ముంపు ముప్పు తప్పాలంటే మేల్కొనే తరుణమిదే | Flood Threat to Core Hyderabad Rather Than Suburban: Study | Sakshi
Sakshi News home page

ముంపు ముప్పు తప్పాలంటే మేల్కొనే తరుణమిదే

Published Wed, May 4 2022 6:56 PM | Last Updated on Wed, May 4 2022 6:56 PM

Flood Threat to Core Hyderabad Rather Than Suburban: Study - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందుంది ముంచే కాలం.. నైరుతీ రుతుపవనాల కాలం మొదలయ్యే జూన్‌ తొలివారం నుంచే మొదలు కానుంది. హైదరాబాద్‌ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం మరో 30 రోజుల్లో పొంచి ఉంది. ముంపు కష్టాలకు ఇప్పటి నుంచే కౌంట్‌ డౌన్‌ మొదలైంది. తొలకరి పలకరింపుల అనంతరం వరుసగా కురిసే వర్షాలతో నగరం చిగురుటాకులా వణకడం ఏటా జరిగే తంతు. ఈ నేపథ్యంలో ఇప్పుడే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. శివార్లతో పోలిస్తే కోర్‌సిటీకే ముంపు ముప్పు ఎక్కువని ఐఐటీ హైదరాబాద్, వాతావరణ శాఖ తాజా అధ్యయనంలో తేలింది. గత కొన్నేళ్లుగా (2013–2019 సంవత్సరాలు) డేటాను అధ్యయనం చేసిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఏకంగా 29 సార్లు నగరాన్ని వరదలు ముంచెత్తినా.. అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగకపోవడం గ్రేటర్‌ పిటీ. 

కుండపోత లెక్కలివీ.. 
► జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో 37 ఆటోమేటిక్‌ వర్షపాత లెక్కింపు కేంద్రాల్లో 118 రోజుల భారీ వర్షపాతం లెక్కలను పరిశీలించిన అనంతరం ప్రధాన నగరానికే ముంపు ముప్పు ఏటా తథ్యమని ఈ అధ్యయనం తేల్చింది.  తరచూ వర్షం కురిసిన రోజులు, తీవ్రత, నమోదైన వర్షపాతం లెక్కలను పరిశీలించారు. ప్రధానంగా రుతుపవన వర్షాలు కురిసే జూన్‌–సెప్టెంబర్‌ మధ్యకాలంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసినట్లు గుర్తించారు.  

► కొన్ని గంటల వ్యవధిలోనే కోర్‌సిటీ పరిధిలో క్యుములో నింబస్‌ మేఘాలు కుమ్మేయడంతో కుండపోత వర్షాలు కురిశాయని విశ్లేషించారు. శివార్లలోనూ భారీ వర్షాలు కురిసినప్పటికీ తీవ్రత అంతగా లేదని తేల్చారు. ప్రధాన నగరంలో పట్టణీకరణ పెరగడం, వర్షపు నీరు వెళ్లే దారి లేకుండా విస్తరించిన కాంక్రీట్‌ రహదారులు, నాలాలపై ఆక్రమణలు, బహుళ అంతస్తుల భవనాల కారణంగా ముంపు సమస్య అధికంగా ఉందని నిగ్గు తేల్చింది.  

► దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన వరదనీటి కాల్వలు కుంచించుకుపోవడమూ ఇందుకు కారణమని ఈ అధ్యయనం గుర్తించింది. ఈ వివరాలను నగరంలోని వాతావరణ మార్పులు,భారీ వర్షాల తీరుతెన్నులపై భారత వాతావరణ శాఖ ప్రచురించిన అర్బన్‌ క్లైమేట్‌ జర్నల్‌లోనూ ప్రచురించినట్లు పరిశోధకులు తేల్చారు.  

ఇరవైతొమ్మిదిసార్లు.. వరదలు.. 
నగరంలో 2013 నుంచి 2019 మధ్యకాలంలో 29 సార్లు ప్రధాన నగరాన్ని వరదలు ముంచెత్తినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రధానంగా జూన్‌–సెప్టెంబరు మధ్యకాలంలోనే 15 సార్లు వరదలు సంభవించినట్లు తెలిపింది. మార్చి –మే మధ్యకాలంలో 8 మార్లు, అక్టోబరు–డిసెంబరు మధ్యకాలంలో 5 మార్లు వరదలు ముంచెత్తాయని పేర్కొంది. జనవరి–ఫిబ్రవరి మధ్యకాలంలో ఒకసారి వరదలు సంభవించాయని తెలిపింది. 

సెంటీమీటరు మేర కురిస్తేనే..  
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏకధాటిగా ఒక సెంటీమీటరు వర్షం కురిస్తే చాలు నగరంలో వరదనీరు పోటెత్తుతోందని ఈ అధ్యయనం తేల్చింది. ఇక 24 గంటల్లో ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నగరం అతలాకుతలమవుతుందని గుర్తించింది. ప్రధానంగా 90 శాతం వరదలు జూన్‌–అక్టోబరు మధ్యకాలంలోనే తలెత్తినట్లు తేల్చింది. 2013లో 31 రోజులు, 2016లో 25సార్లు నగరంలో వరదలు భారీగా సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తమైనట్లు అధ్యయనం తెలిపింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలతోనే అధిక నష్టం వాటిల్లినట్లు తేల్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement