పాతబస్తీలో కుప్పకూలిన భవనం..
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాతంలో హుస్సేనీ ఆలంలోని మహేశ్వరి సేవా ట్రస్ట్ భవనం శ్లాబ్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు శిథిలాల్లో చిక్కుకుపోయిన కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు. చనిపోయిన కూలీలు నంద (32), వెంకటయ్య (40)లుగా గుర్తించారు. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందినవారుగా గుర్తించారు.
దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారి మాట్లాడుతూ... ట్రస్ట్ నిర్వాహకులు అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ స్థల వివాదం కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే నోటీసులిచ్చినట్లు చెప్పారు. బిల్డర్, ఇంజినీర్, సూపర్వైజర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.