
రాయలసీమలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి కోస్తా ఒడిస్సా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.బుధవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని.. సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉన్న ద్రోణి సముద్రమట్టం నుంచి 1.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీన పడింది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వేడి, ఉక్కపోతతో అసౌకర్య వాతావరణం ఉంటుందని తెలిపింది.