south coastal andhra pradesh
-
ఎట్టకేలకు వానలు!
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి మారడం, విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే, ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. ఒకట్రెండు చోట్ల అదీ స్వల్పంగానే వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే అల్పపీడన ద్రోణులు గానీ, ఉపరితల ఆవర్తనాలు గానీ, బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ ఏర్పడాలి. వాటివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయి. కానీ దాదాపు నెల రోజులుగా ద్రోణులు, ఆవర్తనాల జాడ లేదు. వర్షాలకు దోహదపడే నైరుతి రుతుపవనాల ద్రోణి కూడా మూడు వారాలకు పైగా దక్షిణాది వైపునకు రాకుండా హిమాలయాల ప్రాంతంలోనే ఉండిపోయింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఆగస్టు నెల వర్షపాతం సాధారణంకంటే 54 శాతం, నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభం నుంచి ఆగస్టు ఆఖరు వరకు చూస్తే 25 శాతం తక్కువగా నమోదైంది. ఈ తరుణంలో రుతుపవన ద్రోణిలో కదలిక రావడం, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురిసేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. దాదాపు నెలరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలకు ఈ వానలు ఎంతగానో ఊరట కలిగించనున్నాయి. -
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై నోరు మెదపని రైల్వే బడ్జెట్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ విశాఖపట్నం రైల్వే జోన్ కూత వినిపించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బుధవారం 2023–24 వార్షిక బడ్జెట్లో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అయిన విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఆచరణలోకి తీసుకువచ్చే అంశంపై కేంద్రం మౌనం దాల్చింది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఇచ్చిన హామీకి కట్టుబడి రైల్వే జోన్‌ను ఆచరణలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కీలక ప్రతిపాదనలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. అయినప్పటికీ కేంద్ర వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. బడ్జెట్లో రైల్వేశాఖకు కేటాయింపులపై పూర్తి వివరాలతో బ్లూ బుక్ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం విధానమేమిటన్నది స్పష్టం కాదు. ‘బ్లూ బుక్’ వస్తేనే.. కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు కేటాయింపులపై సమగ్ర వివరాలతో ‘బ్లూ బుక్’ శుక్రవారం విజయవాడలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయానికి చేరుతుంది. అది వస్తేగానీ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కేటాయింపులు ఏమిటన్నది తెలియదు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, కొత్త లైన్ల కోసం సర్వేలు, కొత్త ఆర్వోబీల నిర్మాణం, ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు, కొత్త రైళ్ల కేటాయింపులు మొదలైన అంశాలపై అప్పుడే స్పష్టత వస్తుంది. స్పష్టత ఇవ్వని కేంద్రం.. రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను కొన్ని నెలల క్రితమే సూత్రప్రాయంగా ప్రారంభించినప్పటికీ.. జోన్ వాస్తవంగా ఆచరణలోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఈసారి కేంద్ర బడ్జెట్లో అయినా స్పష్టత వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎలాంటి స్పష్టతను కేంద్రం ఇవ్వలేదు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాలకోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల రూ.170 కోట్లు కేటాయించింది కూడా. కానీ రైల్వే జోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసుకువచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఆచరణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా! ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దు చేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లతోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై విశాఖపట్నంతోపాటు యావత్ రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివిజన్‌ను ఏకంగా రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. ఆయన కూడా ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తూ విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
IMD Alert: నెలాఖరులోగా మరో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: కొద్దిరోజుల కిందట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది గురువారం పూర్తిగా బలహీనపడనుంది. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీనిఫలితంగా రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. నెలాఖరులోగా ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. -
Rain Alert: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం అదే తీవ్రతతో నెమ్మదిగా కొనసాగుతూ రానున్న 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అనంతరం క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణ కోస్తా–తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి బాగా పెరిగే అవకాశం ఉంది. అల్లకల్లోలంగా సముద్రం వాయుగుండం ప్రభావంతో ఆదివారం తిరుపతి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. పలు చోట్ల వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 40 మి.మీ, మచిలీపట్నంలో 24, కొవ్వూరులో 23, చంద్రగిరిలో 20, అల్లవరంలో 10, మామిడికుదురులో 9 మి.మీ. వర్షపాతం నమోదైంది. (చదవండి: డైవర్షన్ డ్యాం పవర్‌గేట్‌లో సాంకేతిక లోపం) -
రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. మరోవైపు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీనికితోడు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తూర్పు పశ్చిమ ద్రోణి ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో రెండురోజులపాటు కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ నెల 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 5 సెం.మీ., కూనవరం, నర్సీపట్నం, బెస్తవానిపేట, చోడవరం, కుంభం, కొమరాడల్లో 3 సెం.మీ. వంతున, సత్యవేడు, సీతానగరం, సూళ్లూరుపేట, ఇచ్ఛాపురం, వరరామచంద్రాపురం, సాలూరు, యర్రగొండపాలెం, చింతపల్లిల్లో 2 సెం.మీ. వంతున వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరి మృతి సాక్షి, అమరావతి బ్యూరో/నగరం(రేపల్లె): గుంటూరు జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరం మండలం వీరంకివారిపాలెం పంట పొలాల్లో సోమవారం పిడుగుపడి చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన కత్తి శ్రీను (41) మృతిచెందాడు. అతడు పంట పొలంలో ఎలుకల బుట్టలు పెడుతున్న సమయంలో సమీపంలో పిడుగుపడింది. శ్రీను మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.వాసు చెప్పారు. మరోవైపు వరద కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల్లో నీరు తగ్గింది. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కలెక్టర్‌తో చర్చించారు. -
దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు !
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను అనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణకోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరకోస్తాలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. -
దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు
విశాఖపట్నం: దక్షిణ కోస్తాని అనుకుని అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఆ అల్పపీడనం మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణకోస్తాలో ఈ రోజు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఉత్తరకోస్తాలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని... కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది. -
దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు
-
దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు
విశాఖపట్నం: తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉత్తర కోస్తాపై కూడా కొంత ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. దీంతో ఉత్తర కోస్తాలో చిరు జల్లులు పడతాయని పేర్కొన్నారు. శ్రీలంక నుంచి తమిళనాడు వరకు ఉపరితల అవర్తనం వ్యాపించి ఉందని అధికారులు వెల్లడించారు. -
బంగాళాఖాతంలో వాయుగుండం: విశాఖ తుఫాన్ కేంద్రం
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం గురువారం వెల్లడించింది. ఆ వాయుగుండం నెల్లూరు - తమిళనాడు తీరాల మధ్య 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో కృష్ణపట్నం, పలు ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.