
న్యూఢిల్లీ: స్పీకర్‌గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్‌సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు.
ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.
‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్‌సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు.
ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్‌గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ
ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు.