Abul Kalam Azad
-
CM Jagan: నవంబర్ 11న సీఎం జగన్ గుంటూరు పర్యటన
సాక్షి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు సోమవారం పరిశీలించారు. భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంత్యుత్సవం సందర్భంగా ఈ నెల 11న గుంటూరులో జరగనున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, మొహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి పర్యటించే మార్గాలు, ట్రాఫిక్, సెక్యూరిటీ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని జింఖానా మైదానం, వేంకటేశ్వర విజ్ఞాన మందిరాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ప్రజాప్రతినిధులు సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), షేక్ సజిల, పూసల, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్పర్సన్ కోలా భవాని, వైఎస్సార్సీపీ నాయకులు గులాం రసూల్, గుంటూరు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎండి.ఘని పాల్గొన్నారు. కలెక్టర్ చాంబర్లో సమావేశం జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ప్రత్యేక ఆహ్వానంతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, మొహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ కలెక్టరేట్లో సమావేశమయ్యారు. సీఎం పర్యటనపై కూలంకషంగా చర్చించారు. -
అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం జగన్
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (నవంబర్ 11) సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. తన క్యాంప్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పాల్గొన్నారు. -
అబుల్‌కలాం ఆజాద్ సేవలు మరువలేనివి
సాక్షి, నల్లగొండ: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టిన డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని ఇన్చార్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో సమగ్ర విద్యావిధాన రూపకల్పనకు పునాదులు వేశారన్నారు. మౌలానా అబుల్ కలాం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం.. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యనందించేందుకు గురుకుల పాఠశాలలు నెలకొల్పినట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం స్వాతంత్య్ర సమరయోధుడుగా, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశం కోసం ఎంతగానో శ్రమించారన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఎకరాలు భూమి కేటాయించినట్లు.. గురుకుల పాఠశాలకు శాశ్వత బిల్డింగ్‌కు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సుభద్ర, జిల్లా మత్స్యశా>ఖ అధికారి చరిత, మైనార్టీ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్ మునీరుద్దీన్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బుర్ఖాన్, రీజినల్ కోఆర్డినేటర్ జమీల్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ ఖలీం, కార్యదర్శి హాషం, టీఆర్ఎస్ నాయకులు బషీర్, జెడ్పీకోఆప్షన్ సభ్యులు జాన్ శాస్త్రి పాల్గొన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. అబుల్‌కలాం చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
అబుల్ కలాం జయంతి వేడుక
-
అదే మనం వారికిచ్చే ఆస్తి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీష్ మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదరికం నుంచి బయటపడాలి అంటే చదువు చాలా ముఖ్యమని, తమ ప్రభుత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. విజయవాడలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. అబుల్ కలాం జయంతిని 2008లో మైనార్టీ వెల్ఫేర్ డేగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసం అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. 1947 నుంచి 1958 వరకు మౌలానా విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలు అందిచారని కొనియాడారు. అనేక విద్యా సంస్థలను పునాది వేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. ప్రజాసంకల్ప యాత్రలో పేదరికంను, వెనుకబాటును అతి దగ్గరగా చూశానని అన్నారు. దీనంతటికీ కారణం పిల్లలకు నాణ్యమైన విద్యలేకపోవడమే పేర్కొన్నారు. మీ పిల్లలు ఏ పాఠశాలలో చదవుతున్నారు.. ‘2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33శాతం. దేశంలో 27శాతం ఉంది. దేశ సరాసరి కంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఈ దారిద్యం పోవాలి అంటే పిల్లలకి ఉన్నత విద్యను అందించాలి. ఒక దీపం గదికి వెలుగునిస్తే.. చదువుల దీపం కుటుంబానికి, దేశానికి వెలుగునిస్తుంది. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలి. అది ఒక్క ఇంగ్లీష్ మీడియం పాఠశాలలతోనే సాధ్యం. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇటీవల ఓ జీవోను విడుదల కూడా చేసింది. కార్యాచరణ కూడా రూపొందించింది. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు పవన్‌కల్యాన్ వంటి వారు చాలా దారుణంగా మాట్లాడారు. పేదవాడికి ఇంగ్లీషు మీడియం ఎందుకని చులకన చేశారు. ఈ సందర్భంగా వారందరికి నేను సవాలు విసురుతున్నా.. చంద్రబాబు కుమారుడు, మనవడు ఏ మీడియంలో చదువుతున్నారు?. పవన్ కల్యాన్ కుమారులు ఏ మీడియంలో చదువుతున్నారు?. పిల్లల్ని మంచి చదవులు ఇవ్వకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. పిల్లలకి ఉన్నత చదవులు అందించాలని అనే సంకల్పంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దానిపై ప్రతిపక్ష నాయకులు బుదరజల్లడం నిజంగా దారుణం. మన పిల్లలకు చదువు చెప్పకపోతే దేశం నష్టపోతుంది. ప్రతి చదువు కోసం ఏ పేదింటిలో కూడా అప్పులపాలు రాకుండా ఉండాలి. ఆ దిశగా అడుగులు వేస్తునే డిసెంబర్ నెలాఖరులో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నవంబరు 14న స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం మార్పు కోసం శ్రీకారం చుడుతున్నాం. నేడు స్కూళ్లు ఎలా ఉన్నాయని చూపిస్తాం. ప్రతి స్కూల్లోనూ బాత్రూం, నీళ్లు, బ్లాక్‌బోర్డు, పర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఉండాలి. ప్రతి స్కూల్‌కు పెయింటింగ్ ఉండాలి. రేపు సంవత్సరం మొదలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం చేస్తూ, తెలుగు, ఉర్దూ బాషను తప్పని సరి చేస్తాం. మీడియం మాత్రం ఇంగ్లీష్ చేస్తాం. 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేస్తాం. తరువాత సంవత్సరం 7, ఆ తరువాత 8, 9, 10 ఇలా ఏటేటా ఇంగ్లీష్ మీడియం చేస్తాం. మదర్సా బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఇక్కడికి వచ్చే ముందు.. మదర్సాల గురించి ఆలోచించాలని కోరారు. ఇందుకోసం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అక్కడి పిల్లలకు కూడా మోడ్రన్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి. ఉర్దూ, ఖురాన్లో రాణిస్తునే మరో వైపు ఇంగ్లీష్ చదువులు చదివేలా రెండు బ్యాలెన్స్ చేస్తూ అమ్మ ఒడి పథకాన్ని వాళ్ల వద్దకు కూడా తీసుకువెళ్తాం. మార్చి నుంచి వైయస్ఆర్ పెళ్లి కానుక గతంలో పెళ్లి కానుక చంద్రబాబు పెట్టారు. ఈ పథకం ఆగిపోయింది. నవంబర్ 2018 నుంచి ఈ పథకం తెరమరుగు అయ్యింది. చంద్రబాబు పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కొంచెం టైం ఇస్తే మార్చిలో వైయస్ఆర్ పెళ్లి కానుక తీసుకువస్తాం. గతంలో చంద్రబాబు ఇచ్చిన దానికంటే వైయస్ఆర్ పెళ్లి కానుక రెట్టింపు చేస్తూ రూ.1 లక్ష ఇస్తాం. మౌజమ్, మౌలానాలకు గౌరవవేతనాలు పెంచి ఇస్తాం. దీనికి కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను. మసీదుల సంఖ్య పెంచుతాం. ఇస్తామన్న రూ.15 వేలు ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా’ అని అన్నారు. -
ఏపీలో నేడే విద్యాపురస్కారాల ప్రదానోత్సవం
సాక్షి, విజయవాడ : జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఏ ప్లస్ కన్వెన్షన్‌లో సోమవారం జరిగే ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని ప్రతిభావంతులకు విద్యాపురస్కారాలు అందజేస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఏడాది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అబుల్ కలాం ఆజాద్ విద్యా పురస్కారాలను అందజేయనున్నట్లు విదాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. భారత మొదటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి. -
నేడు అబుల్ కలాం విద్యా పురస్కారాలు
ఒంగోలు టౌన్/సాక్షి, అమరావతి : ఈ ఏడాది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా పురస్కారాలను అందజేయనున్నట్లు విదాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒంగోలు సంతపేటలోని తన క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో అక్కడి మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందిస్తారన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. డీఎల్టీ, డైట్ వంటి వాటిని టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లుగా మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా సుశిక్షితులైన ఉపాధ్యాయులను తయారుచేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇఫ్లూ, రీచల్ ఇన్స్టిట్యూట్ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని ఇంగ్లిష్ మీడియం బోధించే టీచర్లకు మరింత తర్ఫీదునిస్తామన్నారు. ఎస్సీ గురుకులాల నుంచి 189 మంది ఎంపిక ఇదిలా ఉంటే.. అబుల్ కలాం విద్యా పురస్కారాలకు రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి మొత్తం 189 మంది ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 47 మంది, మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల నుంచి 45 మంది ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వి.రాములు, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్, ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి పి రంజిత్‌బాషా అభినందనలు తెలిపారు. 14న సీఎం చేతుల మీదుగా నాడు–నేడు కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాడు–నేడు కార్యక్రమాన్ని ఈనెల 14న ఆయన చేతుల మీదుగా ఒంగోలులో ప్రారంభించనున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. అదేరోజు మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. -
అసమ్మతికి ఆచార్యపీఠం
జూన్ 14–15, 1947. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక సమావేశాలు ఆ తేదీలలోనే జరిగాయి. చర్చనీయాంశం– వేయేళ్ల చరిత్రలో చెప్పుకోదగిన ఒక ఘట్టం. అప్పటికి సరిగ్గా 12 రోజుల క్రితం ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్‌బాటన్ ప్రతిపాదించిన భారత విభజన ప్రణాళికకి అంగీకారం తెలియచేసే తీర్మానం ఆమోదించడానికి అక్కడ అంతా కూర్చున్నారు. ఇలాంటి బాధాకరమైన ప్రణాళికకు ఎవరిని అడిగి తలూపి వచ్చారంటూ సిం«ద్ ప్రాంత కాంగ్రెస్ ప్రముఖుడు ఛోతారామ్ గిద్వానీ, ఉత్తరప్రదేశ్ ప్రముఖుడు పురుషోత్తమదాస్ టాండన్ నిప్పులు చెరుగుతున్నారు. గాంధీజీ, నెహ్రూ మధ్య కొన్ని పరుష వ్యాఖ్యలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ ఇద్దరితో పాటు ఇంకా సర్దార్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (జాతీయ కాంగ్రెస్), జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా (కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ) ఇంకా పలువురు కూడా ఆ కీలక సమావేశంలో ఉన్నారు. తలనొప్పిగా ఉందంటూ గాంధీ ఇబ్బందిగా కూర్చున్నారు. అలాంటి కీలక సందర్భంలో, చరిత్రాత్మకమైన ఒక తీర్మానం ఆమోదించే వేళ కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కూర్చున్న ఆ నాయకుడు కూడా ఎంతో ఆవేదనగా, ముఖం నిండా ఖేదంతో ఇబ్బందిగా ఉన్నారు. ఆయనే జేబీ కృపలానీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో.... భారత ఉపఖండం భారత్–పాక్ అనే రెండు దేశాలుగా విడిపోయిన విషాద ఘడియలలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నవారు కృపలానీ. అంతేకాదు, జూన్ 3, 1947న మౌంట్‌బాటన్ ఇచ్చిన విభజన ప్రణాళికకు ఆమోదం తెలియచేసిన వారిలో నెహ్రూ, పటేల్‌తో పాటు ఉన్న మరొక కాంగ్రెస్ సభ్యుడు కృపలానీయే. ఆ సమావేశానికి గాంధీజీని కాకుండా, కాంగ్రెస్ అధ్యక్ష హోదాతో కృపలానీని నెహ్రూ సిఫారసు చేశారు. ఒక్క గాంధీ తప్ప, మిగిలిన కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ప్రదర్శించిన ‘నైతిక పిరికితనమే’ దేశ విభజనకి కారణమని తన ఆత్మకథ (మై టైమ్స్, కృపలానీ మరణానంతరం, 22 ఏళ్లకు, 2004లో అచ్చయింది)లో కృపలానీ ఆరోపించడం ఈ దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే కొసమెరుపు. జీవత్రామ్ భగవాన్‌దాస్ కృపలానీ సిం«ద్, గుజరాతీ మూలాలు కలిగిన కుటుంబంలో పుట్టారు. స్వస్థలం సిం«ద్ హైదరాబాద్. ప్రాథమిక విద్య అంతా అక్కడే సాగింది. తరువాత బొంబాయిలోని విల్సన్ కళాశాలలో చేరారు. ఆంగ్ల కవిత్వం ఆయన అభిమానాంశం. అలాగే చరిత్ర కూడా. అక్కడ ఉండగానే కృపలానీ మొదటిసారి రాజకీయ పోరాటంలో పాల్గొన్నారని అనుకోవచ్చు. అప్పుడే బెంగాల్ విభజనోద్యమం దేశమంతా వ్యాపించింది. విల్సన్ కళాశాల విద్యార్థులు జరిపిన ఆందోళనలో కృపలానీ కూడా పాల్గొన్నారు. దీనితో కళాశాల నుంచి బహిష్కరించారు. ఆపై కరాచీ వెళ్లి అక్కడ డీజే కళాశాలలో చేరారు. ఈ కళాశాల నుంచి కూడా బహిష్కరణ తప్పలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ చేసిన భారత వ్యతిరేక వ్యాఖ్యలతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారందరినీ బహిష్కరించారు. అప్పుడు కృపలానీ పూనాలోని ఫెర్గూసన్ కళాశాలలో చేరి ఎంఏ ఆంగ్ల సాహిత్యం, చరిత్ర పూర్తి చేశారు. మొదట ఉపాధ్యాయునిగా జీవితం ఆరంభించారు కృపలానీ. తరువాత ముజఫర్‌పూర్ విశ్వవిద్యాలయం (బిహార్), కాశీ విశ్వవిద్యాలయాలలో కొద్దికాలం పనిచేశారు. ఆ సమయంలోనే గాంధీజీతో పరిచయం ఏర్పడింది. 1917లో చంపారన్ సత్యాగ్రహం సమయంలో రెండవసారి గాంధీజీని కలుసుకున్నారు కృపలానీ. ఇక తుదిశ్వాస విడిచేవరకు గాంధీ సిద్ధాంతాన్నే నమ్మారు. 1920–27 మధ్య గాంధీజీ స్థాపించిన గుజరాత్ విద్యాపీuŠ‡కు ఆయనే ప్రిన్సిపాల్. అక్కడ ఉండగానే ఆయనను ‘ఆచార్య’ అని పిలవడం ఆరంభమైంది. 1922 సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఆయన గాంధీ వెంటే ఉన్నారు. 1927 తరువాత మాత్రం ఉత్తరభారత దేశానికి వెళ్లి అక్కడ ఆశ్రమాలు స్థాపించి గాంధీ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. 1934 నుంచి 1945 వరకు జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. కానీ ఆయన ఎప్పటికీ వ్యవస్థ పట్ల తన అసమ్మతిని ప్రకటిస్తూనే ఉండేవారు. ఒక విధంగా ఆయన జీవితమంతా ఉద్యమకారునిగా ఉన్నారు. చాలా విషయాలలో అసమ్మతిని ప్రకటిస్తూనే ఉండేవారు. సిద్ధాంతం మాత్రం గాంధీగారిదే. 1946లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ కాంగ్రెస్ «అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్న తరువాత ఆచార్య కృపలానీ ఆ పదవికి ఎంపికయ్యారు. భారతదేశ చరిత్రలో ఆ సంవత్సరాన్ని గురించి చెప్పే ప్రతి అక్షరం రక్తసిక్తంగానే కనిపిస్తుంది. ముస్లింలీగ్ ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో జరిగిన హింస, ప్రతిహింస ఘోరమైనవి. బెంగాల్ హత్యలు, బిహార్ రక్తపాతం, ఆపై నౌఖాలీ ఊచకోత, ఇంకా పంజాబ్‌లో హత్యాకాండ ఇవన్నీ కూడా ఆ కాలంలోనే జరిగాయి. ఇందుకు పరోక్షంగా బాధ్యత వహించవలసినది జాతీయ కాంగ్రెస్ పార్టీయే. గాంధీజీ సిద్ధాంతం హఠాత్తుగా మాయమై, ఒక అరాచక నెత్తుటి క్రీడ స్వైర విహారం చేసిన సమయం. ఇక 1947లో స్వాతంత్య్రం ప్రకటించిన తరువాత పంజాబ్‌లో జరిగిన హింసాకాండ కూడా ఎంతో అమానుషమైనది. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కృపలానీ వంటి వారికి ఆ రకమైన స్వాతంత్య్ర సిద్ధి ఆనందించదగినదో, దుఃఖం కలిగించేదో చెప్పడం పెద్ద కష్టం కాదు. 1947లోనే పంజాబ్‌లోని ఒక గురుద్వారాలో జరిగిన సిక్కు–ముస్లిం ఘర్షణ, ఆ హత్యాకాండ కారణంగా ఆ గ్రామ సిక్కు మహిళలంతా ఆ గురుద్వారా వెనుక ఉన్న పెద్ద బావిలోకి ఉరికి మూకమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవడం కృపలానీని ఎంతో కలవరపరిచింది. ఈ హత్యాకాండ గురించే జూన్ 14, 15 నాటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కృపలానీ ఎంతో క్షోభతో, మనస్తాపంతో ప్రస్తావించారు. ఆ సంవత్సరం నవంబర్‌లో కృపలానీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు (తరువాత బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎంపికయ్యారు). తరువాత కూడా కృపలానీ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. 1948లో గాంధీజీ మరణించారు. కాంగ్రెస్‌లో కృపలానీ ప్రాధాన్యం మరింత తగ్గిపోయింది. నిజానికి నెహ్రూ విధానాలలో కొన్నింటిని కృపలానీ అభిమానించేవారు. కానీ ఆనాడు చాలామంది భారతీయులు, ఇంగ్లిష్ వాళ్లు కూడా భావించినట్టే కృపలానీ కూడా పటేల్‌ను మితవాదిగానే భావించారు. కానీ ఒక్క విషయంలో మళ్లీ ఆ ఇద్దరి నుంచి కృపలానీ ఒకే రకమైన నిరసనను ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీ అధ్యక్షునిగా ఆయన నెహ్రూకు, పటేల్‌కు ఒక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం గురించి పార్టీకి తెలియాలి. కానీ రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలలో పార్టీ ప్రమేయం ఉండడం సాధ్యం కాదని నెహ్రూ, పటేల్ కూడా తేల్చి చెప్పేశారు. కృపలానీ ఉద్దేశం ఏదైనా అదొక పాటించదగిన ఆదర్శంగా నిలిచిపోయింది. 1950లో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. అప్పటికే నెహ్రూ, పటేల్ విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి రహస్యమేమీ కాదు. నెహ్రూ, ఆయన వామపక్ష సహచరులు అంతా కలసి కృపలానీని సమర్థించారు. కృపలానీకి ప్రత్యర్థిగా పటేల్ వర్గం, అంటే ఆనాటికి ఏర్పడిన శిబిరాల పదజాలం ప్రకారం, మితవాద పక్షం సమర్థించిన వ్యక్తి పురుషోత్తమదాస్ టాండన్. 1950 నాటికి దేశంలో పరిస్థితులు కొంచెం క్లిష్టంగానే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి రెండున్నరేళ్లయింది. ఆ సమస్యలు సరే. దీనితో పాటు సోమనాథ్ దేవాలయం, దాని మీద నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్ విభేదాలు, జనసంఘ్ ఏర్పడుతున్న జాడలు, ముస్లిం జనాభా మార్పిడి కోసం నెహ్రూ,లియాఖత్ అలీ మధ్య జరిగిన ఒప్పందం, నెహ్రూ ఆర్థిక విధానాల మీద సంకోచం, సందిగ్ధం బలంగా ఉన్న సమయమది. కొద్దిపాటి తేడాతోనే అయినా కృపలానీ ఓడిపోయారు. టాండన్ గెలిచారు. అంటే నెహ్రూ అభ్యర్థి ఓడిపోగా, పటేల్ అభ్యర్థి గెలిచారన్నమాట. నిజానికి ఆ తరువాత పటేల్ ఈ లోకం నుంచి నిష్క్రమించారు. చిత్రం, అధ్యక్ష ఎన్నికలలో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న కృపలానీ కూడా కాంగ్రెస్ నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. ఇంకా చిత్రం– ఆ మరుసటి సంవత్సరమే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసిందిగా నెహ్రూ టాండన్‌ను కోరారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఓటమి కృపలానీని బాగా కుంగదీసిన మాట నిజం. నిజానికి నెహ్రూలో కూడా అంతే నిర్వేదం ఏర్పడిందని చెబుతారు. కాంగ్రెస్ గాంధేయ సిద్ధాంతాలకు దూరంగా జరుగుతున్నదన్న క్షోభ కూడా కృపలానీకి అప్పటికే ఉంది. గాంధీగారి గ్రామ స్వరాజ్యం నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆయనను బాధించింది. దానితో స్వతంత్ర భారతంలో గాంధీజీ స్వప్నం భగ్నమైనట్టు భావించారాయన. ఈ నిరసన ఇలా కొనసాగిస్తూనే ఆయన రాజ్యాంగ పరిషత్‌లో పని చేశారు. కృపలానీ 1936లో సుచేతను వివాహమాడారు. ఆమె కూడా గాంధీగారి శిష్యురాలే. కానీ భర్త కాంగ్రెస్ వీడినా, ఆయన వెంటన ఆమె నడవలేదు. చివరిదాకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆమే. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కృపలానీ ఇద్దరితో కలసి 1951, జూన్‌లో కృషక్ మజ్దూర్ ప్రజాపార్టీని స్థాపించారు. అందులో ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రఫుల్ల చంద్ర ఘోష్. రెండవ నాయకుడు మద్రాస్ ముఖ్యమంత్రి – టంగుటూరి ప్రకాశం పంతులు. ఇది తొలి లోక్‌సభ ఎన్నికలలో 16 స్థానాలకు పోటీ చేసింది. 9 స్థానాలు గెలుచుకుంది. ఎక్కువగా మైసూర్ స్టేట్‌లో (నేటి కర్ణాటక) వచ్చాయి. తరువాత జరిగిన శాసనసభలలో ఎన్నికలలో కూడా మంచి ఫలితాలను సాధించింది. అన్నీ కలిపి 77 స్థానాలు గెలిచింది. తరువాత సోషలిస్టు పార్టీతో విలీనమై ప్రజా సోషలిస్ట్ పార్టీగా అవతరించింది. కానీ 1954లోనే కృపలానీ ఈ పార్టీని విడిచిపెట్టారు. స్వతంత్ర రాజకీయవేత్తగా ఉండడం ఆయన ఉద్దేశం. కృపలానీ పార్లమెంట్లో కూడా చాలా కీలకంగానే వ్యవహరించారు. 1952, 1957, 1963, 1967 లోక్‌సభ ఎన్నికలలో ఆయన గెలిచారు. 1961లో వీకే కృష్ణమీనన్ మీద పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. మొదట నెహ్రూ విధానాలను అభిమానించినప్పటికీ తరువాత ఆయనను తీవ్రంగా వ్యతిరేకించడం ఆరంభించారు. గాంధీ సిద్ధాంతాలను నెహ్రూ నిర్లక్ష్యం చేస్తున్నారని కృపలానీ భావన. చైనా యుద్ధంలో భారత్ ఓటమికి చలించిపోయిన కృపలానీ 1963లో నెహ్రూ ప్రభుత్వం మీద అవిశ్వాసం కూడా ప్రవేశపెట్టారు. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆయన పోటీ చేశారు. అప్పుడు కూడా ఓడిపోయారు. ఆ తరువాత ఆయన కోద్దికాలం వినోభా ఆశ్రమంలో గడిపారు. అది ఎంతో కాలం సాగలేదు. 1972లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమం ఆరంభమైంది. ఆమె నియంతృత్వ పోకడలకు నిరసనగా జయప్రకాశ్ నారాయణ్ వంటివారి నాయకత్వంలో సంపూర్ణ విప్లవం పేరుతో అది మొదలయింది. ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కృపలానీ. జేపీతో కలసి దేశమంతా తిరిగి ఇందిర పోకడలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1971నాటి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు, దరిమిలా సుప్రీం కోర్టు షరతులతో కూడిన స్టే, ఆ వెంటనే దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితి ప్రకటన వేగంగా జరిగిపోయాయి. జూన్ 25, 1975 అర్ధరాత్రి దేశ వ్యాప్తంగా జేపీ, మొరార్జీ, అశోక్ మెహతా, కేఆర్ మల్కానీ వంటి ఎందరినో అరెస్టు చేశారు. వారిలో కృపలానీ కూడా ఉన్నారు. ఇలా అనేక రాజకీయ ఆటుపోట్లను చూసిన కృపలానీ 1982లో 94వ ఏట కన్నుమూశారు. అసమ్మతిలో కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించినందుకు ఆయనను చరిత్ర గుర్తుంచుకుంది. - డా. గోపరాజు నారాయణరావు -
నిజమే.. వజీర్‌ను చితక్కొట్టారు
సాక్షి, ఏలూరు/దెందులూరు : స్కూల్ కరస్పాండెంట్ చావబాదడంతో మతిస్థిమితం కోల్పోయిన నాలుగో తరగతి విద్యార్థి ఉదంతంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో ఆర్.నరసింహరావును ఆదేశించారు. దెందులూరు మండలం గంగన్నగూడెంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూపీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న వజీర్‌ను ఆ స్కూల్ కరస్పాండెంట్ వసీవుల్లా విచక్షణా రహితంగా కొట్టడంతో మతిస్థిమితం కోల్పోయాడని వజీర్ తండ్రి హిదయతుల్లా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఉదంతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, కలెక్టర్ స్పందించారు. హుటాహుటిన విద్యాశాఖ అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో ఆర్.నరసింహరావును ఆదేశించారు. దీంతో దెందులూరు ఎంఈవో వి.రంగప్రసాద్‌ను విచారణాధికారిగా నియమిస్తూ డీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎంఈవో రంగప్రసాద్ ఆ పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు. ఉపాధ్యాయులు అఫీజుల్లా, నుజమిల్, 6వ తరగతి విద్యార్థులు అనిష్, అబ్దుల్ రెహమాన్ షాలిక్‌తోపాటు మరో 12 మందిని విడివిడిగా విచారించిన ఎంఈవో వివరాలు నమోదు చేశారు. కొట్టిన విషయం వాస్తవమే... ఘటన జరిగిన రోజున విద్యార్థి వజీర్ కరస్పాండెంట్ ఉంటున్న గదిలోకి వెళ్లి పాస్ పోసినట్టు విచారణాధికారికి ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన కరస్పాండెంట్ వజీర్‌ను కొట్టిన విషయం వాస్తవమేనన్నారు. వజీర్ బాగా చదువుతాడని, క్రమశిక్షణతో ఉంటాడని విద్యార్థులు వాగ్మూ లం ఇచ్చారు. అయితే వజీర్ తరచూ కిందపడిపోతూ ఉంటాడని, అతనికి ఫిట్స్ ఉందని కొందరు చెప్పినట్టు విచారణాధికారి తెలిపారు. ఘటనపై డీఈవోకు నివేదిక అందజేస్తామని రంగప్రసాద్ తెలిపారు. కాగా విచారణ నిర్వహించిన సమయంలో బాధిత విద్యార్థి సోదరుడు, కరస్పాండెంట్ అక్కడ లేరు. చైల్డ్‌లైన్ సిబ్బంది కౌన్సెలింగ్ మౌలానా అబ్దుల్ కలాం పాఠశాలలో చైల్డ్‌లైన్ (ఏలూరు) కో-ఆర్డినేటర్లు వి.ప్రసాద్, జె.ప్రసాద్ తదితరులు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శని వారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, మానసిక స్థితిగతులు, బోధన, పరస్పర సహాయ సహకారాలు, మానవతా ధృక్పథం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.