బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం గురువారం వెల్లడించింది. ఆ వాయుగుండం నెల్లూరు - తమిళనాడు తీరాల మధ్య 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో కృష్ణపట్నం, పలు ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.