
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది బుధవారం రాత్రి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తరదిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యదిశగా వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ గురువారం ఉదయానికి ఒడిశా తీరానికి, 18వ తేదీ ఉదయానికి పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వివరించింది. మరోవైపు ఉత్తర శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, అక్కడినుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి.
వీటి ఫలితంగా రెండురోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment