హైదరాబాద్: నాణ్యత ప్రమాణాలు పాటించకుండా.. వేగంగా నిర్మాణాలు చేపట్టి ప్లాట్స్ విక్రయించుకోవాలనే బిల్డర్ కక్కుర్తితో ఓ భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్లాబ్ వేస్తున్న కార్మికులు సురక్షితంగా బయట పడగా ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. కాలనీలోని సర్వే నంబర్ 146 పార్ట్‌లో ప్లాట్ నంబర్స్ 64, 65లలో 445 గజాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులతో శ్రీ సాయి కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అయిదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు.
బుధవారం ఉదయం నుంచి అపార్ట్‌మెంట్‌కు మూడో స్లాబ్ వేస్తున్నారు. 10 రోజుల క్రితం వేసిన రెండో స్లాబ్ ఒక్కసారిగా కూలడంతో పైన వేస్తున్న మూడో స్లాబ్ సరిగా పూర్తయ్యే సమయానికి కుప్పకూలింది. దీంతో అక్కడ పని చేస్తున్న 20 మంది కార్మికులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. మూడో స్లాబ్‌పై ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో లక్ష్మి, అనితతో పాటు మరో కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అపార్ట్‌మెంట్ నిర్మాణంలో బిల్డర్ నాణ్యత పాటించకపోవడంతో పాటు క్యూరింగ్ సైతం సరిగా చేయకపోవడం స్లాబ్‌కు, స్లాబ్‌కు సమయం తక్కువగా ఉండటం, నిర్మాణ ప్లానింగ్ సక్రమంగా లేకపోవడం ప్రధాన కారణాలని సమాచారం. ఘటనా స్థలాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీనివాస్‌రావు, ప్రశాంతి, పోలీసులు, డీఆర్‌ఎస్ సిబ్బంది, కార్పొరేటర్లు సందర్శించారు. కూలిన భవనం చుట్టూ మున్సిపల్ అధికారులు ఫెన్షింగ్ ఏర్పాటు చేశారు. ప్రమాదానికి బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకుంటామని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment