
చెన్నారెడ్డి
దేశ చరిత్రలో ఎమర్జెన్సీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇందిరాగాంధీ నియంతృత్వంగా వ్యవహరించి 1975–77 మధ్య దేశవ్యాప్తంగా అత్యయికస్థితిని కల్పించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎందరో మేధావులు, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు, పత్రికా ప్రతినిధులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977లో సార్వత్రిక ఎన్నికలు.. 1978లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశమంతా ఇందిర ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్పునిస్తే.. తెలుగు ప్రజలు మాత్రం ఇందిరకు బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రెండోసారి చీలినా.. (1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటిసారి) ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) చావుదెబ్బతిని మూడోస్థానానికి పరిమితమైంది.
దేశం నివ్వెరపోయేలా!
1977 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 42 సీట్లలో (నీలం సంజీవరెడ్డి స్థానం మినహా) 41 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తెలంగాణలోని మొత్తం 15 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే ఏకపక్షంగా విజయఢంకా మోగించారు. అయితే.. 1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో చీలింది. ఇందిరాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ (ఐ) ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ హస్తం గుర్తుతోనే పోటీచేసింది. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్(ఆర్) పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ (రెడ్డి) సర్కార్ నేతృత్వంలోనే (జలగం సీఎంగా) 1978 ఎన్నికలు జరిగాయి.
హస్తం జోరు...
1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. అప్పటివరకు ఆవు–దూడ ఎన్నికల చిహ్నంతో కాంగ్రెస్ పార్టీ పోటీచేసింది. 1978 శాసనసభ ఎన్నికల నుంచి హస్తం గుర్తుపై బరిలో దిగింది. ఈ ఎన్నికలతో హస్తం గుర్తుకు ప్రజాదరణ పెరిగింది. మొత్తం 294 సీట్లలో 175 స్థానాల్లో (తెలంగాణలోని 107 స్థానాల్లో 65 సీట్లు) ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. జనతాపార్టీ 60 సీట్లతో రెండోస్థానంలో నిలవగా రెడ్డి కాంగ్రెస్ 30 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. తెలంగాణ ప్రాంతంలో ఇందిరాకాంగ్రెస్ 65, జనతాపార్టీ 15, కాంగ్రెస్(ఆర్) 12, సీపీఎం 05, సీపీఐ 03, ఇండిపెండెంట్లు 7 సీట్లలో గెలిచారు.
తగ్గుతూ వస్తున్న మహిళా ఎమ్మెల్యేలు
తెలుగురాష్ట్రంలో 54 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా పోటీచేయగా.. 10మంది విజయం సాధించారు. ఇందులో ఏడుగురు ఆంధ్ర ప్రాంతం నుంచి ముగ్గురు తెలంగాణ నుంచి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం (ఎస్సీ) స్థానం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీచేసిన సుమిత్రాదేవి, జనతాపార్టీ అభ్యర్థిగా హిమాయత్‌నగర్ నుంచి తేళ్ల లక్ష్మీకాంతమ్మ విజయం సాధించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సీపీఎం నేత మల్లు స్వరాజ్యం ఎన్నికయ్యారు. జుక్కల్ (ఎస్సీ) సీటు నుంచి పోటీచేసిన రిపబ్లికన్‌పార్టీ నేత జెట్టి ఈశ్వరీబాయి, కార్వాన్ నుంచి జనతాపార్టీ టికెట్‌పై పోటీచేసిన టీఎన్ సదాలక్ష్మీ ఓటమి పాలయ్యారు. మలక్‌పేట స్థానం కాంగ్రెస్ (ఐ) నుంచి పోటీ చేసిన సరోజినీపుల్లారెడ్డి కూడా ఓడిన వారిలో ఉన్నారు.
కాంగ్రెస్ (ఆర్) డిపాజిట్లు గల్లంతు
257 స్థానాలకు పోటీ చేసిన రెడ్డి కాంగ్రెస్‌కు 130 చోట్ల ధరావతు దక్కలేదు. ఇందిరా కాంగ్రెస్ 290 సీట్లలో పోటీచేయగా 18 స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు కోల్పోయింది. 270 చోట్ల అభ్యర్థులను నిలిపిన జనతాపార్టీ 36 చోట్ల, 31 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ 12 చోట్ల, సీపీఎం 22 సీట్లలో పోటీచేసి ఒక చోట ధరావతు కోల్పోయాయి. ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 640 మంది ఇండిపెండెంట్లు పోటీచేయగా.. 593 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఎంపీలుగా యోధానుయోధులు
మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి (నంద్యాల), కాసు బ్రహ్మానందరెడ్డి (నరసారావుపేట), పీవీ నరసింహారావు (హన్మకొండ) ఈ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి ఎంపీలైన వారిలో కొత్త రఘురామయ్య (గుంటూరు), కోట్ల విజయభాస్కరరెడ్డి (కర్నూలు), పూసపాటి విజయరామ గజపతిరాజు (బొబ్బిలి), పి.రాజగోపాల నాయుడు (చిత్తూరు), ద్రోణంరాజు సత్యనారాయణ (విశాఖపట్నం), వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ (పార్వతీపురం–ఎస్టీ) ఉన్నారు. తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన వారిలో పీవీతోపాటు జి.వెంకటస్వామి (సిద్దిపేట–ఎస్సీ), రాజా రామేశ్వరరావు (పాలమూరు), ఎం.ఎం.హాషీం (సికింద్రాబాద్), కె.సత్యనారాయణ (హైదరాబాద్), ఎం.సత్యనారాయణరావు (కరీంనగర్), జలగం కొండల్ రావు (ఖమ్మం), మహ్మద్ అబ్దుల్ లతీఫ్ (నల్లగొండ) తదితరులున్నారు.
ఫిరాయింపుల జోరు
1978 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొంతకాలానికే.. కాంగ్రెస్(ఐ)లోకి రెడ్డి కాంగ్రెస్, జనతాపార్టీ ఎమ్మెల్యేలు చేరిపోయారు. రెడ్డి కాంగ్రెస్ నుంచి 27 మంది (మొత్తం 30), జనతాపార్టీ టికెట్‌పై 44 మంది (మొత్తం 60) ఇందిరా కాంగ్రెస్‌లో చేరారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో వెంకయ్య గెలుపు
ఆంధ్ర ప్రాంతం ఎమ్మెల్యేలుగా ఉదయగిరి నుంచి ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు జనతాపార్టీ టికెట్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. సర్దార్ గౌతులచ్చన్న (సోంపేట–జనతాపార్టీ), పుచ్చలపల్లి సుందరయ్య (గన్నవరం–సీపీఎం), శత్రుచర్ల విజయరామరాజు (నాగూరు–జనతాపార్టీ), పూసపాటి అశోకగజపతిరాజు (విజయనగరం–జనతాపార్టీ), భాట్టం శ్రీరామమూర్తి (పరవాడ– కాంగ్రెస్–ఆర్), ముద్రగడ పద్మనాభం (ప్రత్తిపాడు–జనతాపార్టీ),నాదెండ్ల భాస్కరరావు (విజయవాడ– కాంగ్రెస్–ఐ), కోనేరు రంగారావు (కంకిపాడు–కాంగ్రెస్–ఐ), వడ్డే శోభనాద్రీశ్వరరావు (ఉయ్యూరు–జనతాపార్టీ), కాసు వెంకటకృష్ణారెడ్డి (నరసారావుపేట–కాంగ్రెస్–ఆర్), ఎరాసు అయ్యపురెడ్డి (పాణ్యం–జనతాపార్టీ) గెలిచిన మహామహుల్లో ఉన్నారు.
రంగంలోకి ఇందిర
సీఎం జలగం వెంగళరావు సహా మెజారిటీ కాంగ్రెస్‌నాయకులు రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగడంతో కాంగ్రెస్ (ఐ)లో సీనియర్లు పెద్దగా చేరలేదు. ఇందిరా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పటివరకు గవర్నర్‌గా ఉన్న డా.మర్రి చెన్నారెడ్డికి అప్పగించారు. అయితే సీనియర్లంతా కాంగ్రెస్ (ఆర్)లో ఉండటంతో కాంగ్రెస్ (ఐ)పై పోటీ చేసేందుకు కొత్తవారికి అవకాశం దక్కింది. ఎమర్జెన్సీ ప్రభావం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇందిరా కాంగ్రెస్‌పై ప్రతికూలంగా కనిపించలేదు. పైగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీని బహిష్కరించినందుకు ఆమెపై ఓట్ల రూపంలో సానుభూతిని కురిపించారు. ఏపీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిర స్వయంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, హస్తం గుర్తుకు ప్రజాదరణ పెరిగేలా చేయగలిగారు.
అయిదేళ్లలో నలుగురు సీఎంలు...
ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించినా.. ఇందిరా కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు రోడ్డునపడ్డాయి. గ్రూపుల సంస్కృతి కారణంగా రాజకీయ శూన్యత ఏర్పడింది. మొదట మర్రి చెన్నారెడ్డి సీఎం కాగా.. రెండేళ్ల తర్వాత తెలంగాణ ప్రాంతానికే చెందిన టి.అంజయ్య ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన భవనం వెంకటరామిరెడ్డిని సీఎం చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో రాయలసీమకు చెందిన కోట్ల విజయభాస్కరరెడ్డిని సీఎంగా నియమించారు.
వైఎస్, పీజేఆర్, చంద్రబాబు విజయం
కాంగ్రెస్ (ఆర్) టికెట్‌పై పులివెందుల నియోజకవర్గంనుంచి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 20,496 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం టి.అంజయ్య కేబినెట్‌లో మెడికల్ సర్వీసెస్ మంత్రిగా వ్యవహరించారు. చంద్రగిరి నుంచి నారా చంద్రబాబునాయుడు ఇందిరా కాంగ్రెస్ టికెట్‌పై 2,494 మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మంత్రయ్యారు. కేఈ కృష్ణమూర్తి (ఇందిరా కాంగ్రెస్) తదితరులు కూడా మొదటిసారి గెలిచిన వారిలో ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి ఆలె నరేంద్ర (జనతాపార్టీ)పై పి.జనార్దన్‌రెడ్డి (కాంగ్రెస్–ఐ) 654 ఓట్లతో గెలుపొంది అంజయ్య కేబినెట్‌లో చోటుదక్కించుకున్నారు. భువనగిరి నుంచి జనతాపార్టీ టికెట్‌పై పోటీచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఓడిపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి రెడ్డి కాంగ్రెస్ నేత, అప్పటి సీఎం జలగం వెంగళరావు చేతిలో ప్రజా కవి కాళోజీనారాయణరావు (జనతాపార్టీ) ఓటమిపాలయ్యారు. గెలిచిన వారిలో జైపాల్ రెడ్డి (కల్వకుర్తి–జనతాపార్టీ), చెన్నమనేని రాజేశ్వరరావు, సయ్యద్ సలావుద్దీన్ ఒవైసీ (చార్మినార్–మజ్లిస్) తదితర ప్రముఖులున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment