సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి మారడం, విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి.
వీటి ఫలితంగా శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది.
సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే, ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. ఒకట్రెండు చోట్ల అదీ స్వల్పంగానే వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే అల్పపీడన ద్రోణులు గానీ, ఉపరితల ఆవర్తనాలు గానీ, బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ ఏర్పడాలి. వాటివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయి. కానీ దాదాపు నెల రోజులుగా ద్రోణులు, ఆవర్తనాల జాడ లేదు. వర్షాలకు దోహదపడే నైరుతి రుతుపవనాల ద్రోణి కూడా మూడు వారాలకు పైగా దక్షిణాది వైపునకు రాకుండా హిమాలయాల ప్రాంతంలోనే ఉండిపోయింది.
వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఆగస్టు నెల వర్షపాతం సాధారణంకంటే 54 శాతం, నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభం నుంచి ఆగస్టు ఆఖరు వరకు చూస్తే 25 శాతం తక్కువగా నమోదైంది. ఈ తరుణంలో రుతుపవన ద్రోణిలో కదలిక రావడం, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురిసేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. దాదాపు నెలరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలకు ఈ వానలు ఎంతగానో ఊరట కలిగించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment