సాక్షి,తెనాలి : కల్మషం లేని ప్రజానీకం.. కల్చర్ నేర్చిన పట్టణం. ఉద్యమాలకు పురిటి గడ్డ.. ఒకప్పుడు జలరవాణాకు వాణిజ్య కేంద్రం. సాహిత్య సామ్రాజ్యం.. ఇలాంటి విశిష్టతలెన్నో ఉన్న ఆంధ్రా ప్యారిస్ తెనాలికి రాజకీయంగానూ ప్రత్యేకత ఉంది. ఎన్నికల నగారా మోగిన తరుణంలో ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు అధికార టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. అసమ్మతి సెగలు రాజేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై సొంత సామాజిక వర్గమే గుర్రుగా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే, మరికొందరు అలకపాన్పుఎక్కుతున్నారు. వారిని బుజ్జగించలేక.. మండే ఎండలో ప్రచారం చేయలేక.. ఇప్పుడెలా అంటూ ఆలపాటి దిక్కులు చూస్తున్నారు.
నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత జరగనున్న రెండో పర్యాయం ఎన్నికల్లో మళ్లీ త్రిముఖ పోటీ నెలకొంది. అధికార టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఎస్‌ఎన్ విద్యాసంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ ఈ సారి ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే మంచి పేరుంది. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు చివరి స్పీకరుగా పనిచేసి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన నాదెండ్ల మనోహర్ ఈసారి జనసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూలు ముందు నుంచి ప్రారంభమైన∙చేరికలు, ప్రచారం పుంజుకునేకొద్దీ ఊపందుకున్నాయి.
దూరం పెరుగుతోంది..
పొరుగు నియోజకవర్గం నుంచి వలస వచ్చిన టీడీపీ అభ్యర్థి రాజేంద్రప్రసాద్ నివాసం గుంటూరులో ఉంది. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు సహా వివిధ వ్యాపారాల నిర్వహణలో బిజీగా ఉండే ఆలపాటి, గుంటూరు కేంద్రంగానే వీటిని నిర్వర్తిస్తుంటారు. నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా గుంటూరుకు చెందిన అస్మదీయులే వెంట ఉంటారు. ఇక్కడి వ్యాపార లావాదేవీలన్నీ వారే పర్యవేక్షిస్తూ వచ్చారు.
ఆలపాటి ఆయన ఆంతరంగికుడితో అంతర్గత విభేదాల కారణంగా ఒకరొకరుగా దూరమవుతూ వచ్చారు. ప్రస్తుతం అన్నంగి శ్రీను ఒక్కరే గుంటూరు నుంచి వస్తున్నారు. స్థానికంగా కూడా పట్టణ పార్టీ నేత, మరొక ఆంతరంగికుడికి మినహా మిగిలిన ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వటం లేదనీ, తమ మాట వినిపించుకున్న పాపాన పోవటం లేదని ద్వితీయశ్రేణి పార్టీ నాయకులు రగిలిపోతున్నారు.
అక్కడ పార్టీ ఖాళీ..
ఆలపాటి సన్నిహితుల హవాతో టీడీపీలో సొంత సామాజికవర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో క్రియాశీలకంగా ఉండే మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, పార్టీ గ్రాడ్యుయేట్స్ విభాగం జిల్లా నాయకుడు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉండిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారని తెలుసుకున్న ఆలపాటి, స్వయంగా వెళ్లి, దూతలను పంపి, ఏదోరకంగా సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరో యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి, వ్యాపార ప్రముఖుడిని ఇదే తరహాలో బుజ్జగిస్తున్నట్టు సమాచారం. ఇన్ని చేస్తున్నా కొల్లిపరలో పార్టీలోని అక్కడి కీలక సామాజికవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ, జనసేనలో చేరటంతో అక్కడ టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లు తెలుస్తోంది. ప్రచారానికి వెళ్లిన ఆలపాటిని, ఆయన సతీమణిని అభివృద్ధి ఎక్కడంటూ స్థానికులు నిలదీస్తున్నారు.
అసమ్మతి నేతలతో తంటాలు..
పట్టణంలోని పలు వార్డుల్లోని అసమ్మతి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. పట్టణ 16వ వార్డులోని టీడీపీ కౌన్సిలర్, ఆమె భర్త భారీ సంఖ్యలో అనుచరులతో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీలో తాను ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావని అప్పట్లో వారు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. 33వ వార్డు కౌన్సిలర్ కూడా ఇదే తరహాలో టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వివిధ వార్డుల నుంచి స్థానిక ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే ఆలపాటిపై అలకబూనారు. ఆలపాటి స్వయంగా ఇంటికెళ్లి బతిమిలాడినా, దిగిరాలేదని నియో జకవర్గంలో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ వ్యక్తి∙మళ్లీ ప్రచారంలో పాల్గొనటంతో, ఏదొక పదవి హామీతోనే అలక విరమించి ఉంటారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
పెచ్చుమీరిన అవినీతి
నియోజకవర్గంలో అవినీతి పరాకాష్టకు చేరుకోవటం, కొల్లిపర మండల పరిధిలోని కృష్ణానదిలో ఇసుక మేట పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు, నీరు–చెట్టు పథకం అక్రమాలకు నిలయంగా మార్చటం, పట్టణంలో టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తి మురుగు కాలువలు, రోడ్లు పేరుతో డబ్బు దోచుకోవటం, పట్టణంలో గత నాలుగేళ్లలో నిర్మించిన భవనాలకు ప్రతి అంతస్తుకో రేటు చొప్పున నిర్ణయించి, వసూళు సాగిస్తున్న వైనం టీడీపీ సానుభూతిపరులను కూడా ఆలోచింపజేస్తుంది.
గతంలో ఎన్నడూ లేనంతగా అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమార్జనపై స్థానికులు ఏవగించుకుంటున్నారు. ఆలపాటికి ఆంతరంగికులైన కోటరీ చర్యల కారణంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెట్టి పనిచేసే నాయకులు, కార్యకరులు దూరమయ్యారు. ఫలితంగానే ఈ పర్యాయం ఎన్నికల్లో టీడీపీ గట్టెక్కటం అసాధ్యమనే భావనతోనే అసమ్మతి సెగ ఊపందుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment