Cyclone Biparjoy Updates: 30000 People From Coastal Districts Shifted To Temporary Shelters - Sakshi
Sakshi News home page

Cyclone Biparjoy: భారీ విధ్వంసం.. అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపర్‌జోయ్‌

Published Wed, Jun 14 2023 7:23 AM | Last Updated on Wed, Jun 14 2023 9:32 AM

Cyclone Biparjoy: 30000 People From Shifted To Temporary Shelters - Sakshi

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: అరేబియా సముద్రంలో కొనసాగుతున్న బిపర్‌జోయ్‌ తుపాను భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. బిపర్‌జోయ్‌ మంగళవారం అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్రమైన తుపానుగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, మాండ్వి, జఖౌ పోర్టులతోపాటు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య ఈ నెల 15 సాయంత్రం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

‘కచ్, ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్‌ జిల్లాల్లో ఈనెల 13– 15 తేదీల మధ్య అత్యంత భారీగా 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురియవచ్చు. తీవ్ర ఉధృతితో కూడిన ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కచ్, ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తి, తీవ్ర నష్టం కలిగించవచ్చు’అని ఐంఎడీ హెచ్చరించింది. ‘రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్‌ల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో ఈ నెల 15 వరకు గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

ఈ కారణంగా పంటలు, నివాసాలు, రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయి. సముద్రంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అలలు సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తవచ్చు’అని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర మీడియాకు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున చమురు అన్వేషణ, నౌకల సంచారం, చేపల వేట వంటివాటిని ఈ నెల 16 వరకు నిలిపివేయాలని ఐఎండీ తెలిపింది. తీరాన్ని దాటిన తుపాను బలహీనపడి, తన గమనాన్ని దక్షిణ రాజస్తాన్‌ వైపు మార్చుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 15–17 తేదీల్లో ఉత్తర గుజరాత్‌లో భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఈ సీజన్‌లో ఏర్పడిన మొట్టమొదటి తుపాను బిపర్‌జోయ్‌..సముద్ర జలాల అసాధారణ వేడి వల్లే ఎన్నడూ లేనంత సుదీర్ఘకాలం పాటు తుపాను కొనసాగిందని ఐఎండీ వివరించింది. ఈ నెల 6న ఏర్పడిన ఈ తుపాను మంగళవారం నాటికి 8 రోజుల 9 గంటలపాటు కొనసాగిందని తెలిపింది. 

30 వేల మంది తరలింపు 
బిపర్‌జోయ్‌ ప్రభావిత జిల్లాలకు చెందిన 30 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలోకి తరలించినట్లు గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది.తుపాను సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు ఒకరు చనిపోయినట్లు తెలిపింది. ముందు జాగ్రత్తగా మూడు రైళ్లను రద్దు చేయడంతోపాటు 55 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించినట్లు పశి్చమ రైల్వే తెలిపింది.  సముద్రంలో ఓ ఆయిల్‌ రిగ్‌పై పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని సోమవారం రాత్రి  బయటకు తీసుకువచ్చారు. కాండ్లా పోర్టును మూసివేశారు. అక్కడ పనిచేసే 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మన్సుఖ్‌ మాండవీయ సహా ఐదుగురు కేంద్ర మంత్రులు సహాయక చర్యలను సమన్వయం 
చేస్తున్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement