
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది.
అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నేడు వానలు కురిసే జిల్లాలు
మంగళవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు ఎక్కడెక్కడ కురుస్తాయంటే..
బుధవారం పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉంది.
మూడో రోజు మోస్తరు వర్షాలు
గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏఎస్‌ఆర్, కాకినాడ, తూర్పు గోదావరి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా.. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 9.3, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 8.2, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 8.2, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.