
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా మారనుంది. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనిప్రభావం వచ్చే నాలుగు రోజులు దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడులపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 11, 12 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విశాఖ ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు
పాడేరు: విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడురోజుల నుంచి చలిగాలులు అధికమవడంతోపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలుల తీవ్రత నెలకొంటోంది. అర్ధరాత్రి నుంచే దట్టంగా పొగమంచు కురుస్తోంది. సోమవారం జి.మాడుగులలో 10.5 డిగ్రీలు, డుంబ్రిగుడలో 10.7, పెదబయలులో 11.1, అరకులోయలో 11.4, ముంచంగిపుట్టులో 11.5, హుకుంపేటలో 12.1, పాడేరులో 12.5, చింతపల్లిలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment