building collaps
-
బిల్డర్ కక్కుర్తితో కుప్పకూలిన భవనం
హైదరాబాద్: నాణ్యత ప్రమాణాలు పాటించకుండా.. వేగంగా నిర్మాణాలు చేపట్టి ప్లాట్స్ విక్రయించుకోవాలనే బిల్డర్ కక్కుర్తితో ఓ భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్లాబ్ వేస్తున్న కార్మికులు సురక్షితంగా బయట పడగా ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. కాలనీలోని సర్వే నంబర్ 146 పార్ట్‌లో ప్లాట్ నంబర్స్ 64, 65లలో 445 గజాల్లో హెచ్ఎండీఏ అనుమతులతో శ్రీ సాయి కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అయిదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి అపార్ట్‌మెంట్‌కు మూడో స్లాబ్ వేస్తున్నారు. 10 రోజుల క్రితం వేసిన రెండో స్లాబ్ ఒక్కసారిగా కూలడంతో పైన వేస్తున్న మూడో స్లాబ్ సరిగా పూర్తయ్యే సమయానికి కుప్పకూలింది. దీంతో అక్కడ పని చేస్తున్న 20 మంది కార్మికులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. మూడో స్లాబ్‌పై ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో లక్ష్మి, అనితతో పాటు మరో కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అపార్ట్మెంట్ నిర్మాణంలో బిల్డర్ నాణ్యత పాటించకపోవడంతో పాటు క్యూరింగ్ సైతం సరిగా చేయకపోవడం స్లాబ్‌కు, స్లాబ్‌కు సమయం తక్కువగా ఉండటం, నిర్మాణ ప్లానింగ్ సక్రమంగా లేకపోవడం ప్రధాన కారణాలని సమాచారం. ఘటనా స్థలాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీనివాస్‌రావు, ప్రశాంతి, పోలీసులు, డీఆర్ఎస్ సిబ్బంది, కార్పొరేటర్లు సందర్శించారు. కూలిన భవనం చుట్టూ మున్సిపల్ అధికారులు ఫెన్షింగ్ ఏర్పాటు చేశారు. ప్రమాదానికి బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకుంటామని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. -
ఆకాశహర్మ్యంలో పేలుడు
మాస్కో: రష్యాలోని మాగ్నిటోగొరస్క్ నగరంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. పురాతన బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన పేలుడుతో నలుగురు చనిపోయారు. చాలామంది జాడ తెలీడంలేదు. పేలుడు ధాటికి భవనంలోని ఒక భాగం కుప్పకూలింది. దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 22 డిగ్రీలకు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం గ్యాస్ లీకేజీ కారణంగానే చోటుచేసుకుందని జాతీయ భద్రతా సంస్థ ఎఫ్ఎస్బీ నిర్ధారించింది. రష్యాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. -
పాతబస్తీలో కుప్పకూలిన భవనం..
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాతంలో హుస్సేనీ ఆలంలోని మహేశ్వరి సేవా ట్రస్ట్ భవనం శ్లాబ్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు శిథిలాల్లో చిక్కుకుపోయిన కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు. చనిపోయిన కూలీలు నంద (32), వెంకటయ్య (40)లుగా గుర్తించారు. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందినవారుగా గుర్తించారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారి మాట్లాడుతూ... ట్రస్ట్ నిర్వాహకులు అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ స్థల వివాదం కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే నోటీసులిచ్చినట్లు చెప్పారు. బిల్డర్, ఇంజినీర్, సూపర్వైజర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.