జూన్ 14–15, 1947. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక సమావేశాలు ఆ తేదీలలోనే జరిగాయి. చర్చనీయాంశం– వేయేళ్ల చరిత్రలో చెప్పుకోదగిన ఒక ఘట్టం. అప్పటికి సరిగ్గా 12 రోజుల క్రితం ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్‌బాటన్ ప్రతిపాదించిన భారత విభజన ప్రణాళికకి అంగీకారం తెలియచేసే తీర్మానం ఆమోదించడానికి అక్కడ అంతా కూర్చున్నారు. ఇలాంటి బాధాకరమైన ప్రణాళికకు ఎవరిని అడిగి తలూపి వచ్చారంటూ సిం«ద్ ప్రాంత కాంగ్రెస్ ప్రముఖుడు ఛోతారామ్ గిద్వానీ, ఉత్తరప్రదేశ్ ప్రముఖుడు పురుషోత్తమదాస్ టాండన్ నిప్పులు చెరుగుతున్నారు. గాంధీజీ, నెహ్రూ మధ్య కొన్ని పరుష వ్యాఖ్యలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ ఇద్దరితో పాటు ఇంకా సర్దార్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (జాతీయ కాంగ్రెస్), జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా (కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ) ఇంకా పలువురు కూడా ఆ కీలక సమావేశంలో ఉన్నారు. తలనొప్పిగా ఉందంటూ గాంధీ ఇబ్బందిగా కూర్చున్నారు. అలాంటి కీలక సందర్భంలో, చరిత్రాత్మకమైన ఒక తీర్మానం ఆమోదించే వేళ కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కూర్చున్న ఆ నాయకుడు కూడా ఎంతో ఆవేదనగా, ముఖం నిండా ఖేదంతో ఇబ్బందిగా ఉన్నారు. ఆయనే జేబీ కృపలానీ.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో.... భారత ఉపఖండం భారత్–పాక్ అనే రెండు దేశాలుగా విడిపోయిన విషాద ఘడియలలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నవారు కృపలానీ. అంతేకాదు, జూన్ 3, 1947న మౌంట్‌బాటన్ ఇచ్చిన విభజన ప్రణాళికకు ఆమోదం తెలియచేసిన వారిలో నెహ్రూ, పటేల్‌తో పాటు ఉన్న మరొక కాంగ్రెస్ సభ్యుడు కృపలానీయే. ఆ సమావేశానికి గాంధీజీని కాకుండా, కాంగ్రెస్ అధ్యక్ష హోదాతో కృపలానీని నెహ్రూ సిఫారసు చేశారు. ఒక్క గాంధీ తప్ప, మిగిలిన కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ప్రదర్శించిన ‘నైతిక పిరికితనమే’ దేశ విభజనకి కారణమని తన ఆత్మకథ (మై టైమ్స్, కృపలానీ మరణానంతరం, 22 ఏళ్లకు, 2004లో అచ్చయింది)లో కృపలానీ ఆరోపించడం ఈ దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే కొసమెరుపు.
జీవత్‌రామ్ భగవాన్‌దాస్ కృపలానీ సిం«ద్, గుజరాతీ మూలాలు కలిగిన కుటుంబంలో పుట్టారు. స్వస్థలం సిం«ద్ హైదరాబాద్. ప్రాథమిక విద్య అంతా అక్కడే సాగింది. తరువాత బొంబాయిలోని విల్సన్ కళాశాలలో చేరారు. ఆంగ్ల కవిత్వం ఆయన అభిమానాంశం. అలాగే చరిత్ర కూడా. అక్కడ ఉండగానే కృపలానీ మొదటిసారి రాజకీయ పోరాటంలో పాల్గొన్నారని అనుకోవచ్చు. అప్పుడే బెంగాల్ విభజనోద్యమం దేశమంతా వ్యాపించింది. విల్సన్ కళాశాల విద్యార్థులు జరిపిన ఆందోళనలో కృపలానీ కూడా పాల్గొన్నారు. దీనితో కళాశాల నుంచి బహిష్కరించారు. ఆపై కరాచీ వెళ్లి అక్కడ డీజే కళాశాలలో చేరారు. ఈ కళాశాల నుంచి కూడా బహిష్కరణ తప్పలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ చేసిన భారత వ్యతిరేక వ్యాఖ్యలతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారందరినీ బహిష్కరించారు. అప్పుడు కృపలానీ పూనాలోని ఫెర్గూసన్ కళాశాలలో చేరి ఎంఏ ఆంగ్ల సాహిత్యం, చరిత్ర పూర్తి చేశారు. మొదట ఉపాధ్యాయునిగా జీవితం ఆరంభించారు కృపలానీ. తరువాత ముజఫర్‌పూర్ విశ్వవిద్యాలయం (బిహార్), కాశీ విశ్వవిద్యాలయాలలో కొద్దికాలం పనిచేశారు. ఆ సమయంలోనే గాంధీజీతో పరిచయం ఏర్పడింది.
1917లో చంపారన్ సత్యాగ్రహం సమయంలో రెండవసారి గాంధీజీని కలుసుకున్నారు కృపలానీ. ఇక తుదిశ్వాస విడిచేవరకు గాంధీ సిద్ధాంతాన్నే నమ్మారు. 1920–27 మధ్య గాంధీజీ స్థాపించిన గుజరాత్ విద్యాపీuŠ‡కు ఆయనే ప్రిన్సిపాల్. అక్కడ ఉండగానే ఆయనను ‘ఆచార్య’ అని పిలవడం ఆరంభమైంది. 1922 సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఆయన గాంధీ వెంటే ఉన్నారు. 1927 తరువాత మాత్రం ఉత్తరభారత దేశానికి వెళ్లి అక్కడ ఆశ్రమాలు స్థాపించి గాంధీ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. 1934 నుంచి 1945 వరకు జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. కానీ ఆయన ఎప్పటికీ వ్యవస్థ పట్ల తన అసమ్మతిని ప్రకటిస్తూనే ఉండేవారు. ఒక విధంగా ఆయన జీవితమంతా ఉద్యమకారునిగా ఉన్నారు. చాలా విషయాలలో అసమ్మతిని ప్రకటిస్తూనే ఉండేవారు. సిద్ధాంతం మాత్రం గాంధీగారిదే.
1946లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ కాంగ్రెస్ «అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్న తరువాత ఆచార్య కృపలానీ ఆ పదవికి ఎంపికయ్యారు. భారతదేశ చరిత్రలో ఆ సంవత్సరాన్ని గురించి చెప్పే ప్రతి అక్షరం రక్తసిక్తంగానే కనిపిస్తుంది. ముస్లింలీగ్ ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో జరిగిన హింస, ప్రతిహింస ఘోరమైనవి. బెంగాల్ హత్యలు, బిహార్ రక్తపాతం, ఆపై నౌఖాలీ ఊచకోత, ఇంకా పంజాబ్‌లో హత్యాకాండ ఇవన్నీ కూడా ఆ కాలంలోనే జరిగాయి. ఇందుకు పరోక్షంగా బాధ్యత వహించవలసినది జాతీయ కాంగ్రెస్ పార్టీయే. గాంధీజీ సిద్ధాంతం హఠాత్తుగా మాయమై, ఒక అరాచక నెత్తుటి క్రీడ స్వైర విహారం చేసిన సమయం. ఇక 1947లో స్వాతంత్య్రం ప్రకటించిన తరువాత పంజాబ్‌లో జరిగిన హింసాకాండ కూడా ఎంతో అమానుషమైనది. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కృపలానీ వంటి వారికి ఆ రకమైన స్వాతంత్య్ర సిద్ధి ఆనందించదగినదో, దుఃఖం కలిగించేదో చెప్పడం పెద్ద కష్టం కాదు. 1947లోనే పంజాబ్‌లోని ఒక గురుద్వారాలో జరిగిన సిక్కు–ముస్లిం ఘర్షణ, ఆ హత్యాకాండ కారణంగా ఆ గ్రామ సిక్కు మహిళలంతా ఆ గురుద్వారా వెనుక ఉన్న పెద్ద బావిలోకి ఉరికి మూకమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడం కృపలానీని ఎంతో కలవరపరిచింది. ఈ హత్యాకాండ గురించే జూన్ 14, 15 నాటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కృపలానీ ఎంతో క్షోభతో, మనస్తాపంతో ప్రస్తావించారు. ఆ సంవత్సరం నవంబర్‌లో కృపలానీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు (తరువాత బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎంపికయ్యారు). తరువాత కూడా కృపలానీ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది.
1948లో గాంధీజీ మరణించారు. కాంగ్రెస్‌లో కృపలానీ ప్రాధాన్యం మరింత తగ్గిపోయింది. నిజానికి నెహ్రూ విధానాలలో కొన్నింటిని కృపలానీ అభిమానించేవారు. కానీ ఆనాడు చాలామంది భారతీయులు, ఇంగ్లిష్ వాళ్లు కూడా భావించినట్టే కృపలానీ కూడా పటేల్‌ను మితవాదిగానే భావించారు. కానీ ఒక్క విషయంలో మళ్లీ ఆ ఇద్దరి నుంచి కృపలానీ ఒకే రకమైన నిరసనను ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీ అధ్యక్షునిగా ఆయన నెహ్రూకు, పటేల్‌కు ఒక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం గురించి పార్టీకి తెలియాలి. కానీ రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలలో పార్టీ ప్రమేయం ఉండడం సాధ్యం కాదని నెహ్రూ, పటేల్ కూడా తేల్చి చెప్పేశారు. కృపలానీ ఉద్దేశం ఏదైనా అదొక పాటించదగిన ఆదర్శంగా నిలిచిపోయింది. 1950లో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. అప్పటికే నెహ్రూ, పటేల్ విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి రహస్యమేమీ కాదు. నెహ్రూ, ఆయన వామపక్ష సహచరులు అంతా కలసి కృపలానీని సమర్థించారు. కృపలానీకి ప్రత్యర్థిగా పటేల్ వర్గం, అంటే ఆనాటికి ఏర్పడిన శిబిరాల పదజాలం ప్రకారం, మితవాద పక్షం సమర్థించిన వ్యక్తి పురుషోత్తమదాస్ టాండన్. 1950 నాటికి దేశంలో పరిస్థితులు కొంచెం క్లిష్టంగానే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి రెండున్నరేళ్లయింది. ఆ సమస్యలు సరే. దీనితో పాటు సోమనాథ్ దేవాలయం, దాని మీద నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్ విభేదాలు, జనసంఘ్ ఏర్పడుతున్న జాడలు, ముస్లిం జనాభా మార్పిడి కోసం నెహ్రూ,లియాఖత్ అలీ మధ్య జరిగిన ఒప్పందం, నెహ్రూ ఆర్థిక విధానాల మీద సంకోచం, సందిగ్ధం బలంగా ఉన్న సమయమది. కొద్దిపాటి తేడాతోనే అయినా కృపలానీ ఓడిపోయారు. టాండన్ గెలిచారు. అంటే నెహ్రూ అభ్యర్థి ఓడిపోగా, పటేల్ అభ్యర్థి గెలిచారన్నమాట. నిజానికి ఆ తరువాత పటేల్ ఈ లోకం నుంచి నిష్క్రమించారు. చిత్రం, అధ్యక్ష ఎన్నికలలో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న కృపలానీ కూడా కాంగ్రెస్ నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. ఇంకా చిత్రం– ఆ మరుసటి సంవత్సరమే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసిందిగా నెహ్రూ టాండన్‌ను కోరారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఓటమి కృపలానీని బాగా కుంగదీసిన మాట నిజం. నిజానికి నెహ్రూలో కూడా అంతే నిర్వేదం ఏర్పడిందని చెబుతారు. కాంగ్రెస్ గాంధేయ సిద్ధాంతాలకు దూరంగా జరుగుతున్నదన్న క్షోభ కూడా కృపలానీకి అప్పటికే ఉంది. గాంధీగారి గ్రామ స్వరాజ్యం నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆయనను బాధించింది. దానితో స్వతంత్ర భారతంలో గాంధీజీ స్వప్నం భగ్నమైనట్టు భావించారాయన. ఈ నిరసన ఇలా కొనసాగిస్తూనే ఆయన రాజ్యాంగ పరిషత్‌లో పని చేశారు. కృపలానీ 1936లో సుచేతను వివాహమాడారు. ఆమె కూడా గాంధీగారి శిష్యురాలే. కానీ భర్త కాంగ్రెస్ వీడినా, ఆయన వెంటన ఆమె నడవలేదు. చివరిదాకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆమే.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కృపలానీ ఇద్దరితో కలసి 1951, జూన్‌లో కృషక్ మజ్దూర్ ప్రజాపార్టీని స్థాపించారు. అందులో ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రఫుల్ల చంద్ర ఘోష్. రెండవ నాయకుడు మద్రాస్ ముఖ్యమంత్రి – టంగుటూరి ప్రకాశం పంతులు. ఇది తొలి లోక్‌సభ ఎన్నికలలో 16 స్థానాలకు పోటీ చేసింది. 9 స్థానాలు గెలుచుకుంది. ఎక్కువగా మైసూర్ స్టేట్‌లో (నేటి కర్ణాటక) వచ్చాయి. తరువాత జరిగిన శాసనసభలలో ఎన్నికలలో కూడా మంచి ఫలితాలను సాధించింది. అన్నీ కలిపి 77 స్థానాలు గెలిచింది. తరువాత సోషలిస్టు పార్టీతో విలీనమై ప్రజా సోషలిస్ట్ పార్టీగా అవతరించింది. కానీ 1954లోనే కృపలానీ ఈ పార్టీని విడిచిపెట్టారు. స్వతంత్ర రాజకీయవేత్తగా ఉండడం ఆయన ఉద్దేశం. కృపలానీ పార్లమెంట్‌లో కూడా చాలా కీలకంగానే వ్యవహరించారు. 1952, 1957, 1963, 1967 లోక్‌సభ ఎన్నికలలో ఆయన గెలిచారు. 1961లో వీకే కృష్ణమీనన్ మీద పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. మొదట నెహ్రూ విధానాలను అభిమానించినప్పటికీ తరువాత ఆయనను తీవ్రంగా వ్యతిరేకించడం ఆరంభించారు. గాంధీ సిద్ధాంతాలను నెహ్రూ నిర్లక్ష్యం చేస్తున్నారని కృపలానీ భావన. చైనా యుద్ధంలో భారత్ ఓటమికి చలించిపోయిన కృపలానీ 1963లో నెహ్రూ ప్రభుత్వం మీద అవిశ్వాసం కూడా ప్రవేశపెట్టారు. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆయన పోటీ చేశారు. అప్పుడు కూడా ఓడిపోయారు. ఆ తరువాత ఆయన కోద్దికాలం వినోభా ఆశ్రమంలో గడిపారు. అది ఎంతో కాలం సాగలేదు.
1972లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమం ఆరంభమైంది. ఆమె నియంతృత్వ పోకడలకు నిరసనగా జయప్రకాశ్ నారాయణ్ వంటివారి నాయకత్వంలో సంపూర్ణ విప్లవం పేరుతో అది మొదలయింది. ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కృపలానీ. జేపీతో కలసి దేశమంతా తిరిగి ఇందిర పోకడలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1971నాటి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు, దరిమిలా సుప్రీం కోర్టు షరతులతో కూడిన స్టే, ఆ వెంటనే దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితి ప్రకటన వేగంగా జరిగిపోయాయి. జూన్ 25, 1975 అర్ధరాత్రి దేశ వ్యాప్తంగా జేపీ, మొరార్జీ, అశోక్ మెహతా, కేఆర్ మల్కానీ వంటి ఎందరినో అరెస్టు చేశారు. వారిలో కృపలానీ కూడా ఉన్నారు. ఇలా అనేక రాజకీయ ఆటుపోట్లను చూసిన కృపలానీ 1982లో 94వ ఏట కన్నుమూశారు. అసమ్మతిలో కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించినందుకు ఆయనను చరిత్ర గుర్తుంచుకుంది.
- డా. గోపరాజు నారాయణరావు
అసమ్మతికి ఆచార్యపీఠం
Published Sun, Dec 9 2018 1:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment