
మరింత ఉధృతం కానున్న ఎండలు
45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం
రైల్వేలను అప్రమత్తం చేసిన ఐఎండీ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని వడగాడ్పులు వదలడం లేదు. మండుటెండలు ప్రజలకు ఏమాత్రం ఉపశమనం కలిగించడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అదుపు తప్పుతూనే ఉన్నాయి. సాధారణం కంటే 3నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో వడగాడ్పులు, మరికొన్ని జిల్లాలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మంగళవారం కూడా ఇవి కొనసాగాయి.
రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42–45 డిగ్రీలు రికార్డయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా డోన్, బనగానపల్లి (నంద్యాల), కొత్తవలస, జామి (విజయనగరం)లలో 44.9 డిగ్రీలు, కాజీపేట (వైఎస్సార్) 44.6, గోస్పాడు (కర్నూలు)లో 44.2, మహానంది, చీడికాడ, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, సారవకోట (శ్రీకాకుళం)లో 43.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఫలితంగా 66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 84 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు, గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 109 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు మండలాల్లో 43–45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాకు తేలికపాటి వర్షాలు
దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ దిశగా దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని పేర్కొంది.
రైల్వేలకు అలర్ట్
వడగాడ్పుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వేలను ఐఎండీ అప్రమత్తం చేసింది. వడగాడ్పుల ప్రభావం రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వీటి పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌లపైన, బోగీల్లోనూ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ప్లాట్‌ఫామ్‌లపై చల్లదనం కోసం కూల్ రూఫ్‌లు, నీడనిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించింది.