ఢిల్లీలో వేసవితాపం తట్టుకోవడానికి కూలర్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించిపోవడంతో భారత వాతావరణ శాఖ(ఐఎండీ)ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హరియాణా, చండీగఢ్, రాజస్తాన్‌లకు మరో రెండు రోజుల పాటు ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది. వడగాడ్పులు వీచే ప్రమాదమున్నందున తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్లు ఐఎండీ పేర్కొంది. వచ్చే 2, 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు కావచ్చని హెచ్చరించింది.
ఈ వేసవిలో రెడ్ అలర్ట్ జారీ చేయడం ఇదే మొదటిసారని తెలిపింది. ఉత్తర, మధ్య భారత్‌లో ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు వానలు కురియడంతో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని పిలానీలో శనివారం అత్యధికంగా 46.7 డిగ్రీలు నమోదైంది. పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, విదర్భల్లో వచ్చే అయిదు రోజుల్లో తీవ్ర వడగాడ్పులు వీచేందుకు అవకాశ ముందని ఐఎండీ పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, యానాం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3, 4 రోజుల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీస్తాయంది. వాతావరణ పరిస్థితుల్లో తీవ్రతను బట్టి గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే రోజులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించడమే రెడ్ అలర్ట్ ఉద్దేశం. ఈనెల 28వ తేదీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త నరేశ్ కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment