డైనమిక్ ఫ్రీడమ్ ఫైటర్‌గా చరిత్రలో నిలిచిపోయిన బెంగాలీ స్వాతంత్య్రోద్యమకారుడు జతీంద్రనాథ్ ముఖర్జీ బయోపిక్ ‘బాఘా జతిన్’, డైనమిక్ లేడీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. జతీంద్రనాథ్‌గా దేవ్ అధికారి, ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. హిస్టరీ నేపథ్యంలో రూపొంది, రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ రెండు చిత్రాల తాజా అప్‌డేట్స్ ఈ విధంగా...
అందుకే ఆయన పేరులో ‘బాఘా’ చేరింది
‘దౌర్జన్యం ప్రబలినప్పుడు విధ్వంసం ఎంతో దూరంలో ఉండదు. ఈ దురాగతాలను అంతం చేయడానికి మనకు ఒక వీర రక్షకుడు కావాలి. భారతదేశపు పుత్రుడు బాఘా జతీన్ కథను మొదటిసారిగా వెండితెరపై చూపించబోతున్నాం’ అంటూ ‘భాఘా జతీన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న బెంగాలీ నటుడు దేవ్ అధికారి తాజా లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్రోద్యమకారుడు బాఘా జతీన్ (జతీంద్రనాథ్ ముఖర్జీ) బయోపిక్‌గా అరుణ్ రాయ్ దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘బాఘా జతీన్’. ఈ చిత్రంలో బాఘా జతీన్‌గా నటించి, నిర్మించారు దేవ్ అధికారి. 1879 డిసెంబర్ 7న జన్మించిన జతీంద్రనాథ్ ముఖర్జీ 1915 సెప్టెంబర్ 10న మరణించారు. తుపాకీ కాల్పులకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కాగా, జతీంద్రనాథ్‌కి బాఘా జతీన్ అని పేరు రావడానికి కారణం ఆయన ఎలాంటి మారణాయుధాలు లేకుండా ఒట్టి చేతులతో పులిని చంపడం. ‘బాఘా’ అంటే బెంగాలీలో పులి అని అర్థం. 1906లో పులిని అంతం చేశాక జతీంద్రనాథ్ పేరు ‘భాఘా జతీన్’గా మారింది. స్వాతంత్య్రం కోసం జతీన్ చేసిన వీర పోరాటాలతో పాటు ఇలాంటి పలు విశేషాలతో ‘భాఘా జతీన్’ తెరకెక్కింది. ‘‘నవరాత్రి శుభ సందర్భంగా దేవ్‌ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి అక్టోబర్ 20న ‘భాఘా జతీన్’ థియేటర్లకు రానుంది’’ అంటూ తాజా పోస్టర్‌తో పాటు, చిత్రం విడుదల తేదీని ప్రకటించారు దేవ్ అధికారి.
భారత్ అంటే ఇందిరా...!
‘దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్’ అనే డైలాగ్స్‌తో ‘ఎమర్జెన్సీ’ చిత్రం టీజర్ విడుదలైంది. ఇంకా టీజర్‌లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, టీవీ ప్రసారాలు నిలిపివేయడం, ఆందోళనకారులపై దాడి వంటివి చూపించారు. 1975 జూన్ 25 తేదీతో టీజర్ ఆరంభమవుతుంది.
‘రక్షకురాలా లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన చీకటి రోజులకు సాక్షిగా చరిత్రలో నిలిచిన ఘట్టం ఇది..’ అంటూ కంగనా రనౌత్ ఈ టీజర్‌ని షేర్ చేశారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఒదిగిపోయినట్లు ఆమె లుక్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి కంగనాయే దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment