ten people dead
-
గల్లంతైన విమానం ఆచూకీ దొరికింది
అలాస్కా: అమెరికాలోని అలాస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. పైలట్ సహా అందులోని మొత్తం పది మందీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఉనలక్లీట్ నుంచి టేకాఫ్ తీసుకున్న సింగిల్ ఇంజిన్ సెస్నా గ్రాండ్ కారవాన్ విమానం విమానం నోమ్ సమీపంలో గల్లంతైంది. అందులో పైలట్ సహా 10 మంది ప్రయాణికులున్నారు. మరో అరగంటలో ల్యాండవనుండగా రాడార్‌తో సంబంధం కోల్పోయింది. చిట్టచివరి లోకేషన్ ఆధారంగా హెలికాప్టర్‌తో అధికారులు గాలింపు చేపట్టి, గడ్డకట్టిన సముద్ర జలాల్లో శకలాలను కనుగొన్నారు. విమానంలో సాంకేతిక లోపం, ఇతర సమస్యలపై ప్రమాదానికి ముందు ఎలాంటి హెచ్చరికలు తమకు అందలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
తమిళనాట భారీ వర్షాలు
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం 14 జిల్లాల్లో 53 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. భారీ వర్షాలతో నదులు, చెరువులతో పాటు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పది మంది మరణించారు. శుక్రవారం ఇళ్లు కూలడంతో కడలూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు మరో ఏడుగురు బలి అయ్యారు. వర్షం మరో రెండు రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. తూత్తుకుడి జిల్లాలో వర్ష బీభత్సానికి ప్రధాన రైల్వే స్టేషన్‌ను మూసి వేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది. ప్లాట్‌ఫామ్‌లు సైతం కనిపించనంతగా నీటితో నిండింది. మంత్రులు తమ జిల్లాలకు చేరుకుని అధికార వర్గాలతో కలిసి సహాయక చర్యల్లో మునిగారు. చెన్నైలో మోస్తరుగా వర్షం పడుతుండగా, శివార్లలో భారీగా కురుస్తోంది. 2015 డిసెంబరు 2, 3 తేదీల్లో శివార్లలో కురిసిన భారీ వర్షాల వల్ల చెన్నై నీట మునిగింది. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తూత్తుకుడిలో 19, కడలూరులో 17సెం.మీ వర్షం పడినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ భువియరసన్ తెలిపారు. తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, కడలూరులలో అతి భారీ వర్షాలు కురిశాయి. తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, విల్లుపురం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్, తేని , మదురై, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, పుదుకోట్టై, నాగపట్నం, శివగంగై జిల్లాల్లో మోస్తరుగా పడుతోంది. -
బస్సుకు మంటలు: పదిమంది మృతి
దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నగరంలో బస్సుకు మంటలు అంటుకున్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సు ముందుటైర్లు పేలిపోవడంతో అది డివైడర్‌కు ఢీకొని మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి మంటలు రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించేలోపే మంటలు బాగా వ్యాపించాయి. దాంతో పదిమంది లోపలే మరణించారు. మరో ఏడుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ముగ్గురు మాత్రం దీన్నుంచి బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)