రాష్ట్రంపై ప్రభావం అంతంతమాత్రమే
రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల మీద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారి.. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం.. బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశాలున్నాయి.
ఈ వాయుగుండం ప్రభావం బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌పై ఎక్కువగా ఉంటుంది. ఏపీపై ఎలాంటి ప్రభావం చూపదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు.. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. అదేవిధంగా.. ఉపరితల ద్రోణి కర్ణాటక, కొమొరిన్ ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది.
వీటి ప్రభావంతో రాయలసీమలో నేడు ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. అయితే.. వాయుగుండం తేమగాలుల్ని తీసుకుపోవడం వల్ల మరో మూడు రోజుల పాటు ఉక్కపోత కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment