
బెంగాల్, ఒడిశాల్లో తెరిపినివ్వని వర్షాలు
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలు ఇంకా తెరిపినివ్వడం లేదు. ఒడిశాలోని 13 జిల్లాలు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, పరిసర జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వర్షాలు, వరదల కారణంగా ఒడిశాలో మరణించిన వారి సంఖ్య అరవైకి చేరుకుంది. పై-లీన్ తుపాను తాకిడి తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిన కొద్దిరోజులకే వర్షాలు ముంచెత్తడంతో ఒడిశా అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా నయాగఢ్, జాజ్‌పూర్, భద్రక్ జిల్లాల్లో శనివారం ఇద్దరేసి మృతి చెందగా, మయూర్‌భంజ్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. కోల్‌కతాలో ఇద్దరు, బుర్ద్వాన్ జిల్లాలో ఒకరు మరణించారు.
రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుషికుల్యా, గొడాహడ, వంశధార వంటి నదులు వరదలతో పొంగి పొర్లుతుండటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించగా, కొన్ని రైళ్లు రద్దయ్యాయి. భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, హౌరా-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దుచేసినట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రకటించింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని పింఛనుదారులకు వచ్చేనెల అదనంగా ఒకనెల పింఛను చెల్లించనున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.