కొమ్మాది (భీమిలి): ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకోవాలని ఇక్కడి జేవీ అగ్రహారం, నిడిగట్టు, కొత్తవలస రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సూచించారు. పర్యాటక ప్రాంతం ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేస్తున్నారంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలను వారు ఖండించారు. గురువారం ఎర్రమట్టి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఈ ప్రాంతాల్లో ఒక్కో రైతుకు 5 ఎకరాలు ఇచ్చారని తెలిపారు.
కాలక్రమేణా పంటలు పండకపోవడంతో ప్రభుత్వం ఈ భూములను అభివృద్ధి చేస్తామనడంతో లాండ్ పూలింగ్‌కు ఇచ్చామని, తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని చెప్పారు. బుధవారం పవన్ పర్యటించిన ప్రాంతం నుంచి కనుచూపు మేరలో కూడా ఎర్రమట్టి దిబ్బలు లేవన్నారు. అసలు ఎర్రమట్టి కనిపించే ప్రాంతమంతా ఎర్రమట్టి దిబ్బలు కావని పవన్ తెలుసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మట్టి ఎర్రగా ఉంటుందని, అలా అని ఊరంతా ఎర్రమట్టి దిబ్బలంటే ఎలా అని ప్రశ్నించారు. పవన్ పర్యటించిన ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులు రైతుల వద్ద తక్కువ ధరకు డీఫారం భూములు కొన్నారని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక లాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మేలు జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు చవగ్గా లాగేసుకున్నా మాట్లాడని పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని ప్రజల్లోకి వెళ్లాలే తప్ప ఇతర పార్టీల లబ్ధికోసం పేదల పొట్టకొట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతోపాటు వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకులు రామకృష్ణ, నల్లబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment