జూలో మృతి చెందిన జిరాఫీలు మే, బేకన్(ఫైల్)..
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో జిరాఫీలు కనుమరుగయ్యాయి. ఒక్కొక్కటిగా మృత్యువాత పడ్డాయి. దీంతో జూలో వాటిఎన్‌క్లోజరు బోసిపోయింది. జూ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏనుగులు, పులులు, కోతులు, వివిధ రకాల పక్షులు ఉండేవి. కానీ జిరాఫీ, జీబ్రాలు ఉండేవికాదు. దీంతో 2012లో ఉమ్మడి అంధ్రప్రదేశ్ జూ పార్కుల డైరెక్టర్ మల్లికార్జున ప్రోత్సాహంతో అప్పటి జూ క్యూరేటర్ రామలింగం కృషితో మలేషియా దేశంలో నెగరా జూ నుంచి మూడు జిరాఫీలను తీసుకురావడానికి సీజెడ్‌ఏ నుంచి అనుమతులు లభించాయి. దీంతో 2013లో మలేషియా దేశం నుంచి మూడు జిరాఫీలను విశాఖ జూకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు.
వాటిలో రెండు మగవి, ఒకటి ఆడది. సముద్ర మార్గం నుంచి ఓడలో తీసుకొస్తుండగా మార్గమద్యలోనే ఓ మగ జిరాఫీ ప్రాణాలు కోల్పోయింది. దీంతో మిగిలిన జత జిరాఫీలను అధికారులు విశాఖ జూకి తీసుకొచ్చారు. జిరాఫీల పునరుత్పత్తిలో భాగంగా కొన్నాళ్లకు ఆ రెండింటికి మేటింగ్ నిర్వహించారు. దాని ఫలితంగా మే అనే ఆడ జిరాఫీ ఓ మగ పిల్లకు జన్మనిచ్చింది. ఆ పిల్ల జిరాఫీ రెండు వారాల్లో మృత్యవాతపడింది. మరో మూడేళ్ల అనంతరం ఆ ఆడ జిరాఫీ మళ్లీ గర్భందాల్చింది. ఈసారి దాని కడుపులో ఉండగానే పిల్ల మృతిచెందింది. పుట్టిన జిరాఫీ పిల్లలు నిలవలేదు సరకదా ఈసారి పెద్ద జిరాఫీలే కాలం చేశాయి.
మే అనే ఆడ జిరాఫీ గత ఏడాది మే 17న అనారోగ్యంతో మృతి చెందింది. పోస్టుమార్టం రిపోర్టులో దీని పొట్టలో 16 కిలోల ఇసుక ఉన్నట్లు జూ వైద్యులు నిర్ధారించి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న బేకన్ అనే మగ జిరాఫీ ఆదివారం అర్ధరాత్రి కార్డియక్ పల్మనరీ ఫెయిల్యూర్ కావడంతో మృతి చెందింది. దీంతో ఈ జూ పార్కులో నాలుగు జిరాఫీలు మృత్యువాత పడినట్లయింది. దీంతో జంతు ప్రేముకులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ వన్యప్రాణులను నాణ్యమైన వైద్యం అందుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కోల్‌కతా జూ నుంచి జత జిరాఫీలను తీసుకొస్తాం
విశాఖ జూలో ఉన్న మగ జిరాఫీ ఆదివారం అ ర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. ప్ర స్తుతం జూలో జిరాఫీలు లేవు. కొద్ది నెలల క్రితం నుంచి కోల్‌కతాలో అలీపూర్ జూ పా ర్కు నుంచి జత జిరాఫీలను ఇక్కడకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కో సం సీజెడ్‌ఏ(సెంట్రల్ జూ అథారిటీ)కి ప్రతిపాదనలు పంపించాం. వాటిని తీసుకురావడానికి త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది.
–నందనీ సలారియా, జూ క్యూరేటర్
Comments
Please login to add a commentAdd a comment