
విశాఖలో ప్రారంభమైన టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు
యూఎస్–భారత్ రక్షణ భాగస్వామ్యం సంక్షోభాలను దృఢంగా ఎదుర్కొంటోంది
భారత్‌లో యూఎస్ ఎంబసీ రక్షణ వ్యవహారాల ప్రతినిధి ఆండ్రూస్
సాక్షి, విశాఖపట్నం: ఇండో – పసిఫిక్ ప్రాంతాన్ని ప్రపంచ దేశాలకు సురక్షిత మార్గంగా చెయ్యడమే భారత్, యూఎస్ ముందున్న ప్రధాన లక్ష్యమని భారత్‌లో యూఎస్ ఎంబసీ రక్షణ వ్యవహారాల ప్రతినిధి జోర్గాన్ కె.ఆండ్రూస్ స్పష్టం చేశారు. భారత్–యూఎస్ దేశాల త్రివిధ దళాలతో నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్–25 నాలుగో ఎడిషన్ విన్యాసాలు మంగళవారం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి.
భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్‌ఎస్ జలాశ్వ యుద్ధ నౌకపై ఈఎన్‌సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనాతో కలిసి ఆండ్రూస్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆండ్రూస్ మాట్లాడుతూ కేవలం యుద్ధ వాతావరణంలో మాత్రమే కాకుండా..విపత్తుల సమయంలో పరస్పర సహకారం అందించడంలో దేశాలు ఎంత గొప్పగా కలిసి పనిచేస్తాయో చాటిచెప్పేందుకు టైగర్ ట్రయాంఫ్ ఒక గొప్ప ఉదాహరణ అని అభివర్ణించారు. భారత్–అమెరికా రక్షణ దళాలు విశాఖలో మోహరించి.. ఉమ్మడి లాజిస్టిక్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
సైనిక సంసిద్ధత కాదు.. సహాయ సహకారాలే ముఖ్యం: వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా
నౌకాదళాలకు కేవలం సంసిద్ధత మాత్రమే కాకుండా.. విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందిపుచ్చుకునేలా పరస్పర అవగాహన కలిగి ఉండటమే ప్రధాన లక్ష్యమని.. ఈ విషయంలో భారత్–అమెరికాలది దృఢమైన బంధమని తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా అన్నారు. యూఎస్‌తో వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సహకార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని స్పష్టం చేశారు.
సరిహద్దు వివాదాల నుంచి దేశాన్ని రక్షించడమే కాకుండా.. ప్రతి పౌరుడుకి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించడమే రక్షణ దళాల ముందున్న అతి పెద్ద సవాల్ అన్నారు. టైగర్ ట్రయాంఫ్‌ని విజయవంతంగా నిర్వహించి..సత్తా చాటుతామని సక్సేనా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ సుశీల్ మీనన్, యూఎస్‌ఎస్ కామ్‌స్టాక్ షిప్ కమాండింగ్ ఆఫీసర్ బైరాన్‌స్టాక్స్, యూఎస్, భారత్‌కు చెందిన నావికులు, త్రివిధ దళాల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
విశాఖ, కాకినాడలో టైగర్ ట్రయాంఫ్
అధికారికంగా మంగళవారం ప్రారంభమైనా..టైగర్ ట్రయాంఫ్ హార్బర్ ఫేజ్ విన్యాసాలు బుధవారం నుంచి విశాఖలో మొదలవనున్నాయి. 8 నుంచి కాకినాడలో సీ ఫేజ్ విన్యాసాలు జరగనున్నాయి.
కాకినాడలో సంయుక్తంగా కమాండ్ సెంటర్
విన్యాసాల్లో భాగంగా కాకినాడలోని నేవల్ ఎన్‌క్లేవ్‌లో భారత్, యూఎస్ మెరైన్‌లు సంయుక్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తున్నాయి. 11, 12 తేదీల్లో ఉమ్మడి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తాయి. 13న విశాఖ తీరంలో యూఎస్‌ఏ కామ్‌స్టాక్స్ యుద్ధ నౌకలో ముగింపు ఉత్సవాలు జరగనున్నాయని భారత నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.
భారత్ తరపున
» ఐఎన్‌ఎస్ జలాశ్వ
» ఐఎన్‌ఎస్ ఘరియాల్
» ఐఎన్‌ఎస్ ముంబై యుద్ధ నౌకలు
» సుదీర్ఘ శ్రేణి మారీటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ పీ8ఐ
» పీ91 ఆర్మిట్రూప్స్
» 12 మెక్ ఇన్‌ఫ్రాంటీ బెటాలియన్ నుంచి ఆర్మీ దళాలు
» ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ–130 ఎయిర్‌క్రాఫ్ట్
» ఎంఐ–17 హెలికాఫ్టర్లు
» ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్(ఆర్‌ఏఎంటీ)
అమెరికా నుంచి
యూఎస్‌ఎస్ కామ్‌స్టాక్స్
» యూఎస్‌ఎస్ రాల్ఫ్ జాన్సన్ యుద్ధ నౌకలు
» మెరైన్ డివిజన్ దళాలు
సొమ్మసిల్లిన రక్షణ సిబ్బంది..
మంగళవారం ఉదయం 9 గంటలకు టైగర్ ట్రయాంఫ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇరు దేశాల రక్షణ సిబ్బంది.. మార్చ్‌పాస్ట్ విన్యాసాల కోసం ఎండలోనే ఐఎన్‌ఎస్ జలాశ్వ ఆన్‌బోర్డ్‌పై నిలబడ్డారు. అయితే.. గంటన్నర ఆలస్యంగా ప్రారంభం కావడంతో.. ఎండధాటికి విలవిల్లాడారు. ఆర్మీ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సైనికులు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వారిని నీడ ప్రదేశంలోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు.