సాక్షి, అమరావతి/విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం అదే తీవ్రతతో నెమ్మదిగా కొనసాగుతూ రానున్న 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
అనంతరం క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని వివరించింది.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణ కోస్తా–తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి బాగా పెరిగే అవకాశం ఉంది.
అల్లకల్లోలంగా సముద్రం
వాయుగుండం ప్రభావంతో ఆదివారం తిరుపతి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Rain Alert: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
Published Mon, Nov 21 2022 5:29 AM | Last Updated on Mon, Nov 21 2022 8:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment