సాక్షి, గుంటూరు: జిల్లా టీడీపీలో కుమ్ములాటలు అధికమయ్యాయి. అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు గ్రూపులుగా, సామాజిక వర్గాలవారీగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడడంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో టిక్కెట్ల కోసం ద్వితీయ శ్రేణి నేతలు గ్రూపులు కట్టి సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటంతో టీడీపీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి.
నియోజకవర్గ ఇన్‌చార్జి దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు...ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రుల వరకు ఎవరినీ లెక్క చేయకుండా ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు అసమ్మతి బావుటా ఎగురవేస్తున్నారు. జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు టిక్కెట్టు తమదంటే తమదంటూ నియోజకవర్గాల్లో ప్రచారాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అగమ్యగోచరంలో పార్టీ శ్రేణులు
గుంటూరు జిల్లాలో మూడు పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాని దయనీయ స్థితి అధికార పార్టీలో నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరనున్న నేపథ్యంలో అక్కడ అధికార పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక్కడ సరైన అభ్యర్థి దొరక్క గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారికి టిక్కెట్టు ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మద్దాళి గిరికి టిక్కెట్టు దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారికి టిక్కెట్టు కేటాయించాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. దీంతో మద్దాళి గిరి సామాజిక వర్గానికి చెందిన ఆర్యవైశ్య నేతలు టీడీపీపై రగిలిపోతున్నారు.
బాపట్లలో ఎవరికి వారే యమునా తీరే!
బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, వేగేశన నరేంద్రవర్మ రాజు, గాదె వెంకటరెడ్డి తదితరులు టిక్కెట్టు తమదంటే తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి దక్కకపోయినా ఎదుటి వారిని ఓడించేం దుకు సైతం వీరు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మాచర్ల నియోజకవర్గంలో ఇన్‌చార్జిగా ఉన్న చలమారెడ్డికి ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశం కనిపించడం లేదు. అయితే టీడీపీకి సరైన అభ్యర్థి దొరక్క సతమతమవుతోంది.
అక్కడ సైతం ఒకరికి టిక్కెట్టు ఇస్తే మరొకరు ఓడిం చేందుకు గ్రూపులు కట్టి మరీ అసమ్మతి రాజేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గ పరిసి ్థతి మరింత దయనీయంగా మారింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులుకు అసమ్మతి నేతలు నిద్రపట్టకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ద్వితీయ శ్రేణి నేతలు గ్రూపులుగా ఏర్పడి ఈసారి జీవీకి టిక్కెట్టు ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాదరావు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది.
రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన కుటుంబంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయన్ను ఎంపీగా పంపి, ఆ రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను దింపాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. రేపల్లె టిక్కెట్టు మళ్లీ అనగాని సత్యప్రసాద్‌కు ఇస్తున్నట్లుగా వార్తలు వినిపించడంతో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు గతంలో టీడీపీ తరఫున పోటీ చేసిన బీసీ నాయకుడు కేశన శంకరరావు సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఇక్కడ ఓటమి తప్పదని టీడీపీ నేతలు అంగీకరిస్తున్న పరిస్థితి. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆయనకు ఈసారి టిక్కెట్టు దక్కదనే ప్రచారం జోరందుకుంది. దీంతో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీ ఎత్తున వలసలు మొదలయ్యాయి.
తెనాలిలో జనసేనతో చిక్కు...
తెనాలి నియోజకవర్గంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన ఓట్లు భారీగా చీలుతాయని అక్కడ ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, జనసేన మధ్యే పోటీ నడుస్తుందనే ప్రచారం సా గుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
చిలకలూరిపేట, గురజాల, పొన్నూ రు నియోజకవర్గాల్లో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు భా రీ స్థాయి అవినీతికి పాల్పడడంతో సొంత పార్టీ నేతల్లోనే వీరిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొత్తానికి రాజధాని జిల్లా గుంటూరులో అధికా ర పార్టీకి అభ్యర్థులే దొరక్క ఇబ్బందులు పడుతున్న దయనీయ పరిస్థితి నెలకొనడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు
గురిచేస్తోంది.
రాజధాని కేంద్రంలోనూ అదే పరిస్థితి
రాజధాని నియోజకవర్గాలుగా చెబుతున్న తాడికొండ, మంగళగిరి నియోజకర్గాల్లో అయితే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మంగళగిరి ఇన్‌చార్జిగా ఉన్న గంజి చిరంజీవికి ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశం దాదాపు లేనట్లే కనిపిస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు లేదా, ఆమె కుమార్తెకు టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం జరగడంతో మరోవర్గం అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్టు కేటాయిస్తే ఓడిస్తామంటూ ఆయన వ్యతిరేక వర్గం నాయకులు నారా లోకేష్ వద్ద కరాఖండిగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్టు ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ శ్రావణ్‌కుమార్ వర్గీయులు సైతం సమావేశాలు నిర్వహించి మరీ హెచ్చరిస్తుండటంతో రాజధాని నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు పార్టీని వీడడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి దిక్కే లేకుండా పోయారు. సరైన నాయకుడు లేకపోవడంతో మండలానికి ఒక ఇన్‌చార్జి చొప్పున నియమించి ఇప్పటికీ అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment