సాక్షి, విశాఖపట్నం/అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారనుంది. అనంతరం తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 10 నాటికి తుపానుగా బలపడనుంది. ఆపై ఈ తుపాను మొదట్లో 11వ తేదీ వరకు ఉత్తర, వాయవ్య దిశగా కదులుతుంది.
ఆ తర్వాత మలుపు తిరిగి మరింత బలపడి ఉత్తర, ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.
మళ్లీ సెగలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. తుపానుగా బలపడనుందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో వానలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. అందుకు భిన్నంగా తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండకపోవడంతో వర్షాలకు బదులు ఎండలు విజృంభించనున్నాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఉపరితల ద్రోణి, అల్పపీడనంతో అనుసంధానమై ఉంది.
ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలో మళ్లీ సెగలు మొదలు కానున్నాయి.
పిడుగులు పడి ముగ్గురి దుర్మరణం
కర్నూలు జిల్లాలో సోమవారం పిడుగులు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామంలో నౌనేపాటి(38) అనే వ్యక్తి పత్తికొండ నుంచి ఆటో టాప్‌పై కూర్చుని ప్రయాణిస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(36) చిన్న మల్కాపురం గ్రామానికి పనికి వెళ్లగా.. పిడుగు పడటంతో మరణించింది.
మరో నలుగురు గాయపడ్డారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట బొల్లవరం గ్రామానికి చెందిన ఆవుల విష్ణు(18) గొర్రెలు మేపేందుకు వచ్చి పగిడ్యాల–కొణిదేల రహదారి మధ్య పొలాల్లో పిడుగుపాటుకు గురై మరణించాడు.
Comments
Please login to add a commentAdd a comment