సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వస్తోంది. వారం రోజుల కిందట ఈ రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి సకాలంలోనే ప్రవేశించాయి. తర్వాత అవి ఊహించిన దానికంటే నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి.
ఒకటి, రెండురోజుల్లో ఈ రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోని కొన్ని ప్రాంతాలకు, అనంతరం మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి వెల్లడించింది. ఐఎండీ ముందుగా అంచనా వేసినట్టుగా జూన్ 4వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు మెరుగుపడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న మూడురోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
బుధవారం కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. రానున్న మూడురోజులు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి, రెండుచోట్ల పిడుగులు పడొచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment