అహ్మదాబాద్/జైపూర్/గువాహటి/ సాక్షి, చెన్నై: బిపర్‌జోయ్ తుపాను వాయుగుండంగా మారడంతో గుజరాత్, రాజస్తాన్‌ల్లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్ బనస్కాంత జిల్లా ధనేరా తాలుకాలో వరదలు సంభవించాయని అధికారులు సోమవారం తెలిపారు. 20 వరకు పశువులు కొట్టుకుపోయాయన్నారు. వచ్చే రెండు రోజుల్లో సౌరాష్ట్ర ప్రాంతంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది.
అదేవిధంగా, రాజస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. సంబంధిత ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాలి, సిరోహి, బర్మేర్, జలోర్ జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న 265 మందిని యంత్రాంగం కాపాడింది. అజ్మేర్‌లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన వానకు స్థానిక జేఎల్‌ఎన్ ఆస్పత్రిలోకి వరద ప్రవేశించింది.
18 మంది రోగులను ఇతర వార్డులకు అధికారులు తరలించారు. రాజస్తాన్ మీదుగా ఏర్పడిన అల్పపీడనం బుధవారం కల్లా బలహీనపడుతుందని ఐఎండీ తెలిపింది. అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో పంట పొలాలు, గ్రామాలు, పట్టణాలు నీటి ముంపునకు గురయ్యాయి. లఖింపూర్‌లోని 25,200 మంది సహా మొత్తం 33,400 మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గురువారం వరకు రాష్ట్రంలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరించింది.
చెన్నైలో స్కూళ్లకు సెలవు
ఆదివారం రాత్రి నుంచి తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతోపాటు చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment