తిరువనంతపురం/న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: నైరుతీ రుతుపవనాలు నేడు(జూన్ 8న) కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేరళలోని పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో కేరళలోని పలు జిల్లాలను హెచ్చరిస్తూ ఐఎండీ రెడ్, ఆరంజ్, యెల్లో అలర్టులను జారీచేసింది. ఈ విషయమై వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘జూన్ 1న కేరళను తాకాల్సిన నైరుతీ రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా కేరళకు వస్తున్నాయి.
దీనిప్రభావం మిగతా రాష్ట్రాలపై కూడా ఉంటుంది. కేరళ, కర్ణాటక తీరప్రాంతంలో జూన్ 9న అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. దీనివల్ల వాయవ్య దిశలో రుతుపవనాలు వేగంగా కదులుతాయి’ అని తెలిపారు. గతేడాది కేరళలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఏకంగా 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.ఈ విషయమై కేరళ విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి శేఖర్ స్పందిస్తూ.. భారీ వర్షాలు, వరదల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు హ్యాండ్‌బుక్ జారీచేశామని తెలిపారు.
ఉత్తరాది మరింత భగభగ
రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, జార్ఖండ్, బిహార్‌లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశ ముంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో శుక్రవారం అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, రాజస్తాన్‌లోని చురులో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. హరియాణాలోని భివానీ జిల్లాలో 43.1 డిగ్రీలు, చండీగఢ్‌లో 40 డిగ్రీలు, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర, మధ్యభారతంలో అధిక ఉష్ణోగ్రతలు మరోవారం రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment