సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం (22) నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అనంతరం మూడు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్తుందని తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఈ రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా భావించే తూర్పు, ఈశాన్య గాలులు రాష్ట్రంపైకి బలంగా వీస్తున్నాయి.
సాధారణంగా అక్టోబర్ 18 – 22 తేదీల మధ్య ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులో ప్రవేశిస్తాయి. ఆ వెంటనే దక్షిణ కోస్తాంధ్రలోనూ ప్రభావం చూపుతాయి. దీంతో అక్కడ వర్షాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈశాన్య రుతుపవనాల ప్రారంభ దశ బలహీనంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఫలితంగా వీటి ప్రవేశ సమయంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే తప్ప భారీ వర్షాలకు ఆస్కారం ఉండదని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment