real time
-
4జీ కనెక్టివితో పేటీఎం 3.0 సౌండ్‌బాక్స్
ముంబై: చెల్లింపుల ప్రక్రియను మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు పేమెంట్స్, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం 4జీ ఆధారిత సౌండ్‌బాక్స్ 3.0 ని ఆవిష్కరించింది. రియల్ టైమ్ పేమెంట్ పరిశ్రమలో అలర్టుల కోసం స్థిరమైన కనెక్టివిటీ ఉపయోగించి తయారుచేసిన మొట్టమొదటి 4జీ సౌండ్‌బాక్స్ ఇది. వాటర్ ప్రూఫ్ ఫీచర్ కలిగిన ఈ మేడిన్ ఇండియా ప్రాడెక్ట్ బ్యాటరీ జీవిత కాలం ఏడురోజులుగా ఉంది. పరిసర ప్రాంతాల్లో 4జీ నెట్వర్క్ పనిచేయకపోతే, చెల్లింపులకు ఎలాంటి అంతరాతయం కలగకుండా ఆటోమేటిక్‌గా 2జీకి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఇందులో మొత్తం 11 భాషలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు స్వీకరించిన పేమెంట్స్‌పై కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే 24 గంటల హెల్ప్‌లైన్, ఒక గంట కాల్ బ్యాక్ పాలసీ అందిస్తుంది. పేటీఎం మెర్క్యూ లెండింగ్ భాగస్వాముల ద్వారా తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. -
రియల్ టైం క్రాప్ మేనేజ్మెంట్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగవుతుందో గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్ టైం క్రాప్ మేనేజ్మెంట్ ద్వారా సర్వే నంబర్ల వారీగా సాగవుతున్న పంటల గుర్తింపులో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించిందన్నారు. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభు త్వం విజయవంతంగా అమలు చేస్తున్న ఈ–క్రాప్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. చదవండి: అతి త్వరలో గడపగడపకు వైద్యం జిల్లా వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, మండల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ–క్రాప్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ–క్రాప్ అమలులో ఏపీని కూడా భాగస్వామిని చేయడం గర్వకారణమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, పంటల బీమా వంటి అన్ని పథకాలు ఈ–క్రాప్ ప్రామాణికంగానే అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ–క్రాప్ నమోదు చేసిన రైతులందరికీ ఈ–కేవైసీ (మీ పంట తెలుసుకోండి) నమోదు ప్రారంభించాలన్నారు. ‘వైఎస్సార్ యంత్ర సేవ’ కింద కిసాన్ డ్రోన్ల మంజూరుకు రైతు గ్రూపుల ఎంపికను సత్వరమే పూర్తి చేయాలన్నారు. -
మీ స్మార్ట్‌ఫోన్‌తో తుపాన్లను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా...!
తెలుగు రాష్ట్రాలను గులాబ్ తుపాన్ అతాలకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. గులాబ్ దెబ్బకు ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గులాబ్ సైక్లోన్ ఒక్కటే కాదు పలు సైక్లోన్స్ వస్తూనే ఉంటాయి. భారత వాతావరణ శాఖ రాబోయే తుపాన్లపై ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తాయి. తుపాన్ బలపడిందా, లేదా బలహీన పడిందా అనే విషయాలను అందుబాటులో ఉన్న వెబ్సైట్లను ఉపయోగించి మన స్మార్ట్‌ఫోన్‌తో మనమే ట్రాక్ చేయవచ్చుననే విషయం మీకు తెలుసా...! అందుబాటులోని వెబ్సైట్ల ద్వారా తుపాన్ కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చను. దీంతో తుపాన్ ప్రభావం నుంచి కాస్త ఉపశమన చర్యలను ముందుగా తీసుకునే వీలు ఉంటుంది. తుపాను కదలికలను ఆన్లైన్లో ఇలా ట్రాక్ చేయండి 1. www.mausam.imd.gov.in తుపానును ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే వెబ్సైట్లలో mausam.imd.gov.in అత్యంత విశ్వసనీయమైన వెబ్సైట్లలో ఒకటి. ఈ వెబ్‌సైట్‌ను ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. దేశంలో సంభవించే అన్ని తుపానులను ఈ వెబ్సైట్ ద్వారా ట్రాక్ చేయవచ్చును. మీరు తుపాన్‌ను ట్రాక్ చేయలనుకుంటే బ్రౌజర్లో mausam.imd.gov.in ఎంటర్ చేయండి. తరువాత వెబ్సైట్లో సైక్లోన్‌పై క్లిక్ చేయండి. తరువాత ట్రాక్ సైక్లోన్ డిస్ట్రబెన్స్‌పై క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ ద్వారా తుపాన్లను ట్రాక్ చేయవచ్చును. 2.www.rsmcnewdelhi.imd.gov.in ఉత్తర హిందూ మహాసముద్రం ఏర్పడే తుపాన్లను ట్రాక్ చేయడానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌సైట్‌ను భారత వాతావరణశాఖ-ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ది చేశారు. 3. ఉమాంగ్ యాప్(UMANG) ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించి ప్రత్యక్షంగా తుపాన్లను ట్రాక్ చేయవచ్చును. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఉమాంగ్ యాప్ సహాయంతో తుపాన్ల రియల్‌టైమ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. 4. www.hurricanezone.net www.hurricanezone.net వెబ్సైట్ సహయంతో తుఫాన్ల స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చును. ఈ వెబ్సైట్లో ఇండియన్ ఓషన్, వెస్ట్ పసిఫిక్, సౌత్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్, ఈస్ట్ పసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో వచ్చే సైక్లోన్లు, టైఫూన్ల, హరికేన్లను ట్రాక్ చేయవచ్చును. -
చుక్ చుక్ రైలు వస్తోంది..యాప్‌లో చూసి ఎక్కండి!
సాక్షి, హైదరాబాద్: రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం అందుబాటులోకి రానుంది. ఏ రైలు ఎక్కడుందో క్షణాల్లో తెలిసిపోనుంది. రైళ్ల సమయ పాలనపైన ప్రయాణికులకు కచ్చిత మైన సమాచారం లభించనుంది. ఇప్పటివరకు కంట్రోల్ కేంద్రాల ద్వా రా మాత్రమే లభించే రైళ్ల రాకపోకల వివరాలు ఇక నుంచి ఆన్లైన్లో ప్రత్యక్షం కానున్నాయి. ప్రతి 30 సెకన్లకోసారి రైలు కదలికలు నిక్షిప్త మవుతాయి. ప్రయాణికులు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా రైళ్ల రాకపోకల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసు కోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం కోసం చేపట్టిన ‘రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’(ఆర్టీఐఎస్) ప్రాజెక్టు దక్షిణమధ్య రైల్వేలో తుది దశకు చేరుకుంది. శాటిలైట్స్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా రైళ్ల రాక పోకల ప్రత్యక్ష సమాచారానికి అంతరాయం లేకుండా శాటిలైట్ కమ్యూనికేషన్స్ దోహదం చేస్తుంది. ఈ ఆర్టీఐఎస్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వేలోని 334 డీజిల్ లొకోమోటివ్లు, 186 ఎలక్ట్రికల్ లొకోమోటివ్ ఇంజన్లను ఆర్టీఐఎస్ డివైజెస్‌తో అనుసంధానం చేశారు. వచ్చే జనవరి నాటికి అన్ని ఎలక్ట్రిక్, డీజిల్ ఇంజన్లను ఈ ఆర్టీఐఎస్తో అనుసంధానం చేసి ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేసే దిశగా దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ‘హైలైట్స్’(హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్) మొబైల్ యాప్ ద్వారా 121 ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తున్నట్లుగానే ఆర్టీఐఎస్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారం త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఎలా పని చేస్తుంది.. ఇప్పటివరకు రైళ్ల సమాచారానికి కంట్రోల్ కేంద్రాలే ఆధారం. రైలు బయలుదేరిన సమాచారాన్ని ఒక కంట్రోల్ రూమ్ నుంచి మరో కంట్రోల్ రూమ్‌కు చేరవేయడం ద్వారా మాత్రమే రైల్వేస్టేషన్లలో ఏ రైలు ఏ సమయానికి చేరుకుంటుంది.. అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతుంది అనే సమాచారాన్ని అనౌన్స్మెంట్ చేసేవారు. కానీ ఆర్టీఐఎస్లో భాగంగా అన్ని లోకో ఇంజన్లలో జీపీఎస్ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. లోకో ఇంజన్‌కు బయటివైపు రూఫ్టాప్పైన ఏర్పాటు చేసే డివైజ్‌ను రైల్ ఎంఎస్ఎస్ టెర్మినల్ (ఆర్ఎంటీ) మొబైల్ శాటిలైట్ సర్వీస్ (ఎంఎస్ఎస్)తో, మరో రెండు 4జీ మొబైల్ నెట్వర్క్స్తో అనుసంధానం చేస్తారు. రైలు ఇంజన్ లోపలి భాగంలో లోకో పైలెట్‌కు అందుబాటులో ఇండియన్ రైల్ నావిగేటర్ (ఐఆర్ఎన్) అనే మరో డివైజ్‌ను ఏర్పాటు చేస్తారు. రైలు బయలుదేరడానికి ముందు లోకోపైలెట్ తన వద్ద ఉన్న జీపీఎస్ డీవైజ్లో ట్రైన్ నెంబర్, ఐడీ, బయలుదేరే సమయం, తదితర వివరాలను నమోదు చేసి ‘స్టాట్ జర్నీ’బటన్ నొక్కుతాడు. దీంతో ప్రతి 30 సెకన్లకోసారి రైలు కదలికలు నమోదవుతాయి. ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఢిల్లీల్లోని సెంట్రల్ లొకేషన్ సర్వర్ (సీఆర్ఐఎస్)కు చేరుతుంది. సెంట్రల్ సర్వర్‌కు అందిన సమాచారం ఆటోమేటిక్‌గా కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్‌కు వెళ్లిపోతుంది. ఇక్కడ్నుంచి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్) ద్వారా ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుంది. రైలు బయలుదేరినప్పటి నుంచి ఈ మొత్తం వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రైళ్ల నిర్వహణలో ఈ సమాచారం ఎంతో కీలకమైనది. ట్రైన్ నడిపే లోకోపైలెట్ ఎలాంటి అత్యవసర సమాచారాన్ని అయినా నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరవేయవచ్చు. ప్రతికూల వాతావరణం, వరదలు, ముంపు పరిస్థితులు, సిగ్నలింగ్ వ్యవస్థ, తదితర అన్ని అంశాలపైన ప్రత్యక్ష సమాచారం లభిస్తుంది. సమయం సద్వినియోగం.. ‘ప్రతిరోజు సుమారు 10 లక్షల మంది దక్షిణ మధ్య రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. వీరంతా ఇప్పటివరకు తాము బయలుదేరాల్సిన ట్రైన్ కోసం రైల్వే నుంచి లభించే సమాచారం పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు, ఆలస్యానికి కారణాలు వంటి సమాచారం కూడా అందుబాటులో ఉండదు. ఇక నుంచి ప్రత్యక్షంగా ఈ సమాచారమంతా లభించడం వల్ల ప్రయాణికులు తమ సమయాన్ని మరింత సమర్థంగా వినియోగించుకొనేందుకు అవకాశముంటుంది. అలాగే రైళ్ల నిర్వహణలో మరింత పారదర్శకతకు అవకాశం లభిస్తుంది.’ –దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ దక్షిణ మధ్య రైల్వేలో డీజిల్ లోకోమోటివ్స్ - 582 ఇప్పటివరకు అనుసంధానమైనవి - 334 ఇంకా అనుసంధానం కావల్సినవి - 248 అనుసంధానం కావల్సిన లోకోమోటివ్స్ - 80 లాలాగూడ, విజయవాడ వర్క్ షాపుల్లో ఉన్న మొత్తం ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్- 266 ఇప్పటివరకు అనుసంధానమైనవి - 186 -
'స్మార్ట్ టి-షర్టు..ఏం చేస్తుందో తెలుసా?
టొరంటో: శాస్త్రవేత్తలు వినూత్నమైన టీ షర్ట్‌ను రూపొందించారు. ధరించిన వారి శ్వాసను మానిటర్ చేసే స్మార్ట్ టి-షర్టును పరిశోధకులు సృష్టించారు. ఎలాంటి వైర్లు లేదా సెన్సర్ల అవసరం లేకుండానే రియల్ టైంలో ధరించిన వారి శ్వాస రేటును ఇది పర్యవేక్షిస్తుందట. శ్వాసకోశ వ్యాధులను నిర్ధారించడానికి లేదా ఉబ్బసం, స్లీప్ అప్నియా లేదా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి బాధపడుతున్న వ్యక్తులను పర్యవేక్షించడానికి ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు. కెనడాలోని లావాల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ 'స్మార్ట్ టీ షర్టును రూపొందించారు. దీని అంతర్గత ఉపరితలంపై పలుచటి వెండి పొరతో కప్పబడిన బోలుగా ఉండే ఆప్టికల్ ఫైబర్‌తో తయారు చేసిన యాంటెన్నాను షర్ట్ కాత్లో ఛాతీ స్థాయిలో అమర్చారు. ఇలా ప్రత్యేకంగా అమర్చిన ఈ యాంటెన్నా ధరించిన వ్యక్తి శ్వాస సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఇలా పంపిన డేటా యూజర్ యొక్క స్మార్ట్‌ఫోన్ లేదా సమీప కంప్యూటర్ చేరుతుంది. శ్వాసకోశ రేటు కొలిచే ఇతర పద్ధతుల మాదిరిగా కాకుండా, ఎలాంటి తీగలు, ఎలక్ట్రోడ్లు, లేదా సెన్సార్లతో సంబంధం లేకుండా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. బాహ్య పరిస్థితులకు తట్టుకునేలా ఈ ఫైబర్‌ను పాలిమర్ తో కవర్ చేసినట్టు యూనివర్శిటీ ప్రొఫెసర్, పరిశోధకుల్లో ఒకరు యునెస్ మెస్సడేక్ చెప్పారు. దీన్ని ధరించిన వ్యక్తి కూర్చున్నా, పడుకున్నా, నిలబడినా సెన్సింగ్ అండ్ ట్రాన్సిమిటింగ్ అనే రెండు విధులును ఇది విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే ఈ స్మార్ట్ టీ షర్టు అందించే డేటా విశ్వసనీయమైనదిగా తేలిందని చెప్పారు. అంతేకాదు 20 ఉతుకుల తరువాత కూడా ఈ యాంటెన్నా నీరు, డిటర్జెంట్‌ను తట్టుకోగలిగి, మంచి పని పరిస్థితిలో ఉందని ప్రొఫెసర్ చెప్పారు. ఈ అధ్యయనం సెన్సర్స్ జర్నల్ లో ప్రచురించబడింది.