తూత్తుకుడిలో ఇంట్లోకి వచ్చిన వరద నీరు
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం 14 జిల్లాల్లో 53 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. భారీ వర్షాలతో నదులు, చెరువులతో పాటు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పది మంది మరణించారు. శుక్రవారం ఇళ్లు కూలడంతో కడలూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు మరో ఏడుగురు బలి అయ్యారు. వర్షం మరో రెండు రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. తూత్తుకుడి జిల్లాలో వర్ష బీభత్సానికి ప్రధాన రైల్వే స్టేషన్‌ను మూసి వేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది.
ప్లాట్‌ఫామ్‌లు సైతం కనిపించనంతగా నీటితో నిండింది. మంత్రులు తమ జిల్లాలకు చేరుకుని అధికార వర్గాలతో కలిసి సహాయక చర్యల్లో మునిగారు. చెన్నైలో మోస్తరుగా వర్షం పడుతుండగా, శివార్లలో భారీగా కురుస్తోంది. 2015 డిసెంబరు 2, 3 తేదీల్లో శివార్లలో కురిసిన భారీ వర్షాల వల్ల చెన్నై నీట మునిగింది. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తూత్తుకుడిలో 19, కడలూరులో 17సెం.మీ వర్షం పడినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ భువియరసన్ తెలిపారు. తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, కడలూరులలో అతి భారీ వర్షాలు కురిశాయి. తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, విల్లుపురం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్, తేని , మదురై, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, పుదుకోట్టై, నాగపట్నం, శివగంగై జిల్లాల్లో మోస్తరుగా పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment