రుతుపవన వర్షాలు (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడును అక్టోబర్ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. ఇంతలో బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుపాను కూడా ఈశాన్య గాలులను నిలువరించడం ద్వారా రుతుపవనాల ఆలస్యానికి కారణమైంది. ఈ నెల 25తో సిత్రాంగ్ తుపాను పూర్తిగా బలహీనపడింది.
చదవండి: కుమారుడు, భార్య.. తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా..
ఈ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రవేశం సాధారణం కంటే వారానికి పైగా ఆలస్యమవుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతటా వర్షాలు కురిపిస్తే ఈశాన్య రుతుపవనాలు మాత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రభావం చూపుతాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల పాటు ఈ రుతుపవనాలు విస్తారంగా వర్షాలను కురిపిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీమీటర్ల సాధారణ సగటు వర్షపాతం నమోదవుతుంది.
ఈ సీజనులో తుపాన్లకు ఆస్కారం..
నైరుతి రుతుపవనాల సీజన్‌లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తపానులు ఎక్కువగా ఏర్పడతాయి. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజను (అక్టోబర్–డిసెంబర్‌ల మధ్య)లో కనీసం మూడు తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ.. ఈ ఏడాది అంతకు మించి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
30 నుంచి భారీ వర్షాలకు అవకాశం
మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో వర్షాలు మొదలు కానున్నాయి. 30వ తేదీ నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అది తీవ్రరూపం దాలిస్తే రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment