ఈ వేసవిలో తీవ్ర వడగాడ్పుల రోజులు ఎక్కువ ఉండే ఛాన్స్
వడదెబ్బ తీవ్రత కూడా పెరిగే అవకాశం
సాధారణంకంటే 5–8 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు
మార్చి మూడో వారం నుంచే హీట్ వేవ్స్ ప్రతాపం
భారత వాతావరణ శాఖ అంచనా
సాక్షి, విశాఖపట్నం:ఈ ఏడాది వేసవి దడ పుట్టించనుంది. అసాధారణ ఉష్ణోగ్రతలతో అల్లాడించనుంది. ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తూ హాట్‌హాట్‌గా ఉండనుంది. రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా అదే అంచనాకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లోకెల్లా మే నెలలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుంది.
ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 5–8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇవి ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. అందువల్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లో వేసవికాలంలో సగటున 5–6 రోజులు వడగాడ్పులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ నాలుగో వారం వరకు సుదీర్ఘంగా వేసవి తీవ్రత కొనసాగింది. దీంతో 17 రోజులు వడగాడ్పులు వీచాయి. ఈ వేసవిలో 2019 నాటి ఉష్ణోగ్రతలు పునరావృతం కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఎండాకాలంలో ఉష్ణతీవ్రత కోస్తాంధ్రలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త కరుణాసాగర్ ‘సాక్షి’కి చెప్పారు. వేసవిలో రెండు రోజులకు మించి సాధారణం కంటే 4–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే హీట్ వేవ్స్ గాను, 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వడగాడ్పుల (హీట్ వేవ్స్)కు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు.
రాత్రి ఉష్ణోగ్రతలు సైతం..
మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైతే వాతావరణం కాస్త చల్లబడి ఉపశమనం కలిగిస్తుంది. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. దీంతో పగలు (గరిష్ట), రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఎక్కువ ఉష్ణతాపం అనుభూతి కలగనుంది.
ఇటీవల ముగిసిన శీతాకాలం సీజన్ కూడా అంతగా చల్లదనం లేదు. సీజన్ మొత్తమ్మీద ఒక్క రోజు కూడా కోల్డ్ వేవ్స్ (అతి శీతల పవనాలు) వీయలేదు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలకు మించి తక్కువగా నమోదు కాకపోవడంతో శీతల ప్రభావం చూపలేదు. దీని ప్రభావం కూడా ఈ వేసవిపై పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా.. ఎల్‌నినో పరిస్థితులు కూడా జూన్ ఆరంభం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధిక ఉష్ణతాపం, వడగాడ్పులు కొనసాగనున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎల్‌నినో ఉంటుంది. ఆ తర్వాత లానినా పరిస్థితులతో సముద్ర ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారనున్నాయి.
అనంతపురంతో ఆరంభం
రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల అప్పుడే మొదలైంది. వేసవి సీజన్ ఆరంభంలోనే అనంతపురంలో శనివారం 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం. కర్నూలు, నంద్యాల, నందిగామ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment