నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
వాతావరణం అనుకూలిస్తే.. ఆ తర్వాత వారంలో తెలంగాణలోకి ప్రవేశం
ఈసారి సాధారణానికి మించి వానలు పడొచ్చని ఇప్పటికే అంచనా వేసిన వాతావరణ శాఖ
ప్రస్తుతం రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలకు ఆధారమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆశావహమైన రీతిలో ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ప్రస్తుతం ఇవి చురుకుగా ముందుకు సాగుతున్నాయని.. పరిస్థితి అనుకూలంగా ఉంటే వారం రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మరో వారం, పది రోజుల్లో తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది.
లానినా పరిస్థితుల నేపథ్యంలో..
గత 150 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే రుతుపవనాల రాకడ ఒకే విధంగా లేదు. 1918లో చాలా ముందుగానే అంటే మే 11వ తేదీనే నైరుతి కేరళను తాకింది. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18వ తేదీన ప్రవేశించాయి. గత ఏడాది జూన్ 8న కేరళను తాకాయి.
అంతకుముందు 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ ఒకటో తేదీన నైరుతి ప్రవేశించింది. ఈసారి లానినా పరిస్థితులు ఉండటంతో సాధారణంగా కంటే ఎక్కువే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్టు ఐఎండీ గత నెలలోనే ప్రకటించింది. మన దేశంలో సాగయ్యే పంటల్లో 52 శాతానికిపైగా నైరుతి రుతుపవనాలే ఆధారం.
మరో రెండు రోజులు వానలు
ప్రస్తుతం రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం తగ్గిందని.. వచ్చే రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
మరోవైపు ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment