
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 151 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 292 మండలాల్లో సాధా రణ, 141 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నెల 21 వరకు అంచనాల ప్రకారం ఈ లెక్కలు వేశారు. అక్టోబర్‌లో ఇప్పటివరకు అధిక వర్షం నమోదైనా.. సీజన్ మొత్తంగా సరాసరి వర్షాభావ మండలాల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. అత్యధికంగా మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 17 మండలాల చొప్పున వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా వాతావరణంలో తేమ కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు.
స్వైన్ ఫ్లూతో బాలింత మృతి
హైదరాబాద్: మేడ్చల్‌లోని కటికె బస్తీలో రాజ్యలక్ష్మి(32) అనే బాలింత శనివారం స్వైన్ ఫ్లూతో మరణించింది. రాజ్యలక్ష్మి తన భర్త చిట్టిబాబు, ఇద్దరు పిల్లలతో కలసి స్థానికంగా నివాసముంటోంది. ప్రసవం కోసం పుట్టినిల్లు అయిన కామారెడ్డికి వెళ్లింది. అక్కడ జలుబు, దగ్గు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఈ నెల 17న యశోద ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్య పరీక్షల్లో స్వైన్ ఫ్లూగా నిర్ధారణ అయింది. అనంతరం 18న సిజేరియన్ ద్వారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన పాప ఆరోగ్యంగానే ఉన్నా.. రాజ్మలక్ష్మికి స్వైన్ ఫ్లూ తీవ్రం కావడంతో 20న గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. రాజ్యలక్ష్మి మరణంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.