నేడు, రేపు విస్తారంగా వానలు! | rains today and tomorrow | Sakshi
Sakshi News home page

నేడు, రేపు విస్తారంగా వానలు!

Published Thu, Jun 27 2024 4:51 AM | Last Updated on Thu, Jun 27 2024 4:51 AM

 rains today and tomorrow

అక్కడక్కడ భారీ వర్షాలు

గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు

ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గురువారం, శుక్రవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని బుధవారం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ప్రస్తుతం మధ్య గుజరాత్‌ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉంది. 

వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

అలాగే గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 

శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది. కాగా బుధవారం అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 7.4 సెం.మీ, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 7.01 సెం.మీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 6.08 సెం.మీ వర్షం కురిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement