రానున్న ఐదు రోజులపాటు వర్షసూచన
ఢిల్లీలో 11కు చేరుకున్న మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో భీకర వర్షం కురిసింది. ఉత్తరాదిన రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షాల ధాటికి మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. వసంత్ విహార్ ప్రాంతంలో కూలిపోయిన ఓ భవనం కింద చిక్కుకున్న ముగ్గురు కార్మికుల మృతదేహాలను శనివారం వెలికి తీశారు.
నగరంలో వరుసగా రెండో రోజూ భారీగా వర్షపాతం నమోదైంది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో 8.9 మిల్లీమీటర్లు, లోధీ రోడ్డులో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో 35.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లో అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాంగ్రా, కులూ, సోలన్ జిల్లాలో పలు రహదారులను మూసివేశారు. రాష్ట్రంలో ధరంపూర్‌లో గత 24 గంటల్లో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment