కొత్త  డౌటు  గురూ | New Doubt Guru:Mind Your Health | Sakshi
Sakshi News home page

కొత్త  డౌటు  గురూ

Published Thu, Mar 22 2018 12:44 AM | Last Updated on Thu, Mar 22 2018 12:44 AM

New Doubt Guru:Mind Your Health - Sakshi

వాట్సప్‌లో హెల్త్‌ అలర్ట్‌ చూస్తే బెంగ.న్యూస్‌ పేపర్‌లో హెల్త్‌ కాలమ్‌ కనపడితే కంగారు.టీవీలో డాక్టర్‌ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు ఆ డాక్టర్‌ చెబుతున్నది తన గురించేనా అని ఆందోళన.ఆరోగ్యం గురించి చైతన్యవంతం కావడం వేరు.ఆరోగ్యం గురించిన సమాచారంలో మునిగి దానినో పెనుభూతంగా మార్చుకోవడం వేరు.ప్రతిదీ చదవాలనీ, ఆ చదివింది ఉందో లేదో చూసుకోవాలని అనుకోవడం పెద్దజబ్బు.దాని పేరే‡ ‘ఆర్థోరెక్సియా నర్వోజా’. సమాచార వ్యవస్థ పెరిగిపోయి హెల్త్‌ అవేర్‌నెస్‌ విపరీతమయ్యేసరికి ఆరోగ్యం గురించిన డౌట్లే ఒక జబ్బుగా బాధపడుతున్నవారి  అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. 

‘ఆర్థోరెక్సియా నర్వోజా’ను తెలుసుకునే ముందు... అదే కోవకు చెందిన ‘అనొరెక్సియా’,  ‘బులీమియా’ల గురించి కొంచెం తెలుసుకోవాలి. తాము బాగా లావెక్కి ఓబేస్‌గా మారితే అందంగా ఉండబోమన్న భావనతో,  ఏ పదార్థాన్నీ ఇష్టపడకుండా, అసలు ఒక దశలో ఆహారాన్నే పూర్తిగా అసహ్యించుకునే స్థితికి చేరే రుగ్మతే ‘అనొరెక్సియా నర్వోజా’. ఇక  ‘బులీమియా’ కూడా ఇంచుమించూ ఇలాంటిదే. కాకపోతే వీళ్లు రుచి కోసం కొద్దిగా ఆహారాన్ని తిని, వెంటనే వాంతి చేసుకుంటారు. మరి ఈ ఆర్థోరెక్సియా నర్వోజా అంటే?‘అనొరెక్సియా’, ‘బులీమియా’లలో అందం ప్రధానం కాగా... ‘ఆర్థోరెక్సియా’లో ఆరోగ్యం ప్రధానమవుతుంది.  అనొరెక్సియా, బులీమియా కండిషన్లకు  మోడలింగ్‌ చేసేవారు, బాలే డాన్సర్లు, యాక్టింగ్‌ వంటి వృత్తుల్లో ఉన్నవారు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉండగా, మితిమీరిన ఆరోగ్య స్పృహ ఉన్నవారంతా ఆర్థోరెక్సియాకు లోనయ్యే అవకాశం ఉంది. 

ఎలా కనుగొన్నారీ కొత్త జబ్బును...? 
కొంతకాలం క్రితం యూనివర్సిటీ ఆఫ్‌ రోమ్‌కు చెందిన దాదాపు 400కు పైగా విద్యార్థులు ఒక ఆరోగ్య సర్వే నిర్వహించారు. అందంగా కనిపించడానికి ఆస్కారం ఉండే కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి మాత్రమే ఉండాల్సిన అనొరెక్సియా, బులీమియా రుగ్మతలు తాము సర్వే జరిపిన శాంపిల్‌లోని సాధారణ వ్యక్తులలో దాదాపు 7 శాతం మందికి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రెండు వ్యాధులూ కలగలసి ఉన్న ఒక కొత్త రుగ్మతను కలిగి ఉన్నవారు కూడా తాము సర్వే నిర్వహించిన జనాభాలో ఉన్నట్లుగా గ్రహించారు. ఈ విషయాన్ని మరింత నిర్దిష్టంగా తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ రోమ్‌ విద్యార్థులు ఒక ప్రశ్నావళి రూపొందించారు. ఆ ప్రశ్నావళి ఆధారంగా నిర్వహించిన సర్వేలో చాలా విచిత్రమైన విషయాలు తెలిసివచ్చాయి. అప్పుడు తెలిసిన రుగ్మతకు ‘ఆర్థోరెక్సియా నర్వోజా’ అని పేరు పెట్టారు. 

లక్షణాలేమిటి? 
ఒక మోస్తరు స్థాయిలో జీవనం సాగించే అందరికీ సాధారణంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు తెలిసే ఉంటాయి. ఉదాహరణకు ఉప్పు ఎక్కువగా తినకూడదు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి,  పిజ్జాలు, బర్గర్లు, ఇతర జంక్‌ఫుడ్, బేకరీ ఐటమ్స్‌ అన్నీ అనారోగ్య కారకాలు, బయటి పదార్థాలు తింటే గ్యాస్ట్రైటిస్, డయేరియా వంటి జబ్బులొస్తాయి... ఇలాంటివి. ఇవన్నీ ప్రాథమిక అవగాహన వల్ల ఇవి మనకు తెలిసిన సంగతులు. అయితే ఇవే సూత్రాలను మితిమీరి పాటిస్తుంటే మాత్రం ఆర్థోరెక్సియా ఉందని అనుమానించాల్సి ఉంటుంది. 

ఉదాహరణకు... 
ఉప్పు ఎక్కువగా తినకూడదనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడో ఒకసారి బాగా రుచిగా అనిపించినప్పుడు ఒక అప్పడం అదనంగా తినేస్తాం. లేదా కొత్త ఆవకాయ పెట్టిన సందర్భంలోనో లేదా అసలు ఆవకాయ పెట్టేలోపు  పచ్చిమామిడితో తాత్కాలికంగా చేసుకున్న పచ్చడితో కాస్తంత ఎక్కువగా అన్నం తింటాం. ఇక అలా తిన్నప్పట్నుంచి వారిలో ఒక అపరాధ భావన మొదలవుతుంటుంది. ఆ ఉప్పు వల్ల ఆరోగ్యానికి కీడు కలుగుతుందేమో లేదా అది కిడ్నీలను దెబ్బతీస్తుందేమో అనిపిస్తుంటుంది. మాటిమాటికీ మనలో రక్తపోటు పెరిగిపోయిన భావన కలుగుతుంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలైన తల తిరుగుతున్నట్లు, తలనొప్పిగా అనిపించవచ్చు. ఒక స్నేహితుడు అమెరికా నుంచి వస్తూ ఇచ్చిన చాక్లెట్‌ తిన్నారనుకుందాం. అప్పట్నుంచి ఆ చాక్లెట్‌ వల్ల ఇక తమకు డయాబెటిస్‌ వస్తుందేమో అనే ఆందోళన పెరిగిపోతుంటుంది. ఇలాంటి ఫీలింగ్స్‌ పెంపొందించుకున్నవారు తమకు ఎవరు చాక్లెట్, ఐస్‌క్రీమ్‌ లాంటివి ఆఫర్‌ చేసినా తిరస్కరిస్తుంటారు. ఈ కండిషన్‌ను ‘హైపర్‌ యాక్యురసీ’ అంటారు. ఈ హైపర్‌ యాక్యురసీ భావనను అధిగమించడానికి రోజూ చేయాల్సిన దాని కంటే మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉండటం, ఈ వ్యాయామం తాము తిన్న ఆహారాన్ని పూర్తిగా బర్న్‌ చేసిందో లేదో అంటూ ఆందోళన చెందడం, మరింత సేపు వ్యాయామాన్ని కొనసాగిస్తూ తమను తాము బాధపెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. వ్యాయామంతో ఆనందించే స్థాయి నుంచి క్రమంగా వారు వ్యాయామంతో తమను తాము హింసించుకోవడం స్థాయికి చేరుతారు.  

ఆధ్యాత్మిక ఆర్థోరెక్సియా కూడా... 
దేవుడి ప్రసాదాన్ని మనమంతా పవిత్రంగా భావిస్తాం. ఎలాంటి ఫీలింగ్స్‌ లేకుండా భక్తిభావనతో తిన్నవారు కొద్దిసేపట్లోనే దాన్ని మరచిపోతారు. ఆధ్యాత్మిక ఆర్థోరెక్సియా ఉన్నవారు ఆ ప్రసాదంలోని కొన్ని పదార్థాలతో తమ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందేమోనని అనుక్షణం ఆందోళన చెందుతుంటారు. ఉదాహరణకు  ప్రసాదంలో అరటిముక్కలు, కొబ్బరిముక్కలు, చక్కెర ఉంటే ఆర్థోరెక్సియా ఉన్నవారి ఆలోచనలు ఇలా సాగుతుంటాయి. ‘అరటిపండులో చక్కెరపాళ్లు ఎక్కువ అంటారు. పైగా దాన్ని చక్కెరతో కలిపి తిన్నాం. ఇక మనలో షుగర్‌పాళ్లు పెరుగుతాయేమో. దాంతో నాకు డయాబెటిస్‌ వస్తుందేమో’ అని ఆలోచిస్తూ ఆందోళన పెంచుకుంటారు. ఇక కొన్ని ప్రసాదాల్లో బూందీలడ్డూతో పాటు అక్కడక్కడ జీడిపప్పు వచ్చి, దాన్ని నమిలారనుకుందాం. అప్పుడు ‘అయ్యో... ప్రసాదంలోని జీడిపప్పు తిన్నాను. జీడిపప్పులో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువట. ఇక ఈ లడ్డూలను నెయ్యితోనే చేసి ఉంటారు.ఇప్పుడెలా? ఒంట్లో కొవ్వు పెరిగి నాకు గుండెజబ్బులు వస్తాయేమో? రక్తనాళాల్లో కొవుపదార్థాలు చేరి, హార్ట్‌ ఎటాక్‌ వస్తుందేమో’ అంటూ ఆందోళన చెందుతుంటారు. ఈ ఆందోళన భావన ఎంతగా పెరుగుతుందంటే ఒక్కోసారి టీ, కాఫీలలో చక్కెర ఎక్కువైతే అది తమకు  హాని చేస్తుందని భయపడుతూ, ఆ హానిని నివారించేందుకు ఆ చక్కరను బర్న్‌ చేయడానికి అనవసరంగా మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండటం, తాము క్యాజువల్‌గానే ఉన్నామనే భావనను ఎదుటివారిలో కలిగిలా నటిస్తూ... అటూ ఇటూ తిరగడం చేస్తుంటారు. మరోవైపు ఇలాంటి ఆలోచనల వల్ల ప్రసాదం వద్దనుకుంటే తాము భగవంతుడి పట్ల ద్రోహచింతనతో మెలుగుతున్నామనే ఫీలింగ్‌ వి పెరిగిపోయి  క్రమంగా అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ)గా కూడా పరిణమించవచ్చు. 

తమకు తామే సామాజిక బహిష్కరణ... 
ఆర్థోరెక్సియా నర్వోజా తరహా ఆలోచనలు పెరుగుతున్నవారు ఒంటరిగా  ఉండటం మొదలుపెడతారు. క్రమంగా తమను తాము సామాజికంగా బహిష్కరించుకుంటారు. నెలవారీ సరుకుల జాబితా నుంచి కొన్ని ఆహారపదార్థాలను తొలగించుకుంటూ పోతారు. లేదా కొన్నింటి కోసం ఆర్గానిక్‌ మాల్స్‌లో వెతుకుతుంటారు. అవి కొన్న తర్వాత... అవి ఆర్గానిక్‌ తరహాలో పండించినవేనా లేదా మామూలు వాటినే ఆ మాల్స్‌లో పెట్టి ఆర్గానిక్‌ అంటూ అమ్ముతున్నారా అని మళ్లీ ఆందోళన చెందుతుంటారు. అవి మంచివే కదా అంటూ వాటి నాణ్యతను గురించి షాపు యజమానులతో మితిమీరి వాకబు చేస్తుంటారు. ఏది తినమన్నా ఏదో కారణం చెప్పి వాటిని తిరస్కరిస్తుంటారు. ఇక బయట ఎక్కడైనా రెస్టారెంట్‌లో తినాల్సి వస్తే వారు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేశారో, అవి మంచివో–కావో, బాగా వండారో–లేదో, ఎలాంటి నూనెలు ఎంపిక చేసుకున్నారో, ఆరోగ్యవంతమైనవి కాకపోవచ్చేమో అని ఆందోళన పెంచుకుంటుంటారు. ఆ తర్వాత ఇంటి వంటలోనూ చాలా పద్ధతులు పాటిస్తూ, ఎన్నో రకాల పరిమితులు విధించుకుంటూ తమను తాము బాధించుకుంటుంటారు. ఇది బాధించుకోవడం స్థాయి దాటి హింసించుకునే స్థాయికి చేరుతుంది. 

సొంతంగా కూడా బయటపడవచ్చు... 
ఆర్థోరెక్సియా నర్వోజా నుంచి బయటపడటం చాలా తేలిక. ఆరోగ్యంగా ఉండటం మంచిదే... కానీ అది తమ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదంటూ తమకు తాము కౌన్సెలింగ్‌ చేసుకుంటూ ఉండాలి. అరుదుగా కొద్దిపాటి తీపిపదార్థాలతో, ప్రసాదం వంటి పరిమిత ఆహారాలతో ప్రమాదం జరగదని సర్దిచెప్పుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారాలను కూడా దీర్ఘకాలం తీసుకుంటేనే ప్రమాదంగానీ... ఎప్పుడో ఒకసారి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినదని గ్రహించాలి. అయితే ఇలా తమకు తాము సర్దిచెప్పుకున్నా పరిస్థితిని అధిగమించలేకపోతే మాత్రం మానసిక నిపుణుల/ప్రొఫెషనల్స్‌ సలహా తీసుకోవాలి. 
– డా.కళ్యాణ్‌ చక్రవర్తి, సీనియర్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్,  లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్‌ 

 తమకు చాక్లెట్, ఐస్‌క్రీమ్‌ లాంటివి ఆఫర్‌ చేసినా తిరస్కరిస్తుంటారు. ఈ కండిషన్‌ను ‘హైపర్‌ యాక్యూరసీ’ అంటారు. ఈ హైపర్‌ యాక్యురసీ భావనను అధిగమించడానికి రోజూ చేయాల్సిన దాని కంటే మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉండటం, ఈ వ్యాయామం తాము తిన్న ఆహారాన్ని పూర్తిగా బర్న్‌ చేసిందో లేదో అంటూ ఆందోళన చెందుతుంటారు. మరింత సేపు వ్యాయామాన్ని కొనసాగిస్తూ తమను తాము బాధపెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. వ్యాయామంతో ఆనందించే స్థాయి నుంచి క్రమంగా వారు వ్యాయామంతో తమను తాము హింసించుకోవడం స్థాయికి చేరుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement