రేపు తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
బంగ్లాదేశ్–పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం
నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
ఆపై మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
కర్నూలు జిల్లాలో భారీ వర్షం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో శనివారం ఉదయానికి తుపానుగా మారనుంది. అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర తుపానుగా బలపడనుంది. తరువాత అదే దిశలో కదులుతూ ఆదివారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాల మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
దీని ప్రభావంతో శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లోను, ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
కర్నూలు జిల్లాలో 14.7 సెంటీమీటర్ల వర్షపాతం
శుక్రవారం కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా తళ్లగోకులపాడులో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడలో 10.3, యలమంచిలి (అనకాపల్లి జిల్లా) 4.5, నెల్లిమర్ల (విజయనగరం) 4.3, చింతపల్లి (అల్లూరి సీతారామరాజు)లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
మళ్లీ వడగాడ్పుల ఉధృతి
తుపాను ప్రభావం రాష్ట్రంపై లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వడగాడ్పులు క్రమంగా ఉధృతమవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో తొమ్మిది మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం 35 (విజయనగరం జిల్లాలో 15, శ్రీకాకుళంలో 10, పార్వతీపురం మన్యంలో 5, అనకాపల్లిలో 5) మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 14 (పార్వతీపురం మన్యం జిల్లాలో 6 శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4) మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 64 (విజయనగరం జిల్లాలో 20, శ్రీకాకుళంలో 17, పార్వతీపురం మన్యంలో 8, కృష్ణాలో 7, అనకాపల్లిలో 6, విశాఖపట్నంలో 2, ఏలూరులో 2, తూర్పు గోదావరిలో 1, బాపట్లలో 1) మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment