ముంబై : కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ.. వారి ఇంటి పేరులోని ‘గాంధీ’.. ‘మహత్మా గాంధీ’ని సూచించదు.. ‘ఫిరోజ్ గాంధీ’ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ గాంధీ అని అందరికి తెలిసిన సంగతే. అయితే నెహ్రూకు, ఫిరోజ్‌కు మధ్య అంత మంచి సంబంధాలు ఉండేవి కావనే విషయం కూడా విదితమే.
మధ్యప్రదేశ్ విదిశలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఉమాభారతి.. ‘మన మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తనను తాను రాజా అని చెప్పుకుంటారు. కానీ సోనియా గాంధీ ఇంటి బయట క్యూలో నిల్చుంటారు. దత్ తివారి.. సంజయ్ గాంధీ చెప్పులు మొసుకొచ్చేవారు. పెద్ద పెద్ద నాయకులు సైతం ఇందిరా గాంధీ ముందు చేతులు జోడించి నిల్చునేవారు. వారి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే.. వారి పేరు చివర ‘గాంధీ’ అని తగిలించుకున్నారు. అయితే ఇక్కడ ‘గాంధీ’ అంటే ‘జాతిపిత’.. మహాత్మ గాంధీ కాదు.. ‘ఫిరోజ్ గాంధీ’’ అని ఉమా భారతి తెలిపారు.
అంతేకాక ‘‘గాంధీ’ అనే ఇంటి పేరును వాడుకునే హక్కు ఆ కుటుంబానికి లేదు. అయినా వాడుకుంటున్నారు. ఎందుకంటే ‘గాంధీ’ అనే ఇంటి పేరు వారికి గౌరవాన్ని కల్గిస్తుందని తెలుసు. అందుకే ఆ పేరును వాడుకుంటున్నారు. కానీ ఆయన ఆదర్శాలను మాత్రం పాటించరు. మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడిచే ఏకైక వ్యక్తి మోదీ మాత్రమే’ అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక ‘కాంగ్రెస్ నాయకులు మేము తమను అధికారంలోంచి దించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నామా.. అధికారంలో ఉన్నామా అనే దాని గురించి మా పార్టీ పట్టించుకోదు. ప్రజలకు మేలు చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తుంద’ని చెప్పుకొచ్చారు. ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కులుస్తారని ఉమా భారతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment