొంచి ఉందంటూ బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అడ్వానీ ఎందుకు వ్యాఖ్యానించారు? శిష్యుడు మోదీ మనస్తత్వం ఆయనకు తెలుసు. వివిధ రాష్ట్రాలలో పరిపాలన సాగిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతల ప్రజాస్వామ్య స్పృహ ఏపాటిదో ఆయనకు కరతలామలకం.

అప్రకటిత ఎమర్జెన్సీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ఫిర్యాదు చేయని రోజు లేదు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరూ, సాగించిన దమనకాండా ఆత్యయిక మనస్తత్వానికి దృష్టాంతాలు. ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష సందర్భంగా ‘సాక్షి’, ‘నంబర్ వన్’ చానళ్ళ ప్రసారాలను ఆపివేయించిన చంద్రబాబునాయుడు వైఖరికీ, కాంగ్రెస్ గీతం ఆలపించడానికి నిరాకరించిన ప్రముఖ గాయకుడు కిశోర్‌కుమార్ పాటలను ఆకాశవాణిలో నిషేధించిన ఆత్యయిక పరిస్థితి నాటి కేంద్ర సమాచార శాఖ మంత్రి విద్యాచరణ్ శుక్లా వైఖరికీ తేడా ఏమున్నది? శుక్లా ఎన్నడూ పత్రికలను తీసివేసుకుంటామంటూ బెదిరించలేదు.

చంద్రబాబునాయుడూ, ఆయన మంత్రులూ ‘సాక్షి’ని స్వాధీనం చేసుకుంటామంటూ అదే పనిగా ప్రకటనలు చేస్తున్నారు. తన విధానాలనూ, పనితీరునూ, అవినీతినీ విమర్శించేవారందరినీ అభివృద్ధి నిరోధకులుగా అభివర్ణిస్తూ మండిపడుతున్న చంద్రబాబు నాయుడులో ఇతరుల అభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామ్యవాది కనిపిస్తున్నాడా? పాలకులను ప్రశ్నించే బాధ్యతను సమాజం ఎప్పుడైతే విస్మరిస్తుందో, పత్రికలు ఎప్పుడైతే అధికారంలో ఉన్నవారికి వంతపాడతాయో అప్పుడు పాలకులలో నిరంకుశ ధోరణి ప్రబలుతుంది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. ప్రభుత్వం చేయవలసిన పనులు చేయనందుకు నిరసనగా ప్రదర్శనలు చేస్తున్నవారిని పోలీసులు ఎంత నిర్దాక్షిణ్యంగా చితకబాది అణచివేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవే ఎమర్జెన్సీ వ్యాధి లక్షణాలు.

ప్రశ్నించే హక్కును కాలరాయడం, ప్రతిపక్షం గొంతు నొక్కడం, ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం, పత్రికలనూ, వార్తాచానళ్ళనూ  నియంత్రించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రజలపైన రుద్దడం, చట్టసభలలో చర్చిం చకుండానే వేలాదికోట్ల రూపాయల పనులు చేపట్టడం, ప్రాజెక్టుల ఖర్చు అంచనాలను నిగూఢంగా పెంచి వేయడం...ఇవన్నీ ఆత్యయిక పరిస్థితిని తలపించే భయానక పరిణామాలే. నాలుగు దశాబ్దాల కిందట రాజకీయ నాయకులలో, కార్యకర్తలలో, సామాన్య పౌరులలో ప్రజాస్వామ్య భావజాలం బలంగా ఉండేది. పోరాట పటిమ ఉండేది. ఇప్పుడు సమాజహితం పట్టించు కోకుండా ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అనుకుంటూ తమ సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే కొత్త తరం వచ్చింది. నియంతృత్వ ధోరణులకు తలవంచి సర్దుకొనిపోయేవారే ఎక్కువ. ఎదిరించి పోరాడేవారు తగ్గిపో తున్నారనే ఆందోళన  కలుగుతోంది. ఇందుకు నిర్దిష్టమైన ఆధారం ఏదీ లేదు. దేశంలో ప్రబలుతున్న అప్రజాస్వామిక, అసహన ధోరణులను పరిశీలిస్తే ఆత్యయిక పరిస్థితి అనే కాలనాగు ప్రజాస్వామ్య వ్యవస్థని ఎప్పుడైనా కాటు వేయవచ్చుననే భయం పీడిస్తూనే ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.


కె.రామచంద్రమూర్తి
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement