రూపురేఖల్లో మాత్రమే ప్రియాంక నాయనమ్మను పోలివుందా? జనం మదిని గెలవడంలోనూ, ప్రజల హృదయాలను తాకడంలోనూ, అన్న రాహుల్‌తో పోలికే లేదా? జనంతో మమేకమవుతున్న తీరు, స్వీయ భద్రతను సైతం తోసిరాజని ప్రజల దరి చేరేందుకు ఆమె చూపుతోన్న చొరవ ప్రియాంకా ఛరిష్మాను రెట్టింపు చేస్తున్నాయన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆలయాల్లో దైవ దర్శనం నుంచి, పార్టీ కార్యకర్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటం వరకు ప్రియాంక తీరు చూస్తోంటే, కాంగ్రెస్‌కి పునర్వైభవం వచ్చినట్టేనన్న అభిప్రాయానికి బలం చేకూరుతోంది. చీరకట్టు మొదలుకొని పెద్దలకు నివాళ్లర్పించి ప్రచారాన్ని ప్రారంభించడం వరకూ ఆమె ప్రతి అడుగూ నాయనమ్మ ఇందిరమ్మను తలపిస్తోందంటున్నారు ఆమె సభలకు హాజరైన ప్రముఖులు. రాజకీయవేత్తగా ప్రియాంక వాద్రా పరిణతి చెందడానికి ఇంకా సమయముందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నా.. రాజకీయాల్లో ఆమె తొలిఅడుగులు ఆమెలోని సహజసిద్ధ నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతున్నాయి.
మాటల్లో పరిణతి..
చాలా కాలంగా ప్రియాంకను రాజకీయ రంగప్రవేశం చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నా.. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేతికి వచ్చాక, మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో విజయాలు సాధించిన తరువాతే ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోవడం ఆమెకు రాజకీయాల్లో ఉన్న సానుకూలతను ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఇప్పటికీ పార్టీలోని చాలామంది ప్రియాంక రాజకీయ ప్రవేశం ఇంకా ముందే జరిగి ఉండాలనే అభిప్రాయంతో ఉన్నా.. ఎంట్రీ ఎప్పుడిచ్చినా అది అన్న రాహుల్ నాయకత్వానికి సానుకూలతను సాధించిపెట్టడానికే అన్న భావన ప్రస్ఫుటమౌతోంది. అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రియాంక మాట్లాడిన మాటలు ఆమె పరిణతి వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.
జనంతో మమేకం..
ఎన్నికల ప్రచారానికి నిర్దేశించిన టైమ్ షెడ్యూల్‌ని ప్రియాంక వాద్రా ఎప్పుడూ పాటించలేదు. నిజానికి ఆమె జనంలోకి వెళ్లాక ఆమెను పట్టుకోవడం గగనమే. జనం మధ్యలోంచి దూసుకెళుతోన్న కారుని ఆమె ఏ క్షణంలోనైనా ఆపేసి కారు దిగి రోడ్డువారగా బారులుతీరిన జనంతో కరచాలనం చేస్తుంది. భద్రతాసిబ్బంది వారిస్తున్నా వినకుండా జనం మధ్యలోకి వెళ్లిపోతుంది. నిజానికి రాహుల్ కన్నా ప్రియాంక ఎంతమంది జనం మధ్యలో ఉన్నా ఎలాంటి ఇబ్బందీ లేకుండా కలగలిసిపోగలదు. అంతేకాదు. తన కారులోనే పార్టీ కార్యకర్తలను ఎక్కించుకొని ఒక నాయకురాలి సరసన కూర్చునే అవకాశంతో పరవశించిపోయిన వారి ముఖాల్లో ఆనందాన్ని ఆస్వాదించనూగలదు.
నాయనమ్మ శైలిలో..
ఆనంద్‌భవన్‌కి వెళ్లి పెద్దల ఫొటోల వద్ద పూలు ఉంచి నివాళ్లర్పించి ప్రచారాన్ని ప్రారంభించడం నాయనమ్మ ఇందిరాగాంధీని తలపిస్తోంది. ప్రచారంలో సైతం నాయనమ్మ చీరలనే ప్రియాంక కట్టుకుంటున్నారు. అయితే ఇందిరాగాంధీ కన్నా ప్రియాంక కాస్త పొడవు కావడంతో ఇందిరాగాంధీ కట్టిన చీరలు రెండింటిని కలిపి కుట్టించి ప్రియాంకా ధరిస్తోంది. ఎటువంటి దర్యాప్తులకూ భయపడనని స్పష్టం చేస్తోన్న ప్రియాంకా వాద్రా తను ఎక్కడున్నా పెదవులపై చిరునవ్వుని చెరగనివ్వకపోవడం ఆమె స్థైర్యాన్ని చెప్పకనే చెపుతోంది.
మొదట ఆలయం.. ఆపై ప్రచారం
స్వతహాగా ప్రియాంక బుద్ధిస్టు అయినప్పటికీ తను ఎక్కడ ప్రచారం ప్రారంభించాలన్నా ముందుగా ఆ ప్రాంతంలోని ప్రముఖ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆపై ప్రచారానికి శ్రీకారం చుడతారు. గుళ్లో నుంచి బయటకు వచ్చిన ప్రియాంకను ‘మీ సోదరుడి కోసం మీరు ప్రార్థించారా?’ అని మీడియా ప్రశ్నిస్తే మతాన్ని రాజకీయాల నుంచి వేరుగా చూడాలని వ్యాఖ్యానించడంలోని అంతరార్థం ఆమె రాజకీయ పరిణతికి నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రియాంకాలో ఎన్ని ప్రత్యేకతలున్నా తన దారిలో ఎదురైన అన్ని అడ్డంకులనూ దాటుకొని విజయతీరాలను చేరుకోవడం నల్లేరు మీద నడకైతే కాదు. ఇంత క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ను గట్టెక్కించడం కష్ట సాధ్యమే. దీర్ఘకాలిక ప్రణాళికతో తన ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు కూడా ప్రియాంక కనిపిస్తోంది. దళితులకు దగ్గరవడం కోసం బీజేపీలో చేరాలని భావించి, ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోన్న దళిత నాయకురాలు సావిత్రీబాయి ఫూలేని వెంటబెట్టుకొని దళిత ఓటర్లదగ్గరికి వెళుతున్న ప్రియాంక ఎత్తుగడలు నాయనమ్మ ఇందిరమ్మను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ పలువురు వెనుకబడిన వర్గాల ప్రజలను కలుస్తున్నారు. బోటులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఆమె పక్కన చాలామంది కూర్చోవాలనే కుతూహలంతో ఉన్నా, ఆమె పక్కన స్త్రీలకెప్పుడూ చోటుంటుంది. కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక యూపీలో ఇదే ఆమె తొలి ప్రచార కార్యక్రమం. దీని తరువాత ఆయోధ్య, రాయ్‌బరేలిలో కూడా ప్రియాంక పర్యటించనున్నారు. ప్రియాంకకు ఉన్న ఛరిష్మా, కలిసిపోయే మనస్తత్వం కాంగ్రెస్ విజయానికి ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.
ఒంటరి పోరు..
అయితే ఇంత చేస్తున్నా కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్‌లో ప్రియాంకా వాద్రా కనిపించకపోవడం విచిత్రం. అలహాబాద్ నుంచి వారణాసి వరకూ ప్రియాంక ప్రచార కార్యక్రమాన్ని గురించి కనీసం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్‌లో ప్రస్తావించ లేదు. అయితే సరిగ్గా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హోదాలో మార్చి 17 నుంచి, 20 వరకూ జరిగిన ప్రియాంక ప్రచార కార్యక్రమ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మోదీపై విమర్శనాస్త్రాలతో సహా వివిధ అంశాలపై మొత్తం 100 ట్వీట్లు చేసింది. వీటిలో ఒక్కటీ ప్రియాంక ప్రచారం గురించి లేవు. అయితే సోషల్ మీడియాలో తనపై వస్తోన్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ సహకారం లేకుండానే ప్రియాంకా ఒంటరి పోరాటం కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment