
పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణ గూడెంలో వర్షం ధాటికి నేలవాలిన వరి చేను
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ.. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులతో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులకు మామిడి, జీడిమామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలు చోట్ల కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్క జొన్న పంట తడిసి ముద్దయ్యింది.
ఈదురు గాలులకు కొన్ని గ్రామాల్లోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిడదవోలు–బ్రాహ్మణగూడెం రహదారిలో తాటిచెట్టు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చాగల్లులో ఐదు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలగా..కొవ్వూరు మండలంలోని పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆరికిరేవుల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ఈదురు గాలులకు నేలకూలింది.
కృష్ణా జిల్లాలో..
పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జాతీయ రహదారి పక్కనే చెట్లు కూలిపడ్డాయి. నందిగామ శివారు అనాసాగరంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మామిడికాయలు రాలిపోయాయి. దాళ్వా రైతులు ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మైలవరం, మచిలీపట్నంలో కొద్ది పాటి వర్షం పడింది. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ, మాచర్ల, రెంటచింతల, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. పల్నాడు ప్రాంతంలో కల్లాల్లో మిర్చి ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. మాచర్ల ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
పాలకొండలో వడగళ్ల వాన..
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వడగళ్ల వాన కురిసింది. కాగా, ఇప్పటి వరకు మండుటెండలతో విలవిల్లాడిన జనాలు ఈ వర్షంతో కొంతమేర ఊరట చెందారు.
Comments
Please login to add a commentAdd a comment