ముమ్మాటికీ చంద్రబాబే దోషి...
బాబు నిర్వాకంతోనే వరద విలయం.. ఐఎండీ హెచ్చరికలు బేఖాతరు
భారీ వర్షాలు కురుస్తున్నా కళ్లు మూసుకున్న ప్రభుత్వం
ఫ్లడ్ కుషన్ నిబంధన గాలికి..
అప్రమత్తం చేయకుండా వెలగలేరు గేట్లు ఒకేసారి ఎత్తివేత
కరకట్ట బంగ్లా మునకను కప్పిపుచ్చేందుకే
సహాయ, పునరావాస చర్యలు శూన్యం
సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను పట్టించుకోని ప్రభుత్వం
నీళ్లలో కొట్టుకొస్తున్న మృతదేహాలు.. నేలమట్టమైన గుడిసెలు.. బురద ముంచెత్తిన ఇళ్లు, వాకిళ్లు.. ధ్వంసమైన ఆస్తులు.. నిరాశ్రయులైన లక్షలాది ప్రజలు.. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురుచూపులు.. ఇప్పటివరకు 57 మందికిపైగా మృత్యువాత.. రోదనలతో అలసిన గుండెలు... అంతటా దైన్యం.. శూన్యం.. మానవ తప్పిదానికి విజయవాడ చెల్లించుకున్న మూల్యం ఇదీ! – సాక్షి, అమరావతి
వరదకు ముందు..
1 . ఐఎండీ ముందే హెచ్చరించినా..
భారీ వరదలు ముంచెత్తడం విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులకు హఠాత్‌పరిణామమే... కానీ ప్రభుత్వానికి కాదు. విజయవాడ, ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానుందని భారత వాతావరణ శాఖ (ఐంఎండీ) గత నెల 28నే (బుధవారం) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. శుక్రవారం, శనివారం వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. శనివారం రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అర్థరాత్రి దాటిన తరువాత భారీ వరద ముంచెత్తి విలయం సృష్టించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.
2. హఠాత్తుగా అన్ని గేట్లు ఎత్తి... జనాన్ని ముంచేసి
చంద్రబాబు సర్కారు మొద్దునిద్రతో పరిస్థితి విషమించి బుడమేరు వాగుకు భారీ వరద పోటెత్తింది. శనివారం అర్థరాత్రి దాటాక తెల్లవారు జాము సమయంలో వెలగలేరు 11 గేట్లను ఒకేసారి ఎత్తి వేశారు. గేట్లు ఎత్తే ముందు దిగువ ప్రాంతాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. హఠాత్తుగా గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు గాఢనిద్రలో ఉండగానే కాలనీలు, ఇళ్లను వరద ముంచెత్తి విధ్వంసం సృష్టించింది.
3. ‘ఫ్లడ్ కుషన్’ను పాటించ లేదు
వరదలు వస్తాయనే అంచనా ఉన్నప్పుడు పాటించాల్సిన విధివిధానాలను ‘ఫ్లడ్ కుషన్’ పేరిట సీడబ్ల్యూసీ నిర్దేశించింది. కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల... ఇలా వరుసగా రిజర్వాయర్లలో నీటిని దిగువకు విడిచి అవసరమైన మేరకు ఖాళీగా ఉంచాలి.
ఈ ‘ఫ్లడ్ కుషన్’ నిబంధనను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడమే విజయవాడలో వరద బీభత్సానికి మరో ప్రధాన కారణం. ‘ఫ్లడ్ కుషన్’ పాటించి ఉంటే మున్నేరు, బుడమేరు వరదకు కృష్ణాలో ఎగువ నుంచి వచ్చే వరద జత కలిసేది కాదు. ప్రకాశం బ్యారేజ్‌కి ఆ స్థాయిలో వరద వచ్చేది కాదు. భారీ వరద కృష్ణాలో లేకుంటే బీడీసీ నుంచి వచ్చే నీరు కృష్ణలోకి చేరేది. తద్వారా వరద విపత్తు ఉండేదే కాదు.
4 .కరకట్ట బంగ్లా ముంపును కప్పిపుచ్చేందుకే....
వరద ముంచెత్తడంతో చంద్రబాబు తన కరకట్ట బంగ్లాను ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆ బంగ్లా సమీపంలోకి మీడియా ప్రతినిధులు వెళ్లకుండా కట్టడి చేశారు. తన బంగ్లా అక్రమ నిర్మాణమనే గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనన్నదే ఆందోళన మినహా వరదలను సమర్థంగా ఎదుర్కోవాలనే కనీస ధ్యాస ఆయనకు లేకుండా పోయింది.
5 . 57 మందికిపైగా మృత్యువాత... అపార నష్టం
వాతావరణ పరిజ్ఞానం, సమాచార–సాంకేతిక వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన తరువాత కూడా విజయవాడలో వరదలు ఇంత విధ్వంసం సృష్టించడం పట్ల యావత్ దేశం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇంతటి విపత్తుకు, విషాదానికి కారణం ఎవరంటే?.. అన్ని వేళ్లూ ముఖ్యమంత్రి చంద్రబాబునే దోషిగా చూపిస్తున్నాయి. అవును... ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం... ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడిన నేరం... దుర్మరణాలు కావవి చంద్రబాబు చేసిన హత్యలు... ఇదంతా ప్రభుత్వం సృష్టించిన విలయం. ప్రజలకు వరదలను మించిన విపత్తు చంద్రబాబేనేనది నిరి్వవాదాంశం!
6 .వరద వచ్చిన తర్వాత.. వన్‌మేన్ షో.. పబ్లిసిటీ స్టంట్
ఒకపక్కన వరద బాధితులు అల్లాడుతుంటే మీడియాలో ప్రచారం కోసం చంద్రబాబు చీప్ ట్రిక్స్‌కు పాల్పడ్డారు. అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించడం ముఖ్యమంత్రి బాధ్యత. చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ సహా యావత్ ఉన్నతాధికారులను తన చుట్టూ మోహరించారు.
ఏదో సెమినార్ నిర్వహిస్తున్నట్టుగా దాదాపు 70 మంది ఉన్నతాధికారులను ఎదురుగా కూర్చోబెట్టి గంటల తరబడి ఉపన్యాసాలిచ్చారు. అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టుకుని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన బోటు ఎక్కినా... జేసీబీ ఎక్కినా... కాలి నడకన వెళ్లినా... యావత్ అధికార యంత్రాంగం పిలిస్తే పలికేంత దగ్గరలోనే ఉండాలి.
ఇక చంద్రబాబు అడుగుతీసి అడుగు వేస్తే చాలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ.. మీడియాకు విడుదల చేస్తూ... వీడియో క్లిప్‌లతో రీల్స్ చేస్తూ పబ్లిసిటీ స్టంట్‌ను పతాకస్థాయికి చేర్చారు. దీంతో వరద బాధితులను పట్టించుకునే తీరిక, ఓపిక ఉన్నతాధికారులకు లేకుండా పోయాయి.
7 . సహాయ, పునరావాస చర్యలు శూన్యం
వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితుల కోసం శిబిరాలను ఏర్పాటు చేయలేదు. ఆరు లక్షల మంది వరదలో చిక్కుకుంటే తరలించేందుకు కనీసం 500 బోట్లను కూడా సిద్ధం చేయలేదు. బాధితులకు పట్టెడన్నం పెట్టలేదు. పాల ప్యాకెట్లు, తాగునీరు అందించలేదు. ఆరు రోజులైనా సరే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయింది. బంధువులు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహాయంపైనే బాధితులు ఆశ పెట్టుకున్నారు.
8 . అధికారులకు బెదిరింపులు.. ప్రతిపక్షంపై నిందలు
వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ఆ తప్పును యంత్రాంగంపైకి నెట్టి వేయడంతోపాటు గత ప్రభుత్వ వైఫల్యంతోనే వరదలు వచ్చాయంటూ వితండవాదం వినిపించారు. ‘అధికారులు పని చేయడం లేదు...కొంతమంది ఉద్దేశపూర్వకంగాప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తు న్నారు... సస్పెండ్ చేస్తా... సంగతి తేలుస్తా... అంతుచూస్తా’ అంటూ మీడియా కెమెరాల ముందు హైడ్రామాకు తెరతీశారు.
అసలు అధికారులను ఎక్కడ పని చేయనిచ్చారు? ‘అంతా నేనే.. ’ అనే ప్రచార యావతో బాధితులను నిండా ముంచారు. తన తప్పులు దాచిపెట్టి బుడమేరుకు గేట్లే లేవంటూ ప్రతిపక్షాన్ని తప్పుపట్టారు. సహాయ పునరావాసాలపై నిలదీసినందుకు ప్రతిపక్షంపై నిందలతో విరుచుకుపడ్డారు.
9 . సచివాలయ, వలంటీర్ వ్యవస్థను పక్కనపెట్టేసి...
ప్రతి 2 వేల ఇళ్లకు ఓ గ్రామ/వార్డు సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌తో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలన్న యోచనే చంద్రబాబుకు లేకుండా పోయింది. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను సద్వినియోగం చేసుకుని ఉంటే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉండేది. ఏ వీధిలో ఎంతమంది ఉన్నారు...?
వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఎంతమంది? అనే పూర్తి వివరాలు తెలిసేవి. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, తాగునీరు, పాల ప్యాకెట్లు సక్రమంగా సరఫరా చేయగలిగేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దుగ్దతో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు పక్కనపెట్టేశారు. దీంతో సహాయ, పునరావాస సేవల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
10 . మళ్లీ వరదొస్తున్నా తీరుమారని ప్రభుత్వం
ఓసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు...కానీ అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తుంటే అది కచ్చితంగా ప్రజలపట్ల నిర్లక్ష్యమే అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం అదే రీతిలో అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. వరద వస్తుందని ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే లోతట్టు ప్రాంతాలప్రజలను అప్రమత్తం చేయకుండా టీడీపీ ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది.
కాగా గత రెండు రోజులుగా బుడమేరకు మళ్లీ వరద వస్తున్నా కూడా లోతట్టు ప్రాంతాలవారికి కనీస సమాచారం ఇవ్వడం లేదు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యతి్నంచడం లేదు. గురువారం రాత్రి వరద పెరిగింది... అయినా సరే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయలేదు. శుక్రవారం రాత్రి కూడా వరద పెరుగుతున్నా సరే పట్టించుకోకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, బరితెగింపునకు నిదర్శమని పరిశీలకులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment