చుక్‌ చుక్‌ రైలు వస్తోంది..యాప్‌లో చూసి ఎక్కండి! | South Central Railway Introducing Real Time Information System | Sakshi
Sakshi News home page

చుక్‌ చుక్‌ రైలు వస్తోంది..యాప్‌లో చూసి ఎక్కండి!

Published Sat, Nov 2 2019 3:19 AM | Last Updated on Sat, Nov 2 2019 3:33 AM

South Central Railway Introducing Real Time Information System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం అందుబాటులోకి రానుంది. ఏ రైలు ఎక్కడుందో క్షణాల్లో తెలిసిపోనుంది. రైళ్ల సమయ పాలనపైన ప్రయాణికులకు కచ్చిత మైన సమాచారం లభించనుంది. ఇప్పటివరకు కంట్రోల్‌ కేంద్రాల ద్వా రా మాత్రమే లభించే రైళ్ల రాకపోకల వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కానున్నాయి. ప్రతి 30 సెకన్లకోసారి రైలు కదలికలు నిక్షిప్త మవుతాయి. ప్రయాణికులు మొబైల్‌ ఫోన్ల ద్వారా కూడా రైళ్ల రాకపోకల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసు కోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం కోసం చేపట్టిన ‘రియల్‌ టైమ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌’(ఆర్‌టీఐఎస్‌) ప్రాజెక్టు దక్షిణమధ్య రైల్వేలో తుది దశకు చేరుకుంది. శాటిలైట్స్‌ కమ్యూనికేషన్స్‌ ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేస్తారు.

ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా రైళ్ల రాక పోకల ప్రత్యక్ష సమాచారానికి అంతరాయం లేకుండా శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ దోహదం చేస్తుంది. ఈ ఆర్‌టీఐఎస్‌ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వేలోని 334 డీజిల్‌ లొకోమోటివ్‌లు, 186 ఎలక్ట్రికల్‌ లొకోమోటివ్‌ ఇంజన్లను ఆర్‌టీఐఎస్‌ డివైజెస్‌తో అనుసంధానం చేశారు. వచ్చే జనవరి నాటికి అన్ని ఎలక్ట్రిక్, డీజిల్‌ ఇంజన్లను ఈ ఆర్‌టీఐఎస్‌తో అనుసంధానం చేసి ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేసే దిశగా దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ‘హైలైట్స్‌’(హైదరాబాద్‌ లైవ్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌) మొబైల్‌ యాప్‌ ద్వారా 121 ఎంఎంటీఎస్‌ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తున్నట్లుగానే ఆర్‌టీఐఎస్‌ ద్వారా దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ఎక్స్‌ప్రెస్‌/మెయిల్‌ సర్వీసుల ప్రత్యక్ష సమాచారం త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

ఎలా పని చేస్తుంది..

  • ఇప్పటివరకు రైళ్ల సమాచారానికి కంట్రోల్‌ కేంద్రాలే ఆధారం. రైలు బయలుదేరిన సమాచారాన్ని ఒక కంట్రోల్‌ రూమ్‌ నుంచి మరో కంట్రోల్‌ రూమ్‌కు చేరవేయడం ద్వారా మాత్రమే రైల్వేస్టేషన్లలో ఏ రైలు ఏ సమయానికి చేరుకుంటుంది.. అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతుంది అనే సమాచారాన్ని అనౌన్స్‌మెంట్‌ చేసేవారు. 
  • కానీ ఆర్‌టీఐఎస్‌లో భాగంగా అన్ని లోకో ఇంజన్‌లలో జీపీఎస్‌ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. లోకో ఇంజన్‌కు బయటివైపు రూఫ్‌టాప్‌పైన ఏర్పాటు చేసే డివైజ్‌ను రైల్‌ ఎంఎస్‌ఎస్‌ టెర్మినల్‌ (ఆర్‌ఎంటీ) మొబైల్‌ శాటిలైట్‌ సర్వీస్‌ (ఎంఎస్‌ఎస్‌)తో, మరో రెండు 4జీ మొబైల్‌ నెట్‌వర్క్స్‌తో అనుసంధానం చేస్తారు. 
  • రైలు ఇంజన్‌ లోపలి భాగంలో లోకో పైలెట్‌కు అందుబాటులో ఇండియన్‌ రైల్‌ నావిగేటర్‌ (ఐఆర్‌ఎన్‌) అనే మరో డివైజ్‌ను ఏర్పాటు చేస్తారు. 
  • రైలు బయలుదేరడానికి ముందు లోకోపైలెట్‌ తన వద్ద ఉన్న జీపీఎస్‌ డీవైజ్‌లో ట్రైన్‌ నెంబర్, ఐడీ, బయలుదేరే సమయం, తదితర వివరాలను నమోదు చేసి ‘స్టాట్‌ జర్నీ’బటన్‌ నొక్కుతాడు. దీంతో ప్రతి 30 సెకన్లకోసారి రైలు కదలికలు నమోదవుతాయి.
  • ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఢిల్లీల్లోని సెంట్రల్‌ లొకేషన్‌ సర్వర్‌ (సీఆర్‌ఐఎస్‌)కు చేరుతుంది. సెంట్రల్‌ సర్వర్‌కు అందిన సమాచారం ఆటోమేటిక్‌గా కంట్రోల్‌ ఆఫీస్‌ అప్లికేషన్‌కు వెళ్లిపోతుంది. ఇక్కడ్నుంచి నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ (ఎన్‌టీఈఎస్‌) ద్వారా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతుంది. 
  • రైలు బయలుదేరినప్పటి నుంచి ఈ మొత్తం వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
  • రైళ్ల నిర్వహణలో ఈ సమాచారం ఎంతో కీలకమైనది. ట్రైన్‌ నడిపే లోకోపైలెట్‌ ఎలాంటి అత్యవసర సమాచారాన్ని అయినా నేరుగా సెంట్రల్‌ సర్వర్‌కు చేరవేయవచ్చు. ప్రతికూల వాతావరణం, వరదలు, ముంపు పరిస్థితులు, సిగ్నలింగ్‌ వ్యవస్థ, తదితర అన్ని అంశాలపైన ప్రత్యక్ష సమాచారం లభిస్తుంది. 

సమయం సద్వినియోగం..
‘ప్రతిరోజు సుమారు 10 లక్షల మంది దక్షిణ మధ్య రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. వీరంతా ఇప్పటివరకు తాము బయలుదేరాల్సిన ట్రైన్‌ కోసం రైల్వే నుంచి లభించే సమాచారం పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు, ఆలస్యానికి కారణాలు వంటి సమాచారం కూడా అందుబాటులో ఉండదు. ఇక నుంచి ప్రత్యక్షంగా ఈ సమాచారమంతా లభించడం వల్ల ప్రయాణికులు తమ సమయాన్ని మరింత సమర్థంగా వినియోగించుకొనేందుకు అవకాశముంటుంది. అలాగే రైళ్ల నిర్వహణలో మరింత పారదర్శకతకు అవకాశం లభిస్తుంది.’
–దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌

  • దక్షిణ మధ్య రైల్వేలో డీజిల్‌ లోకోమోటివ్స్‌ -  582
  • ఇప్పటివరకు అనుసంధానమైనవి -             334
  • ఇంకా అనుసంధానం కావల్సినవి -              248
  • అనుసంధానం కావల్సిన లోకోమోటివ్స్‌ -         80
  • లాలాగూడ, విజయవాడ వర్క్‌ షాపుల్లో ఉన్న మొత్తం ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్స్‌- 266
  • ఇప్పటివరకు అనుసంధానమైనవి -               186 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement